iDreamPost
android-app
ios-app

తన ఆఫీసును వలస కూలీలా సహాయ కేంద్రంగా మార్చిన లోక్ సభ విపక్ష నేత

తన ఆఫీసును వలస కూలీలా సహాయ కేంద్రంగా మార్చిన లోక్ సభ విపక్ష నేత

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌధురి రంగంలోకి దిగాడు. ఆయన తన భార్య,సిబ్బందితో కలిసి ఢిల్లీలోని తన కార్యాలయాన్ని ఒక మినీ కంట్రోల్‌ రూమ్‌గా మార్చేశాడు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని వలస కార్మికులతో చర్చించి వారు తెలిపిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.

తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులతో పాటు, అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంప్రదించి వెంటనే సహాయం అందేలా రంజన్‌ చౌధురి ప్రయత్నిస్తున్నారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బెహ్రాపూర్‌ నియోజకవర్గం నుంచి సహాయం కోరుతూ ప్రతిరోజు సుమారు 500 వరకు ఫోన్‌ కాల్స్‌ తమ కంట్రోల్ రూమ్‌కు వస్తున్నట్లు అధీర్‌ రంజన్‌ తెలిపారు.

జీవనోపాధి కోల్పోయి ఆశ్రయం లేక,ఆహారం అందక వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది.నా నియోజక వర్గంలో రోజువారి పనులపై ఆధార పడ్డ ప్రజలు ఎక్కువగా ఉన్నారు.ఈ విపత్కర సమయంలో అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. అందుకే వారి వివరాలు సేకరించి,ఆ నిర్భాగ్యులకు తక్షణమే సహాయం అందేలా చూస్తున్నామని అధీర్‌ తెలిపారు.

అయితే ఇతర రాష్ట్రాల్లో నిరాశ్రయులైన వలస కార్మికుల వివరాలు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వద్ద లేవని అధీర్‌ విమర్శించాడు.ఆకలితో అలమటిస్తున్న వారి బాగోగుల కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు. లాక్‌డౌన్‌ ముగియగానే దేశంలో ఏ మారుమూల ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలసకార్మికులు స్వరాష్ట్రానికి తీసుకురావడంలో సహాయాన్ని అందించాలని తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని పేర్కొన్నారు.