బాక్సాఫీస్ పై మాస్ పోలీస్ సిగ్నేచర్

అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి. హుందాగా ఖాకీ బట్టలు వేసుకుని పై ఆఫీసర్లు వచ్చినప్పుడు సెల్యూట్ కొడుతూ లోకల్ గూండాల లంచాలు తింటూ ప్రజలని వేధించుకు తినాలి. లేదూ సిన్సియర్ అయితే చట్టానికి న్యాయానికి లోబడి ప్రజల మానప్రాణాలను కాపాడుతూ వాళ్ళను కంటికి రెప్పలా చూసుకోవాలి. అప్పటిదాకా తెలుగు సినిమా చూస్తూ వచ్చింది ఇలాంటి పోలీసులనే. అంకుశంలో హీరో విపరీతమైన కోపంగా కనిపించినా రౌడీ ఇన్స్ పెక్టర్ లో కథానాయకుడు ఆగ్రహంతో ఊగిపోయినా ఒకరకమైన ఫార్ములాకు వాళ్లు అలవాటు పడిపోయారు. అలాంటిది అదే పోలీసుకు మెదడులో కాస్తంత తిక్క ఉంటే, దానికి లెక్క లేకుంటే ఎలా ఉంటుందన్న దర్శకుడు హరీష్ శంకర్ ఆలోచన 2011లో గట్టి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కు ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇస్తుందని నిర్మాత బండ్ల గణేష్ ఊహించి ఉండరు. ఆ మేజిక్ పేరే గబ్బర్ సింగ్.

నిజానికి పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చేయాలనుకున్న సినిమా ఒక కామెడీ అండ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టొరీ. చిన్న యాక్షన్ ఎలిమెంట్ ఉంటుంది కాని ఫక్తు టైంపాస్ మూవీ. టైటిల్ ‘రొమాంటిక్’ ఋషి అనుకున్నారు. కాని అది మొదలుపెట్టే లోపే పవన్ లవ్ ఆజ్ కల్ రీమేక్ జయంత్ సి పరాన్జీతో కమిటవ్వడంతో ఇది లేట్ అయిపోయింది. ఆ గ్యాప్ లో దీన్నే మిరపకాయ్ గా మార్చి కొన్ని మార్పులతో రవితేజతో తీసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు హరీష్ శంకర్. కొంత కాలం తర్వాత మళ్లి పవన్ నుంచి పిలుపు. 2010లో బాలీవుడ్ ని ఊపేసిన దబాంగ్ ని రీమేక్ చేద్దామనే ప్రపోజల్ తో స్క్రిప్ట్ మొదలుపెట్టమని చెప్పాడు. అప్పటికే హరీష్ డైలాగ్ టైమింగ్, టేకింగ్ మీద మిరపకాయ్ రూపంలో పూర్తి అవగాహన వచ్చేసింది.

అయితే దబాంగ్ ని యధాతధంగా తీస్తే అంత ఎఫెక్ట్ ఉండదు. అందులో చాలా పరిమితులు ఉన్నాయి. ఏదో సల్మాన్ మేనియాలో అడేసింది కాని తనకొచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే పవన్ ని ఎప్పుడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేయాలి. ఏదో చేతబడి చేసినట్టు తనలో ఉన్న దర్శక రచయితని బయటికి పంపేసి అచ్చమైన పవన్ కళ్యాణ్ అభిమానిని తన శరీరంలోకి ప్రవేశపెట్టుకున్నాడు హరీష్ శంకర్. తెరమీద పవర్ స్టార్ ఎలా చూస్తే తన ఒళ్ళు ఊగిపోతుందో, ఎలాంటి సంభాషణలు పలికిస్తే నోరు నొప్పి పుట్టే దాకా విజిల్స్ వేయిస్తాడో ఒక్కొక్కటిగా డిక్టేషన్ రూపంలో అంతరాత్మ రూపంలో హరీష్ లోకి వచ్చిన ఫ్యాన్ చెప్పుకుంటూ పోయాడు. గూస్ బంప్స్ మాటకు అర్థం ప్రత్యక్షంగా అనుభవిస్తూ రాసుకుంటూ పోతున్నాడు. క్రమం తప్పకుండా పవన్ తో జరిగిన చర్చల నుంచి తీసుకున్న ఇన్ పుట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అంతాక్షరి ఐడియా హీరోదే. దానికి హరీష్ శంకర్ తనదైన చమత్కారం జోడించి చదివి వినిపించే సరికి ఆ సమయంలో పవన్ తో సహా అక్కడున్న వాళ్ళు పొట్టచెక్కలయ్యేలా ఆయాసం వచ్చేలా నవ్వుతూనే ఉన్నారు.

హీరొయిన్ గా శృతి హాసన్ ఫిక్స్ అయ్యింది. అప్పటికి తనకు ఒక్క హిట్టు లేదు. ఐరన్ లెంగ్ అనే కామెంట్స్ ని హీరో డైరెక్టర్ ఇద్దరూ పట్టించుకోలేదు. తల్లిగా సుహాసినిని తీసుకున్నారు. తమ్ముడిగా అజయ్, విలన్ గా అభిమన్యు సింగ్, స్పెషల్ ఐటెం సాంగ్ కోసం మలైకా అరోరా ఇలా చాలా పద్ధతిగా త్రివిక్రమ్ స్టైల్ లో చెప్పాలంటే ఒక గోడ కట్టినట్టుగా హరీష్ శంకర్ క్యాస్టింగ్ ని, టీంని సెట్ చేసుకుంటూ పోయాడు. షూటింగ్ మొదలయ్యింది. ఇంత ఎనర్జీని బయటికి తీస్తూ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ పాత్రను తీర్చిద్దిద్దుతున్న తీరుని చూసి స్పాట్ లో పవన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. హరీష్ లోని అభిమాని ఏ విషయానికీ రాజీ పడటం లేదు. పవన్ ని ఇంత కన్నా మాస్ గా ఎవరైనా చూపించగలరా అని ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. అంతే బలంగా సంకల్పించుకున్నాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా గబ్బర్ సింగ్ షూట్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంది

మే 11వ తేది 2012

ప్రపంచవ్యాప్తంగా గబ్బర్ సింగ్ భారీ ఎత్తున విడుదలైంది. యధావిదిగా అభిమానులు పోటెత్తారు. బెనిఫిట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ మొదలైంది. ఫ్యాన్స్ ఒక్క ఆటతో సంతృప్తి చెందడం లేదు. మళ్ళీ మళ్ళీ చూసేందుకు ఎగబడటంతో సామాన్య ప్రేక్షకులకు టికెట్లు దొరకడం కష్టమైపోయింది. పవన్ పెర్ఫార్మన్స్ కి ధియేటర్ల లోపల పూనకాల కంటే ఎక్కువ అనే స్థాయిలో అభిమానులు ఒకటే గోల. ఎంత గొప్ప సౌండ్ సిస్టం ఉన్న హాలైనా ఈ సందడి ముందు చిన్నబోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో మూడు రోజుల తర్వాత షో టికెట్లు దొరికినా అదే గర్వంగా ఫీలయ్యే పరిస్థితి. ఎక్కడా క్రౌడ్స్ తగ్గడం లేదు. అదనపు స్క్రీన్లు ఎన్ని వేసినా చాలడం లేదు.

ఎక్కడో సిటీ అవుట్ స్కర్ట్స్ లో విసిరేసినట్టున్న సింగల్ స్క్రీన్లు సైతం కిటకిటలాడే జనంతో కళకళలాడుతున్నాయి. రోజురోజుకి పెరిగే సూచనలే తప్ప ఎక్కడా గబ్బర్ సింగ్ తగ్గేలా కనిపించడం లేదు. ఎబిసి ఇలా సెంటర్ల మధ్య వ్యత్యాసం లేకుండా రికార్డుల ఊచకోత మొదలైంది. పవన్ సినిమా స్టామినా ఏంటో చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఖుషి నాటి వైభవం మళ్ళీ చూడగలమా అనే వాళ్ళ అనుమానాలను బ్రేక్ చేస్తూ హరీష్ శంకర్ వాళ్ళ బ్యాంకు బాలన్సులను అమాంతం బంగారం ధరలా పెంచుకుంటూ పోయే సినిమా వాళ్ళ చేతికిచ్చాడు. అలా అలా ఆ ప్రభంజనం కొనసాగి 306 కేంద్రాల్లో యాభై రోజులు 65 సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకుని పదేళ్లుగా ఇండస్ట్రీ హిట్ లేని పవన్ వైపు ప్రశార్థకంగా చూసిన నోళ్లు మూతబడేలా గబ్బర్ గట్టి సమాధానం ఇచ్చాడు.

గబ్బర్ సింగ్ ఇవాళ్టితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీని తర్వాత కూడా పవన్ ఇలాంటి హిట్స్ కొట్టినప్పటికీ అభిమానులకు గబ్బర్ సింగ్ మిగిల్చిన జ్ఞాపకాలు చాలా స్పెషల్. ఇందులో డైలాగులు, మ్యానరిజమ్స్, పాటలు నెలల తరబడి యూత్ కు తారక మంత్రంలా మిగిలిపోయాయి. పవన్ ని ఒక అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో దానికి అచ్చమైన ఉదాహరణగా నిలిచాడు హరీష్ శంకర్. ఇందులో పవన్ ని ఇతను చూపించిన తీరులో పాతికేళ్ల పవర్ స్టార్ కెరీర్ లో ఇంకెవరు చూపలేదన్నది వాస్తవం. వన్ మ్యాన్ షోకి సరైన నిర్వచనంలా నిలిచిన గబ్బర్ సింగ్ సంవత్సరాలు దాటే కొద్దీ ఏళ్ళు పెరుగుతాయేమో కానీ ఆ పేరు విన్నప్పుడంతా ఫ్యాన్స్ లో వచ్చే వైబ్రేషన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మ్రోగుతూనే ఉంటాయి.

Show comments