iDreamPost
iDreamPost
కరోనా విజృంభిస్తోంది. వివిధ వర్గాలను వణికిస్తోంది. ముఖ్యంగా అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బంది కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. జనతా కర్ఫ్యూ కి విశేష స్పందన రావడంతో వెనువెంటనే ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. లాక్ డౌన్ ప్రకటించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటన చేశాయి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్లో అవగాహన పెంచే పనిలో పడ్డారు.
అదే సమయంలో మీడియా లో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పత్రికల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని పలువురు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో పత్రికల ప్రచురణ నిలిపివేశారు. అదే పరంపరలో తాము కూడా పత్రిక ముద్రణ నిలిపివేస్తున్నట్లు ఆంధ్రభూమి యాజమాన్యం ప్రకటించింది. 23 నుంచి 31 వరకూ సిబ్బందికి సెలవులు ప్రకటించింది. అదే సంస్థ కి చెందిన డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక కూడా నిలిచిపోనుంది.
అయితే కరోనా నేపథ్యంలో మూత వేస్తూ చేసిన ప్రకటన ఆ సంస్థ ఉద్యోగుల్లో సందేహాలు నింపుతోంది. ఇప్పటికే ఊగిసలాట లో ఉన్న ఆంధ్రభూమి అందరి కన్నా ముందే మూత వేసేందుకు సిద్ధపడటం ఈ అనుమనాలకు కారణం అవుతోంది. ఇప్పటికే డి సి పలు ఎడిషన్లు నిలిపివేశారు. అందుకు తోడుగా ఇప్పుడు ఆంధ్రభూమి కూడా ప్రింటింగ్ నిలిపివేయడం చూస్తుంటే భవిష్యత్తులో మళ్లీ తెరుస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం అవుతోంది