iDreamPost
android-app
ios-app

న్యాయవ్యవస్థ పై ఆర్కే మార్క్ విశ్లేషణ.

న్యాయవ్యవస్థ పై ఆర్కే మార్క్ విశ్లేషణ.

వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కి వచ్చే వారిలో అధిక శాతం మందిని ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చే విధంగా ప్రశ్నలు అడిగి, వారు చెప్పే సమాధానాన్ని తనకు అనువుగా వాడుకుని ఎన్టీఆర్ ను పొగుడుతుంటారు. దాన్ని బట్టి ఆయన ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అని చాలా మందికి అభిప్రాయం. ఎన్టీఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సినిమా క్లైమాక్స్ లో  “కింద కోర్టు, పై కోర్టు, కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి …” అంటూ దద్దరిల్లిపోయే డైలాగ్ ఒకటుంటుంది. నిన్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు గారి వర్ధంతి కదా, నిన్న ఆర్కే ఏమైనా ఆ సినిమా చూశారో, లేక గుర్తు తెచ్చుకున్నారో తెలీదు కానీ కోర్టుల గురించి, ఆ పై కోర్టుల గురించి తెగ రాసేశారు. ఎటొచ్చీ ఆ సినిమా కథ పరంగా కోర్టుల మీద, న్యాయవ్యవస్థలోని లోపాల మీద , హీరో పాత్ర ద్వారా చెప్పించిన డైలాగు అది. బహుశా దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు. అదే రేంజ్ లో – మన దేశంలోని న్యాయవ్యవస్థ గురించి, కోర్టుల గొప్పదనం గురించి, ఎవరైనా సరే కోర్టు తీర్పుల్ని గౌరవించాల్సిందే అంటూ పేరాలకు పేరాలు పాఠాలు చెప్పేశారు. రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి అర పేజీ వ్యాసంలో అదరగొట్టేశారు. ఆయనకు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు, సిస్టం పట్ల ఉన్న గౌరవానికి, న్యాయవ్యవస్థ మీద ఉన్న నమ్మకానికి నేటి ‘కొత్త పలుకు’ నిలువుటద్దంగా నిలిచిపోతుంది. 

కానీ పాఠకులకు అర్ధం కానిది – ఏప్రిల్ 26న తన కొత్తపలుకులో – “నిజానికి కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేస్తే, అవినీతి కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, విజయ సాయిరెడ్డికి శిక్ష వేయించగలరన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. గతంలో తమిళనాడులో జయలలిత మరణానంతరం తమ దారిలోకి రాని శశికళపై ఉన్న పాత కేసులను అప్పటికప్పుడు తిరగదోడి జైలుశిక్ష పడేలా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. జగన్‌, విజయ సాయిరెడ్డిలపై ఉన్న కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. అయినా శశికళ ఉదంతం తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఏకంగా విమర్శలు చేయగల ధైర్యం విజయ సాయిరెడ్డికి వచ్చిందంటే… ఆ పార్టీ అధిష్ఠానం వద్ద ఆయనకు ఉన్న పట్టు కారణమన్న అనుమానం ఎవరికైనా ఎందుకు రాకుండా ఉంటుంది!?” అని రాశారు కానీ ” కోర్టులు చట్టాలకు లోబడి పని చేస్తాయి కానీ వ్యక్తులకు, పార్టీలకు కాదు” అని అప్పుడెందుకు రాయలేదనే విషయం. 

అలాగే కోర్టు తీర్పును విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ వైసీపీలోని కొందరు నాయకులు, సోషల్ మీడియాలోని వైసీపీ అభిమానులు, సానుభూతిపరులు ఘాటైన వ్యాక్యాలు చేయడాన్ని న్యాయవ్యవస్థకు దురుద్దేశాన్ని ఆపాదించడమేనని ఆర్కే గడగడలాడించారు. అవును అనుమానమే లేదు – ఆయనన్నది నూటికి నూరు పాళ్ళు నిజం – గతంలో జగన్ మీద కేసులు వేశారు, సీబీఐ వాళ్ళు విచారణ జరిపారు. పదకొండు కంపెనీల్లో ‘క్విడ్ ప్రో కో’ జరిగిందన్నది అభియోగం. వాటిలో ఏడు కంపెనీల్లో ‘క్విడ్ ప్రో కో’ జరిగిన ఆధారాలే లేవని, మిగిలిన నాలుగు కంపెనీల లావాదేవీల పైన విచారణ కొనసాగుతుందని, దానికి అవసరమైన సమాచారాన్ని సేకరించామని సీబీఐ కోర్టు జగన్ కు 2013లో సెప్టెంబర్లో  బెయిల్ మంజూరు చేసింది. కానీ అదే సంవత్సరం డిసెంబర్లో పార్టీ అభిమానులో, కార్యకర్తలో కాదు – ఏకంగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడే -“కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తే వేధిస్తారు, అనుకూలంగా మారితే జైలు నుంచి బయటకు తెస్తారు. జగన్ కాంగ్రెస్ డీఎన్ఏ అని దిగ్విజయ్ చెప్పారు. అందుకే బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చారు” అని సెలవిచ్చారు. అంటే ఆయన ఉద్దేశం జగన్ కు బెయిల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టా ? ఆ పక్షంలో ఈయన ఎవరికి ఏం ఆపాదించినట్టు ? పైగా ఆ వార్తను ఆర్కే తమ పేపర్లోనే వేశారు. అయినా ఎవరు అధికారంలో ఉంటే వారి ఇష్టానికి తగ్గట్టుగా బెయిల్ మంజూరు అవుతుందన్నట్టు మాట్లాడటం దేనికి సంకేతమని అప్పట్లో కొందరు ఆశ్చర్యపోయారు.

“తనకు బెయిల్‌ ఇవ్వాలని ఆయన ఆశ్రయించింది సుప్రీంకోర్టునే కదా? సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడం వల్లనే కదా ఆయన ఇవ్వాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు! తనపై సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులు అక్రమమని ఆయన కూడా న్యాయస్థానం తలుపే కదా తట్టింది! ” అంటూ చెప్పుకొచ్చారు. కానీ జగన్ కు బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు కాదు, సీబీఐ కోర్టు అనే విషయం మరిచిపోయినట్టున్నారు. ‘ఒక వైద్యుడుగా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఏడు పదుల వయసులో బలవన్మరణానికి పాల్పడే’ బదులు అంత సీనియర్ నాయకుడు ఏ తప్పు చేయనప్పుడు కోర్టుల్లో పోరాడి న్యాయం తన వైపే ఉందని రుజువు చేసుకోవాలి కదా. ఆ దిశగా ముందుకుపొమ్మని వారి పార్టీ అధ్యక్షుడు ఎందుకు సలహా ఇవ్వలేదని చాలా మంది సీనియర్ రాజకీయవేత్తల వాదన. అసలు ఉన్నతపదవుల్లోని వారు ఎవరైనా తమ మీద అభియోగం మోపినప్పుడు, కోర్టుల్లో తమ సచ్ఛీలతను రుజువు చేసి కడిగిన ముత్యం లాగా బయటకు రావాలు కానీ తమ మీద విచారణ జరగకుండా స్టే ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరాల్సిన అవసరమేముందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. ఉదాహరణకు ‘ఓటుకు నోటు కేసు’లో చంద్రబాబు లాగా ! 

ఇవన్నీ పక్కన పెడితే – ఒక వైపు ప్రజావేదికను కూల్చివేయడాన్ని పరోక్షంగా తప్పు పడుతూనే మరో వైపు అది అక్రమ కట్టడమేనని ఒప్పుకుంటారు. అలాగే “న్యాయ వ్యవస్థ కన్నెర్రజేస్తే ముఖ్యమంత్రి పదవి కోల్పోవడమే కాకుండా మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా న్యాయ వ్యవస్థతోనే ఢీకొనడానికి సిద్ధపడటం మొండితనమో, మూర్ఖత్వమో తెలియదు.”; “తన ఆయువుపట్టు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దల గుప్పెట్లో ఉందని బాగా తెలిసిన జగన్మోహన్‌రెడ్డి వారితో సత్సంబంధాలను మాత్రం కొనసాగిస్తున్నారు.” అంటూ అసంబద్ధ వ్యాక్యాలు ఏమిటని పాఠకులు తికమకకు గురవుతున్నారంటూ పలువురు అనుకుంటున్నారు.