iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ తర్వాత అదే అతి పెద్ద సవాల్ : ప్రధాని మోడీ

లాక్ డౌన్ తర్వాత అదే అతి పెద్ద సవాల్ : ప్రధాని మోడీ

కరోనా కట్టడి, లాక్ డౌన్ అనంతర పరిణామాలు, ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం అంశాలే ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, సూచనలు మేరకే దేశం ముందుకు వెళుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ప్రధాని వివరించారు. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సవాల్ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించని ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా ను కట్టడి చేసిన భారత్ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని కోరగా.. మరికొంతమంది మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ లేదా ఔషధం వచ్చేవరకు దాన్ని పూర్తిగా నియంత్రించలేని నేపథ్యంలో ప్రజలు కరోనాతో కలిసి జీవించేలా వారికి అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచించారు. ప్రజా రవాణా ప్యాసింజర్ రైళ్లను మరి కొద్ది కాలం పాటు నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితులను ఎత్తివేయాలని, రుణాలను రీ షెడ్యూల్ చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విన్నవించారు.