iDreamPost
android-app
ios-app

అక్షయ్ – మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్

  • Published Mar 28, 2020 | 12:33 PM Updated Updated Mar 28, 2020 | 12:33 PM
అక్షయ్ – మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్

డబ్బు ఎంత సంపాదించినా దానికి నలుగురికి పంచే గుణం లేకపోతే దానికి సార్థకత చేకూరదు. అందులోనూ కరోనా లాంటి మహమ్మారి ఇండియాను నలువైపులా కమ్ముకున్న విపత్కర పరిస్థితుల్లో వీలైనంత చేయూత చాలా అవసరం. ఇప్పటికే వివిధ బాషా సినిమా పరిశ్రమల నుంచి విరాళాల ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ ఒక్క దెబ్బతో తన మూవీసే కాదు మనసు కూడా ఎంత భారీదో రుజువు చేశాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.

అక్షరాల 25 కోట్ల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్ కి డొనేట్ చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇప్పటిదాకా ఇంత మొత్తంలో దానం ఇచ్చిన నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరూ లేరు. అక్షయ్ కుమార్ కన్నా ఇమేజ్ లో ఇంకా ఎత్తులో ఉన్న ఖాన్ల ద్వయం ఇంకా దీని గురించి డబ్బు రూపంలో స్పందించలేదు. కేవలం వీడియోలతో సరిపుచ్చారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ ముందుకు వచ్చాడు కాబట్టి ఇకపై రెస్పాన్స్ ని ఆశించవచ్చు.

మరోవైపు తెలుగు సినిమా రోజువారి వేతనాల మీద ఆధారపడే కార్మికుల కోసం మన హీరోలు అదనంగా విరాళాలు అందిస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఇచ్చిన కోటి కాకుండా పరిశ్రమ కోసం 25 లక్షలు ఇచ్చాడు. రామ్ చరణ్ మొదట ఇచ్చిన 70 లక్షలు కాకుండా తాజాగా ఇండస్ట్రీ కోసం 30 లక్షలు అందించాడు. జూనియర్ ఎన్టీఆర్ 30 లక్షలు విడిగా ఇచ్చాడు. మరికొందరు విడిగా కేవలం సినీ వర్గాల కోసం సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

చిరంజీవి చైర్ మెన్ గా కరోనా క్రైసిస్ ఫండ్ ని ఇవాళ ఏర్పాటు చేశారు. సురేష్ బాబుతో పాటు మరికొందరు ఇందులో సభ్యులుగా ఉండబోతున్నారు. ఇకపై ఎవరు విరాళాలు ఇవ్వదలుచుకున్నా ఈ చారిటిని సంప్రదించాలని చిరు కోరారు. వేగంగా అడుగులు పడుతుండటంతో ఇకపై స్టూడియోలలో షూటింగులలో తాత్కాలికంగా పనులు పోగొట్టుకున్న వాళ్ళకు ఆకలి కేకలు ఉండబోవడం లేదు. ఆపద సమయంలో ఇంతగా పాటుపడుతున్న మన హీరోలు అఫ్ స్క్రీన్ లో నిజమైన కథానాయకులని ప్రూవ్ చేసుకున్నారు.