రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలనూ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పలు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో వారు నామినేషన్లను దాఖలు చేయగా, నామినేషన్లకు గడువు నిన్నటితో ముగిసింది.
మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, అందులో 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 14 మంది ఎన్నికయ్యారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్‌లో 4, కర్ణాటకలో 4, హర్యాణాలో 2 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ, ఛత్తీస్ గడ్, పంజాబ్, ఝార్ఖండ్ నుంచి తలో ఇద్దరు, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి చెరో ముగ్గురు, బీహార్ నుంచి ఐదుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 11 మంది, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కరు ఎన్నికయ్యారు.
మొత్తం 41 మందిలో 14 మంది బీజేపీ అభ్యర్థులుండగా.. నలుగురు కాంగ్రెస్, నలుగురు వైసీపీ, ముగ్గురు డీఎంకే, ముగ్గురు బీజేడీకి చెందినవారున్నారు. మరోవైపు రాజ్యసభలో అధికార కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలను ఉదయ్ పూర్ క్యాంప్‌నకు తరలించింది. వీరికి ఎక్కడ బీజేపీ గాలం వేస్తుందోనన్న ముంద జాగ్రత్తతో కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.