Idream media
Idream media
“రిషికపూర్ చనిపోయాడు”-మా ఆవిడ చెబితే “సరిగా చూశావా” అని రెట్టించి అడిగాను. నమ్మడం కష్టంగా ఉంది.
నిన్న ఇర్ఫాన్, ఈ రోజు రిషి. ఇర్ఫాన్ గొప్ప నటుడు, బాధ కలిగింది. కానీ రిషి గొప్ప నటుడు కాదు. దుక్కం వచ్చింది. ఎందుకంటే నా బాల్యమే ఆయన సినిమాలు. పసితనం గుర్తుకొస్తే దుక్కం తప్పదు.
నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు “బాబీ” వచ్చింది. ఎలా వచ్చింది, ఒక ఉప్పెనలా వచ్చింది. ఎక్కడ చూసినా అవే పాటలు. బాబీ బెల్ట్, కళ్లద్దాలు, ప్యాంట్ , షర్ట్, కీ చైన్స్. మనం వాడే ప్రతిదీ బాబీ పేరుతో అమ్మేవారు. మా ఊళ్లో రోడ్డు సైడ్ బాబీ వస్తువులతోనే ఒకాయన వ్యాపారం చేసేవాడు.
హిందీ ప్రభావం లేని , రాయదుర్గం లాంటి చిన్న ఊళ్లోనే బాబీ జ్వరం వస్తే, ఇక నార్త్‌లో ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. మామూలుగా రీళ్లన్నీ తెగిపోయి , స్క్రీన్‌మీద అనేక గీతలు కనిపిస్తూ ఉండగా హిందీ సినిమాలు చూడటం మాకు అలవాటు. అంటే రిలీజ్ అయిన రెండేళ్లకి ప్యాలెస్ అనే థియేటర్‌కి హిందీ సినిమాలు వచ్చేవి. కానీ బాబీ మాత్రం ఆరు నెలలకే వచ్చింది.
చాలా ఆశతో వెళ్లాను కానీ, ఏమీ అర్థం కాలేదు. కానీ రిషి కపూర్ ఒక రాజకుమారుడిలా డింపుల్ ఒక దేవకన్యలా కనిపించింది. తర్వాత ఆయన సినిమాలు చాలా చూశాను. ఆయన తండ్రిగానే రాజ్‌కపూర్ తెలుసు. రాజ్‌కపూర్ ఏంటో తెలిసిన తర్వాత ఆయన కుమారుడిగానే రిషి కపూర్ తెలుసు.
రిషి కపూర్‌ని హీరో చేయడం కోసం బాబీని రాజ్‌కపూర్ తీయలేదు. మేరా నామ్ జోకర్‌తో ఆయన అప్పుల పాలయ్యాడు. హీరోకి రెమ్యూనరేషన్ ఇవ్వలేక రిషిని హీరో చేశాడు. తర్వాత అంతా చరిత్ర.
నిజానికి రిషి జీవితంలో ఒడిదుడుకులేం లేవు. ప్రేమించిన నీతూసింగ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు రణబీర్ కపూర్ మంచి నటుడయ్యాడు. కెరీర్ గొప్పగా ఎపుడూ లేదు, పాతాళంలోనూ లేదు. ఆయనో అందమైన నటుడు. తండ్రిలా , తాతలా జీవితంలో సంఘర్షణ లేదు.
ఒక తరానికి ఆయన ఆరాధనా నటుడు. తొలి సినిమాలోని అమాయకత్వాన్ని ఆయన జీవితమంతా కాపాడుకున్నాడు. క్యాన్సర్ కూడా మంచి నటుల్ని అభిమానిస్తుంది. అందుకే ఇర్ఫాన్‌కి , రిషికి దగ్గరైంది.
కాలం అన్నీ తీసుకుంటుంది. దేవకన్య డింపుల్ కూడా ముసలావిడ అయిపోయింది. టీవీల్లో మాత్రమే ఇకపై రిషికపూర్ అనే ఆషిక్ కనిపిస్తాడు.
రేపు మనం ఉంటామో, ఉండమో!
కానీ ఆకాశంలో నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయి
అందరూ మట్టిలో విశ్రాంతి తీసుకోవాల్సిన వాళ్లమే
కానీ కొందరు ఈ భూమికి ఆకుపచ్చదనాన్ని అద్ది వెళ్లిపోతారు
అల్విదా రిషి!