iDreamPost
iDreamPost
ఇప్పుడెందుకీ జ్ఞాపకం
కొత్త సినిమాలు చూడడానికి, వాటి రివ్యూలు చదవడానికే టైం లేదు ఇంక ఈ పాత సినిమా గోల ఎందుకంటారా. ఆగండి కాస్త. మీరు చెప్పింది నిజమే. బాగా యాంత్రికమైన జీవితంలో క్లాసిక్ మూవీస్ గురించి అలోచించి చూసే ఓపిక తీరిక ఎవరికీ లేదు.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కథ,కథనాలు అధిక శాతం నాసిరకం అన్న పదం కన్నా ఇంకా బాగా వర్ణించే పదం ఏదైనా ఉంటే అది వాడాలి. అందుకే కాస్త తీరిక చేసుకుని మంచి ఆణిముత్యాలు అనదగ్గ చిత్రాల గురించి మీరు తెలుసుకోవడంలో తప్పేమి లేదు. సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం ఇదే తేది మార్చ్ 4న విడుదలైన ‘రుద్రవీణ’ మార్పు కోసం తపించిన ఓ యువకుడి ఆలోచనకు బృహత్తర ఆవిష్కరణ.
ఎందుకు చూడాలి
మనకు మనం మనది చాలా గొప్ప మనసని, సమాజానికి ఎంతో మేలు చేస్తున్నామని చెప్పుకుని మురిసిపోతుంటాం. నెలంతా కలిపి బిచ్చగాళ్లకు ఓ పదో ఇరవయ్యో దానం చేసి బోలెడంత పుణ్యం మూటగట్టుకున్నామని, చచ్చాక స్వర్గానికే డైరెక్ట్ ఎంట్రీ అని సంబరపడుతుంటాం. సమాజంలో ఎన్నో సమస్యలు, అన్యాయాలు, దుర్మార్గాలు. అన్నిటిని చూస్తూ ఎదో మార్పు రావాలి అని పదే పదే కోరుకుంటాం కాని మహాత్ముడు చెప్పినట్టు ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి అనే విషయాన్ని మాత్రం పట్టించుకోము. కులమత భేదాలు లేనిది ఈ ప్రపంచంలో మూడింటికే. ఒకటి డబ్బు. రెండోది స్వార్థం. మూడోది రక్తం. మొదటి దాని కోసం పాకులాడుతూ రెండోదాన్ని ఊపిరిగా పీల్చి మూడో దాంట్లో ఇంకిపోయేలా చేసుకోవడమే మానవ నైజం.అలా ఆలోచించకుండా తోటి వాడికి సహాయం చేయాలి, సమాజంలో మార్పు రావాలని తపన పడే అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు సూర్యం కథే రుద్రవీణ.
విలువలే కథా వస్తువు
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు గణపతి శాస్త్రీ చిన్న కొడుకు సూర్యం. అతనికి నాద స్వరం వాయించే ఒక మూగ అన్నయ్య. సూర్యం సమాజం పట్ల తపన కలిగిన వాడు. తండ్రికి ఛాందస భావాలు, కులాభిమానం ఎక్కువ. సూర్యం దళిత అమ్మాయి లలితను ప్రేమిస్తాడు. తండ్రి నుంచి విడిపోయి వేరుగా ఉంటాడు. ఇంతలో చారుకేశ అనే యువకుడు శాస్త్రీ కూతుర్ని ప్రేమించి ఆయనకు అల్లుడవుతాడు. సూర్యం గ్రామంలో మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలు మొదలు పెడతాడు. ఎన్నో అవమానాలు, చీదరింపులు మధ్య చివరికి కోరుకున్న లక్ష్యం సాధించి ప్రెసిడెంట్ సత్కారం పొందుతాడు. గణపతి శాస్త్రీ కొడుకు గొప్పదనం తెలుసుకుని అందరి ముందు ఒప్పుకోవడంతో పాటు సూర్యం,లలితలను ఒక్కటి చేయటంతో కథ ముగుస్తుంది.
నేర్పించే పాఠాలు
అభ్యుదయం, మార్పు, నాంది, విప్లవం, శంఖారావం, వెలుగు, సంస్కరణ ఇలాంటి పదాలకు కమర్షియల్ సినిమాలో చోటు ఉండదు. అలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా లాభాలు ఆశించకూడదు. వస్తేనే తీసుకోవాలి. ఈ నిజం తెలిసే చిరంజీవి తన తమ్ముడు నాగబాబు ను నిర్మాతగా పెట్టి ఈ సినిమా స్వయంగా నిర్మించాడు. ఇమేజ్ అనే చక్రబంధంలో ఇరుక్కుపోయి తనలోని నటుడిని ఛాలెంజ్ చేసే పాత్ర కోసం వేరే నిర్మాతను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక చిరునే ఈ సాహసానికి పూనుకున్నాడు.
బాలచందర్ దేశం గర్వించదగిన గొప్ప దర్శకుల్లో ఒకరు. సినిమా ద్వారా మనిషిని ఆలోచింపచేసేలా చేయటంలో బాలచందర్ సిద్ధహస్థులు. ఆ ప్రయత్నం ఇందులో అడుగడుగునా కనపడుతుంది. సమాజంలో మలినమైన మురికి గుడ్డలా మనిషిని నిలువునా ఉన్మాదిలా మారుస్తున్న కులవివక్ష అనే అంశాన్ని సుతిమెత్తని రీతిలో చూపిన ఆయన ప్రతిభకు మాటలు చాలవు. తాగుడు వ్యసనం వల్ల కుటుంబాలు ఎలా సర్వనాశనం అవుతాయో చూపిన బాలచందర్ కథనం మనసును తాకుతుంది. మచ్చుకు ఈ సన్నివేశాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు
#ఒక ఎంపీ ఆ ఊరి గుండా వెళ్తూ చక్కని ఆ గ్రామీణ వాతావరణానికి అబ్బురపడతాడు. దీనికి కారణమైన సూర్యం కథని అతని నోటి వెంటే రామాయణం విన్నంత శ్రద్ధగా ఉంటాడు. ఎవరికివారు హోదాలో తమ స్థాయిలో గొప్పవాళ్లే అయినా పరస్పరం చేతులు కట్టుకుని ఇచ్చి పుచ్చుకునే గౌరవం చూస్తే మనం నేర్చుకునే తొలి పాఠం ఇదే అనిపిస్తుంది
#తాగుడుకు బలైన ఒక ఉద్యోగి ఇంటికి సూర్యం వెళ్ళినప్పుడు తల్లీకుతుళ్లలో ఎవరో ఒకరే బయటికి వచ్చి మాట్లాడి వెళ్తుంటారు. అదేంటని అడిగితే దాపుడు చీర లేదని ,ఇంట్లో ఇద్దరికీ ఉన్నది ఒకటే చీరని ఆ తల్లి చెప్పినప్పుడు గుండె పొరల్లో ముల్లు కాదు గునపం గుచ్చుకున్నంత బాధ కలుగుతుంది.
#సూర్యం పెళ్ళిలో తాగుబోతులంతా వచ్చి అతను పెళ్లి మానేస్తే తాము తాగుడు మానేస్తామని సవాల్ విసిరినప్పుడు సూర్యం, లలిత త్యాగానికి సిద్ధం అంటూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకునే సీన్ లో కళ్ళు చెమ్మగిల్లుతాయి.
#గుడిసెలకు నిప్పు అంటుకుని సూర్యం కచేరికి రాలేకపోతే ఇంట్లో అందరు భోజనాలు మానేసి కూర్చుంటారు. తాను మాత్రం తింటా అని ఆబగా పళ్ళెం తీసుకుని అన్నం తినబోతూ వదిన కళ్ళలోకి చూసే చిరంజీవి నటనకు,బాలచందర్ స్క్రీన్ ప్లే కు శిరస్సు వంచాల్సిందే.
#సూర్యం,లలిత తోటలో నడుస్తూ వెళ్తూ ఉండగా గణపతి శాస్త్రీ ఎదురై కులం పేరుతో లలితను ఎగతాళి చేస్తాడు.అప్పుడు లలిత సూర్యం చేతిని గట్టిగా పట్టుకుని శాస్త్రీని నిలదీసే సీన్ మహిళా ఆత్మవిశ్వాసానికి ఋజువులా నిలుస్తుంది.
#సూర్యంకు అవార్డ్ వచ్చిందని గణపతి శాస్ట్రీ ఇంటర్వ్యూ కోసం ఇంటికి వచ్చిన విలేఖరులతో మాట్లాడకుండా సంజ్ఞలతో జెమిని గణేషన్ నటన ఆనందాన్ని గుంభనంగా గుండెల్లో దాచుకోవడం ఎలాగో నేర్పుతుంది. అహంకారం చివరి దశకు వచ్చినప్పుడు మనిషి ప్రవర్తనను బాలచందర్ చూపిన వైనం మనల్ని ఆ ధోరణి వీడమనేలా చేస్తుంది.
ఎవరూ నటించలేదు
చిరంజీవి సూర్యం పాత్రలో ఒదిగిపోగా సినిమాలో మనల్ని వెంటాడేది గణపతి శాస్త్రీ పాత్ర పోషించిన జెమినీ గణేశన్(మహానటి సావిత్రి గారి భర్త). అహంకారం, ఆగ్రహం, ఆధిపత్యం కలబోసిన పాత్రకు ఎస్.పి. బాలసుబ్రమణ్యం డబ్బింగ్ జతకలిసి మూర్ఖత్వాన్ని సంప్రదాయం ముసుగులో కప్పేసిన గణపతిలో జెమినీ గణేషన్ కనపడడు. అంతగా పండించారు పాత్రని. పిఎల్ నారాయణ, బ్రహ్మానందం,ప్రసాద్ బాబు, సత్యనారాయణ, రమేష్ అరవింద్, వారి పాత్రలు తప్ప నటులు కనపడరంటే అది దర్శకత్వ ప్రతిభే. చిరంజీవి నటన చాలా వైవిధ్యం ఇందులో. ఆవేశం కన్నా సాటివాడిని మనిషిగా చూడాలన్నా ఆర్ద్రతను సూర్యం పాత్ర ద్వారా గొప్పగా చూపించాడు. లలిత పేరును తొలుత పెంటమ్మ అని వదినకు చెప్పాల్సి వచ్చినప్పుడు పడే ఇబ్బంది, లలిత తన పేరును చేతి మీద పచ్చ బొట్టు పొడిపించుకుంది అని తెలిసినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్, పెళ్లి మంటపం లో వేడుకను రద్దు చేసుకునే సీన్ ఇలా వేటికవే సాటి. శోభన సైతం తన ఉనికిని చాటుకునేలా గొప్ప నటన ప్రదర్శించింది.
వెన్నెముకలా సాంకేతిక వర్గం
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు వెన్నెముక. పాటలతో, నేపధ్య సంగీతంతో ప్రాణం పోసారు. నేను సైతం అనే పాటకు సిరివెన్నెల సాహిత్యం తోడయ్యి ఒక రకమైన ఉద్వేగంతో మన రోమాలు నిక్క బొడిచేలా చేస్తాయి. రాజను అవార్డులు, రివార్డులు వరించటంలో ఆశ్చర్యం లేదు. ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం పాటలో హాస్యాన్ని జోడించినా, లలిత ప్రియా కమలం గీతంలో హిమసొగసుల మధ్య ప్రేమను సంగీతం రూపంలో అద్భుతంగా ఆవిష్కరించినా అది రాజాకే చెల్లుతుంది.
గణేష్ పాత్రో సంభాషణల గురించి చెప్పాలంటే ఇక్కడ పేజీలు సరిపోవు. అత్యద్భుతం అనే మాట చిన్నదే. సమాజంలోని అంతరాలను తన మాటల ద్వారా ఆలోచింపజేసిన అత్తనా ప్రతిభ గురించి వర్ణించడం సులువు కాదు. రఘునాథరెడ్డి ఛాయాగ్రహణం సైతం వెండితెర చైతన్యానికి నేను సైతం అనే స్థాయిలో ప్రాణం పెట్టింది. ఒకరా ఇద్దరా సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరు తమ హృదయవీణలే సవరించారు.
చివరిగా ఒక్క మాట
ఇందులో లలిత సూర్యం ప్రేమకు అంగీకారం తెలిపే సీన్ ఒకటి ఉంది. సూర్యం కాయిన్ టాస్ వేస్తాడు. బొమ్మ వస్తే ప్రేమించాలి బొరుసు వస్తే లేదని. గాల్లో ఎగిరి కింద పడుతుండగా లలిత మధ్యలోనే ఒడిసి పడితే సూర్యం ఎందుకు అని అడుగుతాడు. తనకు బొరుసు పడటం ఇష్టం లేదని చెబుతుంది లలిత. ప్రేమకు అంగీకారం తెలిపే సీన్స్ లో ఇది ఒక అద్భుత అల్లిక. ఈ సినిమా కూడా అంతే. చూడాలా వద్దా అని టాస్ వేయాల్సిన బాపతు కాదు. చూసి తీరాలి. ఆస్వాదించాలి. అందుకే ఇది మనసున్న మనుషుల సినిమా. మనసున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.