జగన్ కి ఆటంకాలన్నీ అక్కడే , అయినా అవకాశాలుగానే

అఖండ విజయంతో జన హృదయాలు గెలుచుకున్న జగన్ కి ఏడాది పాలనలో ఎదురులేకుండా పోయింది. అనేక కీలక నిర్ణయాలతో పాలనా వ్యవస్థనే సమూలంగా మార్చేసే రీతిలో ఆయన వ్యవహరించారు. అటు అసెంబ్లీలోనూ ఇటు ప్రజల్లోనూ బలం లేని ప్రతిపక్షం నుంచి పెద్దగా అడ్డంకులు లేకుండా పోయింది. అయితే అన్ని సందర్భాల్లోనూ జగన్ ఎజెండాకి అడుగడుగునా అడ్డంకులు న్యాయవ్యవస్థ నుంచే ఎదురయ్యాయి. ఇప్పటికే అది సుస్పష్టంగా కనిపిస్తోంది. జగన్ ఏడాది పాలనలో సుమారు ఆరు నెలలుగా నేరుగా న్యాయవ్యవస్థ నుంచి ఆయన ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. అయినా తన మార్క్ పాలన విషయంలో ముందుకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కాలం కీలకంగా మారబోతోంది

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఏపీ భవిష్యత్ నే సమూలంగా మార్చేసే రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన నవంబర్ తర్వాత వరుసగా పలు నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా అడుగులు వేస్తన్నారు. అందులో భాగంగానే పాఠశాల విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు చట్టం రూపొందించారు. అదే సమయంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల తీసుకున్న సంచలన నిర్ణయాలు నేటికీ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అందులో భాగంగానే పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఏపీలో జగన్ ప్రభుత్వ నిర్ణయం తర్వాత జార్ఖండ్ సహా పలు రాష్ట్రాలు అలాంటి ప్రతిపాదనలు చేసి ముందుకు వెళుతుండగా ఏపీలో మాత్రం ఈ వ్యవహారం ఇంకా నలుగుతూనే ఉంది.

చివరకు రాజధానుల అంశమే శాసనమండలి రద్దు నిర్ణయానికి దారితీసింది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల వ్యవహారం మరో సంచలనంగా చెప్పవచ్చు. చివరకు రాష్ట్ర ఎన్నికల అధికారిని సాగనంపేందుకు తగ్గట్టుగా ఆర్డినెన్స్ సిద్ధం చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. మధ్యలో రాజధాని తరలింపుపై కోర్టు తీర్పులు, పంచాయితీ కార్యాలయాలకు వేసిన రంగులు, మాజీ ఇంటిలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సస్ఫెన్షన్ సహా పలు నిర్ణయాలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఇవన్నీ న్యాయస్థానాల పరిధికి చేరాయి. చివరకు ఏపీ హైకోర్ట్ కొన్ని కేసులను సుమోటోగా స్వీకరించి విచారణకు పూనుకోవడం కూడా విస్మయకరంగా మారింది. అందులో ఎల్జీ పాలిమర్స్ కేసు, తాజాగా డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఉన్నాయి.

ఇక్కడ ప్రస్తుతం ప్రస్తావించిన ప్రతీ కేసులోనూ జగన్ ప్రభుత్వానికి, న్యాయస్థానానికి మధ్య అగాథం తప్పలేదు. ప్రభుత్వ ఆలోచనలను ప్రతీ సందర్భంలోనూ కోర్టు తప్పుబడుతూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెలువరుస్తూనే ఉంది. దాంతో విపక్షాల నుంచి ఎటువంటి అడ్డంకులు లేనప్పటికీ జగన్ పూర్తిగా కోర్ట్ వ్యవహారంలోనే పునరాలోచన చేయాల్సి వస్తోంది. దానికి తగ్గట్టుగా ఇంగ్లీష్‌ మీడియం విషయంలో జగన్ ప్రభుత్వం కోర్ట్ తీర్పులకు అనుగుణంగానే తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ జరిపి ముందుకెళ్ళే ప్రయత్నంలో ఓ అడుగు వేసేసింది. ఇక ఆఫీసులకు రంగుల విషయంలో కూడా నిర్దిష్టమైన ప్రతిపాదనలతో జీవో విడుదల చేసింది. ఆ తర్వాత ఎస్ ఈ సీ విషయంలో కూడా ఆర్డినెన్స్ తో స్పష్టమైన వాదనలు వినిపించింది.

తొలినాళ్లలో కోర్టు తీర్పుల పట్ల కొంత కలవరపడినప్పటికీ ప్రస్తుతం న్యాయస్థానాల ద్వారా ఎదురవుతున్న ఆటంకాలను కూడా ప్రభుత్వం పరగిణలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. తొలుత అనుభవం లేకపోవడంతో కంగారు పడినప్పటికీ, తాజాగా అనుభవంతో కూడిన అవగాహనతో చట్టపరమైన సమస్యలను అధిగిమించేందుకు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ తీర్పు పట్ల సర్కారు లోలోన సంతృప్తి చెందుతున్నట్టు కనిపిస్తోంది. డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ దర్యాప్తు చివరకు టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడి వంటి వారి పాత్రను కూడా పరిశీలిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది. ఇక మిగిలిన అంశాల్లో కూడా స్పష్టంగా ఉండాలని నిర్ణయించుకుంది. దానికి తగ్గట్టుగానే నిమ్మగడ్డ కేసులో కోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వం కొంత దూకుడు ప్రదర్శించింది. అదే విధంగా ఏబీ వెంకటేశ్వర రావు సస్ఫెన్షన్ ను రద్దు చేసినా, ప్రభుత్వ కార్యాలయాల రంగుల విషయంలో జీవో కూడదని చెప్పినా ప్రభుత్వం తొణుకుబెణుకూ లేకుండా సాగుతోంది. అన్నింటికీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. సమగ్రంగా ఈ విషయాలు ఎదుర్కోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రజల్లో ఏపీ హైకోర్ట్ , జగన్ ప్రభుత్వం మధ్య వ్యవహారం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. చివరకు ఎలాంటి ముగింపు వస్తుందనేది పక్కన పెడితే ప్రభుత్వం మాత్రం కొంత పగడ్బందీగా వ్యవహరించగలిగితే ఇలాంటి చిక్కులు పెద్ద సమస్య కాదనే అబిప్రాయం న్యాయనిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. చరిత్రలో తొలిసారిగా గతంలో ఏ ప్రభుత్వం ఎదుర్కోనన్ని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను జగన్ ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కూడా ఇన్ని పిల్స్ చూడనప్పటికీ ప్రస్తుతం ఒక్క ఏడాదిలోనే భారీ సంఖ్యలో కోర్ట్ కేసులను ఎదుర్కొంటోంది. దాంతో సమస్యలను అధిగమించడం ద్వారానే ముందుకు వెళ్లడం అనే తన రాజకీయ విధానాన్ని చివరకు ఇప్పుడు అధికారంలో ఉండగా సీఎం తన పాలనా వ్యవహారాల్లోనూ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆటంకాలు అధిగమించి ఫలితాలు సాదించే ప్రయత్నంలో ఎలా ముందుకెళతారో చూడాలి.

Show comments