డార్లింగ్ మాస్ స్టామినా చాటిన ‘మిర్చి’

ఇది బాహుబలి కన్నా ముందు కథ. జాతీయ స్థాయిలో ప్రభాస్ కు గుర్తింపు రావడానికి ముందు జరిగింది. ఏడేళ్ల క్రితం 2013లో ప్రభాస్ కొత్త సినిమా నిర్మాణంలో ఉంది. అంతకు ముందు ఏడాది పెదనాన్నతో కలిసి లారెన్స్ దర్శకత్వంలో నటించిన రెబెల్ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. మాస్ లో మార్కెట్ ని బలపరుచుకోవాలన్న రెబెల్ స్టార్ లక్ష్యం ఆలస్యమవుతోంది. రెబెల్ కన్నా ముందు మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లతో హిట్లందుకున్న ప్రభాస్ కు అవి కోరుకున్న బలమైన కిక్ ను ఇవ్వలేకపోయాయి.

ఛత్రపతిని మించి ఒక ఫక్తు కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం ప్రభాస్ ఎదురు చూస్తున్న టైంలో కలిసిన వ్యక్తి కొరటాల శివ. అప్పటికే రచయితగా పోసాని లాంటి అగ్రజుల దగ్గర పని చేసిన అనుభవం ఉన్న శివ చెప్పిన కథ సింగల్ సిట్టింగ్ లో ఒకే చెప్పాడు ప్రభాస్. అంతే కాదు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న స్నేహితులను ప్రోత్సహించి మరీ ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకోమని చెప్పాడు. అలా మిర్చి కార్యరూపం దాల్చింది. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 8న ప్రేక్షకుల తీర్పు కోసం ధియేటర్లలో అడుగు పెట్టింది.

నిజానికి మిర్చిలో గొప్ప కథేమి ఉండదు. ఫ్యాక్షన్ నీడలకు దూరంగా సిటీలో అమ్మతో పాటు ఉంటూ చదువుకుంటున్న కుర్రాడు జై(ప్రభాస్). స్వంత ఊరిలో నాన్న దేవా(సత్యరాజ్)ఎంత పెద్ద నాయకుడో తెలియకుండా కూల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ సందర్భంగా లో తన నేపధ్యం తెలుసుకుని మరదలి(అనుష్క)ని ప్రేమించే కారణంతో అక్కడికి వెళ్లి అమ్మానాన్నను కలిపి వ్యవహారం పెళ్లి దాకా తెస్తాడు. కాని బద్ధ శత్రువైన ఉమ(సంపత్ రాజ్)వల్ల అంతా అల్లకల్లోలం అవుతుంది. జై తల్లిని కోల్పోయి తండ్రికి దూరమవుతాడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో నుంచి ఎలా బయటపడి అందరిని ఏకం చేశాడనేదే మిర్చి కథ.

ఇలాగే పేపర్ పై రాసుకున్నప్పుడో లేదా విన్నప్పుడో మిర్చిలో ఎలాంటి ప్రత్యేకత కనపడదు. కాని కొరటాల శివ ఉద్దేశం వేరు. ఈ పాయింట్ ని కథకు కేవలం థ్రెడ్ గా మాత్రమే తీసుకున్నాడు. శత్రువును చంపడం కన్నా అతన్ని మార్చడం ద్వారా మారణహోమానికి అడ్డుకట్ట వేయోచ్చన్న అంతర్లీన సందేశాన్ని అద్భుతమైన కమర్షియల్ విలువలను జోడించి చెప్పడం వల్ల మిర్చి కథ జనానికి బాగా కనెక్ట్ అయిపోయింది. అప్పటికే ఫ్యాక్షన్ సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి. రొటీన్ ఫార్ములాలో వెళ్తే ప్రభాస్ కు ఇంకో ఫ్లాప్ తప్పదు. అందుకే కొరటాల శివ కొత్తగా ఆలోచించి ఫస్ట్ హాఫ్ మొత్తం కూల్ కాలేజీ ఎపిసోడ్స్ తో నింపేసి ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి అసలైన మిర్చి ఘాటు రుచి చూపించాడు .

మిర్చిని నిలబెట్టింది అందులో ఎమోషన్. రెగ్యులర్ గా అనిపించినా ఫీల్ తగ్గకుండా కొలత వేసుకుని మరీ కొరటాల శివ సెట్ చేసుకున్న స్క్రీన్ ప్లే దీనికి బలంగా నిలిచింది. తన కుటుంబానికి తెలియకుండా వాళ్ళను కాపు కాచే రక్షకుడిగా విశ్రాంతికి ముందు విలన్ ఉమకు హీరో జై ఇచ్చే వార్నింగ్ సీన్ కథను ఎక్కడికో తీసుకెళ్ళింది. శత్రువుల తరఫున వాళ్ళు నాన్నకు వార్నింగ్ ఇచ్చి వెళ్లి వెళ్తుంటే జై ఊరి పొలిమేరలకు పరిగెత్తుకుంటూ వెళ్లి జీపును ఆపి మరీ జై వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో అభిమానులకే కాదు సామాన్య ప్రేక్షకులకు సైతం గూస్ బంప్స్ వచ్చాయి. ఇదంతా శివ చేసిన మేజిక్ అయితే తన సాలిడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ యాక్టింగ్ తో ప్రభాస్ వీటిని నిలబెట్టడం మిర్చి స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది.

స్టార్ హీరోతో ఓ కమర్షియల్ మూవీని ఎలా డీల్ చేయొచ్చో మిర్చిని మంచి ఉదాహరణగా చూపొచ్చు. అనుష్క క్యుట్ పెర్ఫార్మన్స్, రిచా గ్లామర్ బోనస్. సంపత్ రాజ్ విలనీ, ఆదిత్య మీనన్ పాత్రలు దన్నుగా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మిర్చిని ఇంకొన్ని మెట్లు పైకి ఎక్కించేసింది. ముఖ్యంగా పండగలా దిగి వచ్చావు పాట ఆ మధ్య కాలంలో బెస్ట్ కంపోజిషన్ అని చెప్పొచ్చు. వారసుడిని జనానికి పరిచయం చేస్తూ వాళ్ళ ఫీలింగ్స్ ని కళ్ళకు కట్టినట్టు సాగే సాహిత్యం అందరిని ముగ్దులను చేసింది. మిర్చి మొత్తం ఆరు నంది అవార్డులు సొంతం చేసుకుని ఆ రకంగానూ మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇక ఫిలిం ఫేర్, సంతోషం, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇలా ఎన్నో మిర్చిని కోరి మరీ వరించాయి.

అందుకే ఏడేళ్ళు దాటుతున్నా మిర్చి ఎప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది.బాహుబలి కోసం ఐదేళ్ళు త్యాగం చేయకపోతే ఇలాంటివి డార్లింగ్ నుంచి ఎన్ని వచ్చేవో. వందల కోట్లు ఖర్చు పెట్టి సాహో లాంటి అర్థం కాని విజువల్ వండర్ కన్నా చివరి తరగతిలో కూర్చుని సినిమా చూసే సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా వాడు పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరిగేలా సాగే మిర్చి లాంటి సినిమాలు ఇంకా రావాలి. అందులో పాత ప్రభాస్ మళ్లి చూసుకోవాలి. ఇది అభిమానులే కాదు సినిమా ప్రేమికుకు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది.

Show comments