iDreamPost
iDreamPost
ఓ వ్యక్త్తి రైల్వే శాఖ నుంచి రావాల్సిన 35 రూపాయల కోసం ఐదేళ్లు పోరాటం చేసి సాధించాడు. రాజస్తాన్‌కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే 2017 జూలై 2న రాజస్థాన్ కోటా నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఏప్రిల్ లోనే టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తన ప్రయాణం వాయిదా పడటంతో ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని డబ్బులు మినహాయించుకుని మిగిలినవి వెనక్కి వస్తాయి. అయితే సుజీత్ క్యాన్సిల్ చేసిన టికెట్ లో క్యాన్సిలేషన్ అమౌంట్ కంటే అదనంగా 35 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కట్ చేసుకొని వచ్చాయి. ఇదేంటి అని అడగగా జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందని బదులు వచ్చింది.
అయితే జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్‌పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ సుజీత్ న్యాయ పోరాటానికి దిగాడు. దీనికి సంబంధించి ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టాడు అంతే కాక దీనికి సంబంధించిన నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేస్తూ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్‌ను కూడా ట్యాగ్ చేశాడు.
మొత్తానికి సుజీత్ న్యాయ పోరాటం ఫలించి సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో ప్రకటన చేసింది. అయితే రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దీంతో మిగతా 2 రూపాయల కోసం కూడా సుజీత్ పట్టుబట్టి మూడేళ్ల పోరాటంతో వాటిని సాధించాడు. దీంతో 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా ఆ 35 రూపాయల సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో సుజీత్ ఒక్కడి పోరాటం వల్ల 3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.