Idream media
Idream media
రాజ్యసభలో ఖాళీ అయిన 55 స్థానాల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 37 స్థానాలు ఏకగ్రీవం కాగా 18 స్థానాల్లో పోటీ అనివార్యమైంది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
37 స్థానాల్లో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో అవన్నీ ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథ్‌వాలే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ తదితరులు రాజ్యసభకు ఏకగ్రీవమైన వారి జాబితాలో ఉన్నారు.
ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండగా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ తరఫున మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నత్వానీలు, టీడీపీ తరఫున వర్ల రామయ్య నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో స్థానం కోసం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న రిలయన్స్ ప్రతినిధి నత్వానీకి, వర్ల రామయ్యకు మధ్య పోటీ జరగనుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నత్వానీ ఎన్నిక లాంఛనమే కానుంది.
తెలంగాణాలోని రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఖాళీ అయిన రెండు స్థానాలకు టీఆర్‌ఎస్ తరఫున కె.కేశవరావు, కె.ఆర్.సురేష్‌రెడ్డిలు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారు ఎకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.