iDreamPost
iDreamPost
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి పొలిటికల్ సెంటర్ పాయింట్ గా మారారు. జగన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశాలవుతున్నాయి. పలువురు అభిమానుల్లో ఆయన ప్రకటనకు సానుకూల స్పందన వచ్చింది. అదే సమయంలో మెగా ఫ్యామిలీ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వారంతా గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన శ్రేణులకు ఈ ప్రకటన పాలుపోవడం లేదు. అందుకు తోడుగా తెలుగుదేశం నేతలు కూడా తల్లడిల్లిపోతున్నట్టు కనిపిస్తోంది. నేరుగా టీడీపీ సోషల్ మీడియాతో పాటుగా ఆపార్టీ నేతలు కూడా మీడియా ముందు చేస్తున్న వ్యాఖ్యలు దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
మూడు రాజధానుల అంశం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అదే ఇప్పుడు జనసైనికులకు మింగుడుపడడం లేదు. ఆపార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అంతకుముందే జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటన చేశారు. చివరకు జగన్ కి పుట్టిన రోజు పాలాభిషేకం నిర్వహించి తన మద్ధతు తెలిపారు. అయినప్పటికీ చిరంజీవి ప్రకటన జనసేనకు షాక్ ఇచ్చినట్టవుతోంది. మెగా అభిమానుల్లో కొత్త మంట రాజేస్తోంది. పలువురు చిరంజీవి అభిమానులు ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నారు. కానీ పవన్ ఫాలోవర్స్ మాత్రం తొలుత ఫేక్ అంటూ కొట్టిపారేయడానికి ప్రయత్నించి, చివరకు చిరంజీవి తీరుని కూడా తప్పుబట్టేందుకు సిద్ధపడుతున్నారు.
జనసేనని మించి టీడీపీ నేతలు స్పందించడం మరో ఆసక్తికర అంశం అవుతోంది. టీడీపీ సోషల్ మీడియా విభాగం తరుపున నేరుగా చిరంజీవి మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిచిరంజీవి మరోసారి జంప్ చేస్తారేమో అంటూ వైసీపీ లో చేరతారనే ప్రచారం ప్రారంభించారు. అన్నయ్య చిరంజవి చేసిన ప్రకటన పట్ల జనసేన ఆచితూచి వ్యవహరిస్తూ, క్యాబినెట్ భేటీ తర్వాత స్పందిస్తామనే చెబుతుండగానే టీడీపీ నేతలు మాత్రం కొంత దూకుడు ప్రదర్శించడం విస్మయకరంగా మారింది.
సామాజిక కోణంలో చిరంజీవి ప్రకటన టీడీపీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళనను విస్తరించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. విజయవాడ గుంటూరుతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలకు పురగొల్పుతున్నారు. అలాంటి సమయంలో కీలక సామాజికవర్గానికి చెందిన చిరంజీవి ప్రకటన ఆయన అభిమానులతో పాటుగా ఆ సామాజికవర్గానికి చెందిన వారిలో కొత్త ఆలోచనను రేకెత్తించే ప్రమాదం ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. దాంతో చిరంజీవి మీద గురిపెట్టి వరుసగా ట్రోలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా చిరంజీవి రాజేసిన చిచ్చు ఆ రెండు పార్టీలకు జీర్ణం కాని పరిస్థితిని తీసుకొచ్చిందనే చెప్పవచ్చు.