Krishna Kowshik
Krishna Kowshik
టాలీవుడ్ హాస్య నటుల్లో ఒకరు అల్లు రామలింగయ్య. తొలి తరం సినిమాల్లో మంచి హాస్య చతురతను ప్రదర్శించి, అందరిని కితకితలు పెట్టించారు. చనిపోయేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో అనేక పాత్రలు పోషించి మెప్పించారు. 2004లో తన 81 ఏళ్ల ప్రాయంలో వృద్దాప్య సమస్యలతో మరణించారు. ఆయన నుండి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అల్లు అరవింద్. నిర్మాతగా ఎనలేని స్టార్ డమ్ సంపాదించారు. ఆయన కుమార్తె.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అన్న విషయం తెలిసిందే. అల్లు, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వారసులు.. అరడజను మందికి పైగా పరిశ్రమలోనే కొనసాగుతున్నారు.
కాగా, నేడు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకుని విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టారు నిర్మాత అల్లు అరవింద్. జూబ్లీహిల్స్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ దంపతులు, శిరీష్, అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ, చిరంజీవి భార్య సురేఖ, సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. అయితే అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి హాజరు కాలేదు ( వెకేషన్‌లో ఉన్నారని సమాచారం). అల్లు శిరీష్ చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అల్లు అయాన్.. తన ముత్తాత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముని మనవడు, బన్నీ కుమారుడు అయాన్.. విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఇక ఈ సందర్భంగా బన్నీ తనయుడు అల్లు అయాన్ మాట్లాడుతూ ‘అల్లు రామలింగయ్య తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా.. ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయి. తాత మా మధ్యలో లేకపోయినా.. ఆయన చేసిన పనులు మాకు స్ఫూర్తి’ అని అన్నాడు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ.. అయాన్ చెప్పినట్లు.. మా తాత దీవెనలు మాతో ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.