మూడు రాజ‌ధానులు – ఏ విధులు ఎక్కడ నుంచి నిర్వహిస్తారు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌స్తావించ‌డంతో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. అనుకూల‌, వ్య‌తిరేక ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీల్లోనూ దాదాపుగా భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన కేఈ, గంటా శ్రీనివాస‌రావు వంటి సీనియ‌ర్లు కూడా జ‌గ‌న్ నిర్ణ‌యానికి జై అంటున్నారు. జ‌న‌సేన‌కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా మూడు మంచి నిర్ణ‌యం అంటున్నారు. లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కూడా భేష్ అంటూ కొనియాడారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మాత్రం అమ‌రావ‌తిలోనే అడ్మినిస్ట్రేటివ్ రాజ‌ధానిని కొన‌సాగించాలంటూ వ్యాఖ్యానించారు. 
మూడు రాజ‌ధానులు అంటే ఏమిటి
భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌ధానంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి శాస‌న వ్య‌వ‌స్థ‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌గా చెబుతుంటారు. ప‌త్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ గా వ‌ర్ణించ‌డం వెనుక వాటి స‌ర‌స‌న మీడియాను భావించ‌డ‌మే కార‌ణం. అయితే ఇప్పుడు ఈ మూడు విభాగాల‌కు మూడు రాజ‌ధానుల ఏర్పాటు అంశాన్ని జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. 

దాని ద్వారా మూడు ప్రాంతాల స‌మ‌గ్రాభివృద్ధికి దోహ‌దం చేస్తుంద‌ని, ఆర్థికంగా పెద్ద భారం ఉండ‌ద‌ని, అస‌మాన‌త‌లు వైదొలిగిపోతాయ‌ని, భ‌విష్య‌త్తులో మ‌రోసారి ప్రాంతీయ విబేధాల‌కు ఆస్కారం ఉండ‌ద‌ని చెబుతున్నారు. 

Also Read : రాజధాని మీద ఏ కమిటీ పనిచేస్తుంది?


ఎక్క‌డ ఏం చేస్తారు
రాజ్యాంగం ప్ర‌కారం శాస‌న వ్య‌వ‌స్థ ప్ర‌ధాన‌మైన‌ది. శాస‌నాలు త‌యారీ చేసే పార్ల‌మెంట్ ఈ వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన‌ది. రాష్ట్ర స్థాయిలో శాస‌న‌స‌భ‌, మండ‌లి ఉంటాయి. రాష్ట్రాల జ‌నాభాను బ‌ట్టి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏర్పాటు చేసి, ఎన్నిక‌ల్లో మెజార్టీ వ‌చ్చిన పార్టీ త‌రుపున పాల‌క‌వ‌ర్గం ఏర్ప‌డుతుంది. ముఖ్య‌మంత్రి, ఆయ‌న మంత్రివ‌ర్గం శాస‌న‌స‌భ‌కు జ‌వాబుదారీగా ఉంటారు. స‌భ ఎన్నుకున్న స్పీక‌ర్ కి అధికారాలుంటాయి. 

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌లో కూడా అమ‌రావ‌తిని లెజిస్లేచ‌ర్ క్యాపిట‌ల్ గా కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. త‌ద్వారా అసెంబ్లీ ని అమ‌రావ‌తి కేంద్రంగా నిర్వ‌హించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు.  అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఏటా మూడు సార్లు( బ‌డ్జెట్ , వ‌ర్షాకాల‌, శీతాకాల స‌మావేశాల కోసం)  రాష్ట్రానికి చెందిన 175 మంది ఎమ్మెల్యేలు అమ‌రావ‌తి రావాల్సి ఉంటుంది. వారికి అందుబాటులో ఉండ‌డం కోసం అధికార యంత్రాంగం కూడా అమ‌రావ‌తికి వ‌స్తారు. 

కార్య‌నిర్వాహక వ్య‌వ‌స్థ‌
రాజ్యాంగం ప్ర‌కారం కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌దే కీల‌క‌పాత్ర‌. రాజ్యాంగం ఎంత గొప్ప‌ద‌యినా అమ‌లు చేసిన వారిని బ‌ట్టే ఫ‌లితాలు ఉంటాయ‌ని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేర్కొన్నారంటే ఈ విభాగం పాత్ర మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. దీనికి విధానం ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ నాయ‌కుడ‌యిన‌ప్ప‌టికీ ఆచ‌ర‌ణ‌లో మంత్రివ‌ర్గం, దానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ముఖ్య‌మంత్రికే ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. ప్ర‌స్తుతం వివిధ సంద‌ర్భాల్లో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ అవ‌స‌రంపై చ‌ర్చ కూడా సాగుతోంది. 

కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌లో అధికార యంత్రాంగం ఉంటుంది. సెక్ర‌టరేట్, క‌మిష‌న‌రేట్ వంటి వివిధ విభాగాలుంటాయి. ప్ర‌స్తుతం ఏపీని కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌హారాల కోసం 13 జిల్లాలుగా విభజించారు. ఆయా జిల్లాల్లో కూడా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో వివిధ శాఖ‌లు ఉంటాయి. 


Also Read :మూడు రాజధానులు మంచి ఆలోచన – జయప్రకాశ్ నారాయణ.

న్యాయ వ్య‌వ‌స్థ‌
న్యాయ వ్య‌వ‌స్థ‌లో రాష్ట్రాల స్థాయిలో హైకోర్టు ది పెద్ద పాత్ర‌. దానికి అనుగుణంగా రాష్ట్ర‌ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్, లీగ‌ల్ అథారిటీ స‌హా వివిధ సంస్థ‌లుంటాయి. న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను నిర్ధేశిస్తారు. జిల్లాల ప‌రిధిలో ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్ సెష‌న్స్ జ‌డ్జ్ ముఖ్య భూమిక పోషిస్తారు. 
మూడు విభాగాల‌కు మూడు రాజ‌ధానులు
ఈ మూడు వ్య‌వ‌స్థ‌ల‌కు మూడు రాజ‌ధానుల ఏర్పాటు ఆచ‌ర‌ణ‌లో కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం క‌లిగిస్తుంది. అదే స‌మ‌యంలో కొన్ని స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతోంది. ప్ర‌స్తుతం అత్య‌ధిక పాల‌నా వ్య‌వ‌హారాలు ఆన్ లైన్ కావ‌డంతో ఫైళ్ల క్లియ‌రెన్స్ వంటివి పెద్ద స‌మ‌స్య కాబోదు. కానీ ప‌ర్య‌వేక్ష‌ణ విష‌యంలో కొన్ని చిక్కులు వ‌స్తాయ‌నే అభిప్రాయం ఉంది. ద‌క్షిణాఫ్రికాలో కూడా మూడు రాజ‌ధానులు చారిత్ర‌క అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఏర్పాటు చేసుకున్న‌ప్ప‌టికీ కొన‌సాగించ‌డంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 
ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ కీల‌కం
ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు లెజిస్లేచ‌ర్ క్యాపిట‌ల్ గా అమ‌రావతి ఉంచి, ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ గా విశాఖ‌, జ్యూడీషియ‌రీ క్యాపిట‌ల్ గా క‌ర్నూలు ఎంపిక చేస్తే అమ‌రావ‌తి క‌న్నా విశాఖ‌ప‌ట్నానికే ప్రాధాన్య‌త ఉంటుంది. కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌హారాలు అంటే సెక్ర‌టేరియేట్ కీల‌కం కాబ‌ట్టి పాల‌నా విష‌యాల్లో ప్ర‌ధాన‌మైన రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం మారుతుంది. అయితే రాయ‌ల‌సీమ వాసుల‌కు విశాఖ‌ప‌ట్నం దూరం అవుతుంద‌ని కొంద‌రు వాదిస్తున్న‌ప్ప‌టికీ సెక్ర‌టేరియేట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం జ‌నాభాలో కనీసం 5 శాతం మందికి కూడా ఉండ‌ద‌న్న‌ది వాస్త‌వం. అయినా రాజ‌ధానులు మ‌ధ్య‌లోనే ఉండాల‌నే నిబంధ‌న లేద‌ని ఢిల్లీ అనుభ‌వంతో ప్ర‌భుత్వంలో కొంద‌రు వాదిస్తున్నారు. 

Also Read :రాజ‌ధాని – ఉత్తరాంధ్ర


విశాఖ,అమ‌రావ‌తి ప్రాధాన్య‌త దేనికి
అన్నింటిక‌న్నా మించి గ‌వ‌ర్న‌ర్ నివాసం రాజ్ భ‌వ‌న్, ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యం ఎక్క‌డ ఉంటాయ‌న్న దానిని బ‌ట్టి అధికారం ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. సీఎం త‌న క్యాంప్ కార్యాల‌యం తాడేప‌ల్లిలో కొన‌సాగిస్తే అధికార కేంద్రంగా విశాఖ ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ కేంద్రంగా అమ‌రావ‌తికి ప్రాధాన్య‌త కొన‌సాగుతుంది. అయితే కీల‌క అధికారుల‌కు మాత్రం ప‌దే ప‌దే అమ‌రావ‌తి, విశాఖ మధ్య రాక‌పోక‌లు త‌ప్ప‌వు. 

అందుకు భిన్నంగా సీజ‌న్ల వారీగా సీఎం నివాసం మారితే మాత్రం ప‌రిస్థితి వేరుగా ఉంటుంది. ప్ర‌స్తుతం జీఎన్ రావు క‌మిటీ రిపోర్ట్, దానిపై ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మే కీల‌కంగా మారింది. రాజ‌ధానులు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ రాజ్యాంగం ప్ర‌కారం అభ్యంత‌రం లేదు. ఇప్ప‌టికే అత్య‌ధిక రాష్ట్రాల్లో అధికార వికేంద్ర‌కర‌ణ‌లో భాగంగా రాజ‌ధానుల ఏర్పాటు క‌నిపిస్తోంది. దాంతో ఏపీలో కూడా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న విష‌యం చివ‌ర‌కు ఎటు మ‌ళ్లుతుంద‌న్న‌ది కీల‌కాంశం అవుతోంది.

Show comments