iDreamPost
iDreamPost
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి చేతులు కలపబోతున్నారు. ఈనెల 9న చిరంజీవి సారధ్యంలోని బృందం అమరావతి రాబోతోంది. సీఎం జగన్ ని కలిసి తమ సమస్యలు విన్నవించబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో చిత్రపరిశ్రమకు ప్రభుత్వం తరుపున కావాల్సిన సహాయాన్ని అర్థించబోతోంది. దాంతో ఈ సమావేశం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.
వాస్తవానికి చాలాకాలంగా ఏపార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికయిన తర్వాత ఆయా నేతలను సినీ ప్రముఖులు ఎక్కువ మంది కలవడం ఆనవాయితీ. అయితే ఈసారి అలా జరగలేదు. హైదరాబాద్ ని వీడి అమరావతి రావడం వల్ల అలా జరిగిందనుకుంటే గతంలో చంద్రబాబు విషయంలో భిన్నమైన అనుభవం ఉంది. దాంతో జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం చాలామంది సినీ ప్రముఖులకు రుచించలేదా అన్న అనుమానం కలిగింది. సామాజిక , ఇతర కారణాలతో అత్యధికులు చంద్రబాబు పట్ల సానుభూతితో ఉండడమే దానికి మూలం.
తన సినిమా విడుదల సందర్భంగా గత అక్టోబర్ లో చిరంజీవి కుటుంబసమేతంగా అమరావతి వచ్చారు. జగన్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. ఆ తర్వాత మూడు రాజధానులు సహా పలు కీలక నిర్ణయాల్లో ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. జగన్ ప్రభుత్వ విధానాలను సమర్థించారు. ఓవైపు పవన్ వ్యతిరేకించినా, నాగబాబు ఒక్కో సందర్భంగా ఒక్కో విధంగా వ్యాఖ్యానించినా చిరంజీవి మాత్రం చాలా స్పష్టతతో వ్యవహరించారు. అందుకు తోడుగా తెలంగాణా ప్రభుత్వంతో చిరంజీవి సన్నిహితంగా మెలగడం విశేషం. అన్నింటికీ మించి ఇటీవల కరోనా సంక్షోభం సమయంలో ఇండస్ట్రీలో పెద్ద మనసుతో వ్యవహరించారు. సీసీసీ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకునేందుకు చొరవ చూపారు. ఇలా చిరంజీవి సినిమా రంగంలో తనదైన పాత్ర పోషిస్తూ, ఇరు ప్రభుత్వాలతోనూ సామరస్యంగా వ్యవహరిస్తూ కీలకంగా మారిపోయారు.
అదే సమయంలో ఇటీవల చిరంజీవి ఇంట్లోనే టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కూడా నిర్వహించారు. తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా హాజరయిన ఆ సమావేశంలో సినీ రంగానికి సంబంధించిన అంశాల పై చర్చ జరిగింది. లాక్ డౌన్ అనంతర పరిణామాలపై పలు నిర్ణయాలు కూడా చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశం కొంత వివాదాస్పదంగా మారడానికి బాలకృష్ణ వ్యాఖ్యలు కారణం అయ్యాయి. తనను సమావేశానికి పిలవలేదంటూ బాలయ్య దుమారం రేపారు. దానికి నాగబాబు కౌంటర్ వంటివి కొంత చర్చకు ఆస్కారం ఇచ్చారు. ఆ అనుభవంతోనే ఈసారి ఏపీ సీఎంతో సమావేశానికి బాలయ్యను కూడా ఆహ్వానించామని నిర్మాతల మండలి సి కళ్యాణ్ ప్రకటించారు. దాంతో ఏపీ జగన్ క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించబోతున్న సమావేశానికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హాజరవుతారా అన్నది ఆసక్తిని రేపుతోంది.
అదే సమయంలో చిరంజీవి చొరవత నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన భూముల కేటాయింపు వంటి విషయాలతో పాటుగా నంది అవార్డులు, ఇతరాలు కూడా చర్చకు రాబోతున్నాయి. జగన్ సీఎంగా ఎన్నికయిన తర్వాత పలువురు ప్రముఖులు ఆయనతో సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇదో కీలక భేటీగా కనబడుతోంది. జగన్ వారి సమస్యల పట్ల ఎలా స్పందిస్తారు..చిరంజీవి చొరవ ఏమేరకు ఉపయోగపడుతుందనే చర్చ మొదలయ్యింది. అదే సమయంలో బాలయ్య గతంలో చేసిన విమర్శలతో ఈసారి ఆయన గైర్హాజరయితే సినీరంగంలో ఆయన పట్ల ఉండే గౌరవం సన్నగిల్లే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇటీవలే రెండు రోజుల క్రితం మంచు విష్ణు సీఎం జగన్ ఇంటికి వచ్చి వెళ్లారు. 9వ తేదీన చిరంజీవి బృందంలో నాగార్జున సహా పలువురు సెలబ్రిటీలు ఉండడంతో అందరి దృష్టి ఈ సమావేశంపై పడుతోంది.