బన్నీ-సుక్కు సినిమాలో అవే హైలైట్సట

సంక్రాంతికి వచ్చి ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో సక్సెస్ తో బన్నీ మాములు ఖుషిగా లేడు. ఏడాదిన్నర గ్యాప్ కు పూర్తి న్యాయం జరిగిందన్న సంతోషం అభిమానుల్లోనూ ఉంది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్ దాని కోసం ఏకంగా 40 రోజుల పాటు కేరళ అడవుల్లో మకాం వేయబోతున్నాడు.

కథ ప్రకారం శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కాబట్టి కీలకమైన సన్నివేశాలన్నీ అక్కడే షూట్ చేస్తారట. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే లీక్ అందింది. మరో కీలకమైన అప్ డేట్ ప్రకారం ఇందులో విలన్ తరహా పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి బన్నీకి ఓనర్ గా చేస్తున్నట్టు తెలిసింది. వీళ్లిద్దరి మధ్య కాంబినేషన్ సీన్లను సుకుమార్ చాలా ప్రత్యేకంగా రాసుకున్నాడట.
అడవుల్లో రెండు ఛేజులు సైతం చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.

వాస్తవానికి దీని షూటింగ్ ఇక్కడే చేద్దాం అనుకున్నారు. కానీ అనుమతులు రాకపోవడంతో యూనిట్ కేరళకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాక పాటల చిత్రీకరణ ఇక్కడ చేయబోతున్నారు. హీరోయిన్ రష్మిక మందన్న ఎప్పటి నుంచి జాయినవుతుందన్న క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ మధ్య తన అవుట్ ఫుట్ తో నిరాశ కలిగిస్తున్న దేవిశ్రీప్రసాద్ తన స్నేహితుడి సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలిసింది. రంగస్థలం ఫ్లేవర్ లో ఉంటూనే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పటిదాకా ఎలాంటి టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టుగా కూడా లేదు. కాకపోతే ఇది వచ్చే ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.

Show comments