iDreamPost
android-app
ios-app

అమరావతి ఉద్యమం ఎవరికోసం?

అమరావతి ఉద్యమం ఎవరికోసం?

అమరావతి (రాజధానిగా చెప్పబడిన ప్రాంతం)లో కొన్ని గ్రామాల్లో కొందరు రైతులు ఉద్యమం చేస్తున్నారు. మొత్తం 29 గ్రామాలు. భూములిచ్చిన రైతులే 29 వేలమంది ఉన్నారని నిన్నటివరకూ అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుతో సహా, అందరూ చెపుతున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన నేతలను, పత్రికలను, టీవీ ఛానళ్ళను పక్కన బెట్టి ఒక్కసారి వాస్తవంగా, నిజాయితీగా చూస్తే అక్కడ ఉద్యమంలో 29 వేలమంది రైతుల్లో ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. అలా చూస్తేనే ఈ ఉద్యమం ఏంటో, ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, వారి ప్రయోజనాలు ఏంటో స్పష్టత వస్తుంది. లేకపోతే ఈ మీడియా తన రాజకీయ ఎజెండాతో చూపించే కిరాయి, కల్పిత ఉద్యమమే కనిపిస్తుంది.

భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్)
“రాజధానికోసం విజయవాడ-గుంటూరు ప్రాంతం సరైన నిర్ణయం కాదు. ఇవి సారవంతమైన భూములు. మనది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ప్రజల్లో ఎక్కువమంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. పైగా ఇక్కడ రాజధాని నిర్మాణం తలపెడితే వ్యసాయం పోవడం వల్ల వచ్చే (పంట నష్టం, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల జీవినం దెబ్బతినడం) నష్టంతోపాటు భవన నిర్మాణ వ్యయం ఉంటుంది.” ఇవి పలువురు నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలు. అయినా సరే, నాటి పాలకుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్నే రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. ఎంపికకు ముందే రాజధాని ప్రాంతంలో తన అనుయాయులతో, అనుచరులతో భూములు కొనుగోలు చేయించారనే ఆరోపణ ఉంది. రాజధాని ప్రాంతంలోనే కాదు, రాజధానికి సరిగ్గా సరిహద్దులో కూడా భూముల కొనుగోలు జరిగింది.

మబ్బుల్లో నీళ్ళు చూపించారు. చందమామ కథలు చెప్పారు. కంప్యూటర్ లో గ్రాఫిక్ నగరం చూపించారు. వేలల్లో పెట్టుబడి పెడితే కోట్లల్లో వస్తుందనే ఆశలు రేకెత్తించారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్నారు. ప్రపంచానికే డెస్టినేషన్ అన్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి తాము కస్టపడి కూడబెట్టుకున్న సొమ్ములు ఇక్కడ పెట్టుబడి పెట్టేలా కథలు అల్లి, నమ్మించి, భూములు కొనుగోలు చేయించారు. ఇచ్చిన ఐదేళ్ళలో జరిగిన పని ఎంత? రైతులతో ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లు 2018నాటికే ఇవ్వవలసి ఉండగా అవి ఎంతమేరకు అభివృద్ధి చేశారు? ఎంతమంది రైతులకు ఇచ్చారు? అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ప్రజలు తనకు ఇచ్చిన సమయం ఎంత? తాను నెత్తిన పెట్టుకుని మోస్తున్న కలల రాజధాని ఏంటి? అది నిర్మాణం చేయాలంటే ఎంతకాలం పడుతుంది? తనకిచ్చిన ఐదేళ్ళలో ఎంతమేరకు ఆ పని పూర్తిచేయగలను అనే స్పృహ లేకుండా ఐదేళ్ళూ ఏం చేశారు? తానూ, తనవాళ్ళూ పెట్టిన పెట్టుబడి ఏమవుతుందో అన్న భయం ఒకవైపు, తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చనందుకు రైతులు ఎక్కడ తనను నిలుస్తారో అన్న భయం మరో వైపు… చంద్రబాబు లోని ఈ రెండు భయాలూ ఇప్పుడు అమరావతిలో వినిపిస్తున్న ఉద్యమానికి ప్రధాన కారణం.

కలల రాజధాని
చంద్రబాబు రైతులకు ఒక కొత్త ప్రపంచాన్ని వాగ్దానం చేశారు. జరీబు భూములు కాకుండా మిగతా భూములన్నీ ఎకరా ఐదు లక్షలకు కూడా అమ్ముడుపోని ఆ భూములను ఐదు కోట్లకు అమ్ముకునే అవకాశం ఈ రైతులకు చంద్రబాబు కల్పించారు. ఒక్కసారి ఎకరానికి ఐదుకోట్ల రూపాయలు చేతుల్లో పడగానే చంద్రబాబు ఏం చెపితే అది జరిగిపోతుందనే నమ్మకం రైతుల్లో కలిగింది. రాజధాని శంఖుస్థాపన చేయక ముందే ఐదులక్షల భూమి ఐదుకోట్ల అయ్యేసరికి చంద్రబాబు చెప్పిన ప్రపంచ స్థాయి రాజధాని వచ్చేస్తుందని రైతులు నమ్మేశారు.

వచ్చిన ఐదు కోట్లు రైతుల జీవన విధానాన్ని మార్చింది,విలాసాలు పెరిగాయి,డబ్భు నీళ్లలా ఖర్చు అయ్యింది. పైగా ఎంతో కొంత భూమి ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి ఆ భూమికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుండి యేటా వచ్చే 50 వేలు కూడా మొదటి రెండుమూడేళ్ళలో బ్యాంకు అకౌంట్లలో పడడంతో చంద్రబాబుపై, ఆయన సామర్థ్యంపై ఈ రైతులకు మరింత విశ్వాసం పెరిగింది. జీవిన విధానం మారింది. కార్లు పెరిగాయి. ఇంట్లో లిఫ్టులు వచ్చాయి. విలాసాలు పెరిగాయి. కట్న కానుకలు పెరిగాయి. అల్లుళ్ళకు ఆకాశమంత ఆశలు చూపించారు. చంద్రబాబు చూపిన డిజిటల్ రాజధాని అల్లుళ్ళకు చూపించి బంధాలు కలుపుకున్నారు. ఐదేళ్ళ తర్వాత పాలకుడు మారాడు. ఇప్పుడు డిజిటల్ రాజధాని లేకుండా పోయింది. అలవాటయిన విలాసాలకు దెబ్బతగిలింది. మారిన కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయి. అవి ఆందోళకరంగా ఉన్నాయి. అల్లుడు మీరు ఆశపెట్టిన కోట్లు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇది ఆందోళన కలిగిస్తోంది. గుండెలు ఆగిపోయేలా చేస్తోంది. అందుకే వారు రోడ్డెక్కుతున్నారు.

పెట్టుబడిదారులు
రైతులనుండి ఎకరం ఐదుకోట్లకు కొనుగోలు చేసిన పెద్దమనుషులు ఇప్పుడు బయటపడరు. వారి భయాలు వారివి. పాలకుడు చెప్పినట్టు ఇన్సైడర్ ట్రేడింగో, మరొకటో… పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి భూములు కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడిలో అధికశాతం నల్లడబ్బే. ఇప్పుడు వారు రోడ్డుమీదకు వస్తే ఇన్సైడర్ ట్రేడింగు అంటారు. లేదా ఆదాయపన్ను అధికారులు ఆ డబ్బుకు లెక్క చెప్పమంటారు. ఇన్ని రిస్కులు వారు తీసుకోడానికి సిద్ధంగా లేరు. అందుకే రైతులను అడుగుతున్నారు. “మేమిచ్చిన ఎకరా ఐదుకోట్లకోసం ఓసారి రోడ్డేక్కండి” అని వత్తిడి చేస్తున్నారు. రైతులు మోసం చేసే రకం కాదు. తీసుకున్న డబ్బుకు జవాబుదారిగా ఉండాలనుకునే లక్షణం ఉన్నవారు. అందుకే వారు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు.

చంద్రబాబు నాయకత్వం
అమరావతి పొతే చంద్రబాబు తన పేరుపోతుందనో, తన పెట్టుబడులు పోతాయనో, పార్టీ పరంగా స్థానబలిమి పోతుందనో ఉద్యమం చేస్తున్నారు. తాను కట్టని హైద్రాబాదును తానే కట్టినట్టు చెప్పుకునే చంద్రబాబు తాను ఊహించిన అమరావతి ఎక్కడ మాయం అవుతుందో, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని చరిత్రలో తనపేరు లేకుండా పోతుందో అన్న భయం, ఆ బాధ ఆయనకుంది. ఆయన బాధ రాజకీయ, ఆర్ధికపరమైనది. ఆయనకు ఇంకో ప్రత్యామ్న్యాయం కూడా లేదు. ఆయన రోడ్డుమీద ఉండాల్సిందే. ఉద్యమం చేయాల్సిందే. ఆయనకు అండగా ఉన్న మీడియాకు కూడా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించిన మీడియా ఇప్పుడు ఆయనను ఏకాకిని చేయలేదు.

పైగా చంద్రబాబుకు ఉన్న అభద్రతా భావమే ఇప్పుడు ఈ మీడియా యాజమాన్యానికి కూడా ఉంది. అందుకే మందడంలో ప్రదర్శన, అనంతపురంలో ప్రదర్శన, అనకాపల్లి, ఆముదాలవలసలో ప్రదర్శన… ఇలా జిల్లా పేజీలకు కూడా చాలని వార్తలను ప్రధాన వార్తలుగా ప్రముఖంగా చూపిస్తున్నారు. “ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది” అని చలం ఎప్పుడో చెప్పినట్టు “చంద్రబాబు అండ్ కో బాధ రాష్ట్రం బాధ”గా కనిపిస్తోంది. పెట్టుబడి దారుల బాధ రైతుల బాధగా చిత్రీకరించబడుతుంది. అల్లుళ్ళ బాధ రైతు కుటుంబం బాధ అవుతోంది.

రాజధానితో పని ఎవరికి? వాస్తవానికి రైతుకు, కౌలు రైతుకు, రైతు కూలీకి, ఆమాటకొస్తే సామాన్య ప్రజలకు రాజధాని ఎక్కడుంటే ఏంటి? అప్పుడెప్పుడో రాజధాని మద్రాసు అయినప్పుడు, ఈ మధ్యవరకూ రాజధాని హైదరాబాద్ అయినప్పుడు తమ పనులకోసం రాజధానికి వెళ్ళిన వాళ్ళెవరైనా ఈ ఉద్యమంలో ఉన్నారా? పైరవీకారులు, రాజకీయ నాయకులూ, కాంట్రాక్టర్లు, కొంతమేర ప్రభుత్వ ఉద్యోగులు మినహా నిత్యం రాజధానితో పని ఉండే ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ ఉద్యమంలో? అందుకే ఇది చంద్రబాబు ఉద్యమం. ఇది పెట్టుబడి పెట్టి భూములు కొన్న పెట్టుబడిదారుల ఉద్యమం. వాస్తవాన్ని విస్మరించి డిజిటల్ విన్యాసాలను నమ్మి విలాసాలకు అలవాటుపడ్డ అత్యాశాపరులది ఈ ఉద్యమం.