డబుల్ వినోదాల చిరునామా ‘హలో బ్రదర్’

ఏదైనా సినిమా చూస్తున్నంతసేపు చక్కిలిగింతలు పెడుతూ నవ్విస్తున్నట్టు అనిపించిందంటే అందులో నిఖార్సైన కామెడీ ఉన్నట్టు. స్టార్ హీరోలతో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా చిక్కులుంటాయి. అభిమానులను సంతృప్తి పరచటం అందులో ప్రధానమైనది.

అలాంటిది వాళ్ళతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనుకోవడం కత్తి మీద సామే. దర్శక దిగ్గజం, రచయిత జంధ్యాల గారు మెగాస్టార్ చిరంజీవి తో ఓ కామెడీ నవల ఆధారంగా చంటబ్బాయి తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారు కాని ఆ రోజుల్లో అది ఫ్లాప్ మూవీ. బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయి తీసారు.సేమ్ రిజల్ట్. అప్పుడు యూత్ గా ఉండి ఇప్పుడు ముదిమి వయసుకు వచ్చిన ఆ హీరోల ఫ్యాన్స్ ఎవరినైనా అడగండి. నిజం మీకే తెలుస్తుంది.

ఎందుకంటే స్టార్ తో సినిమా చేసేటపుడు కొన్ని లెక్కలుంటాయి. ఆటలు, పాటలు, డాన్సులు వగైరా వగైరా. వాటికి అనుకూలంగా స్క్రిప్ట్ ఉంటేనే ప్రేక్షకులు ఆమోదిస్తారు, కాసులు కురిపిస్తారు. లేదంటే తేడా కొట్టి బయటికి వెళ్ళినంత ఫాస్ట్ గా ప్రింట్ ల్యాబ్ కు రిటర్న్ వచ్చేస్తుంది. అలా జరగకుండా జంధ్యాల తర్వాత కామెడీకి చిరునామాగా మారిన ఈ.వి.వి సత్యనారాయణ యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా అన్ని దినుసులు సమపాళ్ళలో వేసి తెలుగు తెర కోసం వండిన నవ్వుల వంటకమే “హలో బ్రదర్” . వచ్చి 26 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్ లా అనిపించే ఈ చిత్రం గురించి కొన్ని కబుర్లు పంచుకుందాం

స్టొరీ ఏంటి

మిశ్రో(చరణ్ రాజ్) అనే దుర్మార్గుడి వల్ల పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి(శరత్ బాబు)కవల పిల్లలు పుట్టగానే విడిపోతారు. దేవా(నాగార్జున 1) పేదవాడిగా పెరిగి మంచి చేసే దొంగగా మారతాడు. రవివర్మ(నాగార్జున 2) అమెరికాలో అమ్మ నాన్న దగ్గరే పెరిగి పాపులర్ సింగర్ అవుతాడు. మిశ్రో కొడుకు మిత్ర(నెపోలియన్)తన తండ్రిని చంపిన చక్రవర్తి కోసం పగతో రగిలిపోతూ వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే దేవాతో శత్రుత్వం మొదలవుతుంది. తర్వాత దేవా,రవి కలుసుకోవడం, ఒకళ్ళ సమస్యలు ఇంకోకళ్ళు సాల్వ్ చేసుకోవడం, చివరికి మిత్ర ఆటకట్టించటం. ఇది క్లుప్తంగా కథ.

అందరూ నవ్వించేవాళ్ళే

ఒకే సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించటం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. నాగార్జున ఈ సవాల్ ని అత్యంత సునాయాసంగా ఎదుర్కొన్నాడు. నటనలో, యాసలో, వేషధారణలో ఒకదానితో మరొకటి పోలిక లేకుండా నిజంగానే యువసామ్రాట్ అనిపించుకున్నాడు. హలో బ్రదర్ విడుదలకు రెండేళ్ళ క్రితమే ఇలాంటి పాత్ర స్వభావాలతోనే చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ చేస్తే అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడీ నాగ్ సినిమా చూస్తున్నప్పుడు రౌడీ అల్లుడు ఏ మాత్రం స్పూరణకు వచ్చినా చూసేవాళ్ళకు కాపీ కొట్టారనే ఫీలింగ్ వస్తుంది. ఈ విషయంలో దర్శకుడు ఎంత జాగ్రత్త పడ్డాడో, అంతకు పది రెట్లు అక్కినేని వారసుడు తన నటనతో న్యాయం చేకుర్చాడు. ఫస్ట్ హాఫ్ లో దేవా పాత్ర చేసే చిలిపి దొంగతనాలు ఎంత నవ్విస్తుందో, ప్రీ ఇంటర్వెల్ లో చెల్లెల్ని అవమానించిన మిత్రను చిత్తుచిత్తుగా కొట్టే సీన్ లో రియల్ మాస్ హీరో బయటికి వచ్చేలా చేసి విజిల్ వేయిస్తుంది.

దేవా తో పోలిస్తే అమాయకుడిగా నటించిన రవి వర్మ రోల్ స్పాన్ తక్కువైనా ఆ ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. హీరొయిన్ల కంటే ముందు చెప్పుకోవాల్సిన మేజర్ హైలైట్ ఎస్ఐ తాడి మట్టయ్యగా కోట శ్రీనివాసరావు. అతని అసిస్టెంట్ గా మల్లికార్జునరావు ఎపిసోడ్స్. సినిమాలో లీడ్ పెయిర్ తర్వాత కడుప్పుబ్బా నవ్వించేది వీళ్ళిద్దరే. వచ్చి రాని ఇంగ్లీష్ తో కోట జోకులు, వాటిని సరిచేస్తూ మల్లికార్జునరావు సెటైర్లు ఒకదాన్ని మించి ఒకటి పేలాయి. చివర్లో మిత్ర చేతిలో మల్లికార్జున్ రావు చనిపోయాక కోట అభినయానికి గుండె తడికావడం వాళ్ళు మనకు ఎంత కనెక్ట్ అయ్యారో తెలిసేలా చేస్తుంది.

గ్లామర్ గర్ల్స్ రమ్య కృష్ణ, సౌందర్య సరి జోడి అనిపిస్తే,సూపర్ హిట్ సాంగ్ కన్నెపిట్టరో, కన్నుకొట్టరోలో ఇంద్రజ, రంభ, ఆమని అందాలు స్పెషల్ బోనస్. దేవా తోడుదొంగగా బ్రహ్మానందం, ఊహ బావ సింగపూర్ మునిసిపాలిటిగా శ్రీహరి ఒక్కరని కాదు అందరు ఈ ఆహ్లాదాల పల్లకిని మోసినవాళ్ళే. సెకండ్ హాఫ్ మొత్తం చిరిగిపోయిన గుడ్డలతో, ఫ్లూటు వాయించుకుంటూ తిరిగే విలన్ గా నెపోలియన్, అతని ముసలి అసిస్టెంట్ గా రాజనాల ఒక వైపు భయపెడుతూనే మరో వైపు ఖంగారు పుట్టిస్తారు. శరత్ బాబు, గిరిబాబు, సుధా,సంగీత,ఆలి,అనంత్, బాబు మోహన్, శివాజీ రాజా మిగిలిన తారాగణం. ఎలా ఎంచుకున్నారో గాని ప్రతి పాత్రకు అతికినట్టు సరిపోయేలా ఉండటం ఈవివి టాలెంట్ కు నిదర్శనం

అందరూ అందరే

అప్పటి దాకా రాజేంద్ర ప్రసాద్ లాంటి కామెడీ స్టార్ తో బండి లాగిస్తున్న ఈవివి అప్పటికే నాగ్ తో వారసుడుతో సూపర్ సక్సెస్ కొట్టారు. ఈసారి డబుల్ రోల్ లో యువసామ్రాట్ ని డైరెక్ట్ చేస్తున్నాడని తెలియగానే ఇండస్ట్రీ జనాలకు సవాలక్ష సందేహాలు. కెరీర్ లోనే మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తూ ఇప్పుడిప్పుడే స్టార్లను డీల్ చేస్తున్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వటం రిస్క్ కదాని నాగార్జునను వార్న్ చేసిన వాళ్ళు లేకపోలేదు. కింగ్ తత్వం ఒకటే. జయాపజయాలు అలోచించి అవకాశాలు ఇవ్వడు. కాని ఆ నమ్మకాన్ని రవ్వంత కూడా వమ్ము చేయలేదు ఈవివి. రెండు పాత్రల్ని అత్యద్బుతంగా బాలన్స్ చేస్తూ హాస్యాన్ని పండించిన తీరుకి బాక్స్ ఆఫీస్ తలవంచింది. 100 రోజులు తక్కువ ఎక్కడా ఆడలేదు. శతదినోత్సవం తర్వాత వీడియో కేసెట్ వోల్గా కంపెనీ రిలీజ్ చేస్తే అప్పటి దాకా సేల్స్ లో ఉన్న పాత రికార్డ్స్ ని దుమ్ము దులిపి పారేసింది. థియేట్రికల్ రన్ లో విజయవాడ, హైదరాబాద్ లో సిల్వర్ జూబ్లీ కొట్టేసింది.

హలో బ్రదర్ లో అన్నీ ఉన్నాయి. కామెడీ, ఆరు పాటలు, నాలుగైదు ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంట్, రొమాన్స్. ఏది తగ్గించలేదు. వచ్చిన ప్రతీ ప్రేక్షకుడిని ఇంకోసారి చూడాలి అనుకునేలా చేసిన ఈవివి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతోనే ఈవివి టాలెంట్ గుర్తించిన టాప్ హీరోలు చిరంజీవి(అల్లుడా మజాకా), బాలకృష్ణ(గొప్పింటి అల్లుడు),వెంకటేష్(ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు) పిలిచి మరీ సినిమాలు చేయించుకున్నారు. ఇక రాజ్ కోటి సంగీతం గురించి సింపుల్ గా చెప్పాలంటే చాలా కష్టం. ఆరు పాటలు వేటికవే సాటి అన్నట్టు ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ మ్యుజికల్ హిట్ ఇచ్చారు.

విలన్ ఫ్లూట్ వాయించుకుంటూ తిరిగే ట్యూన్ కూడా అందరు ఇష్ట పడ్డారు అంటే ప్రతి చిన్న విషయంలోనూ ఎంత శ్రద్ధ తీసుకున్నారో అర్థమవుతుంది. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా పాటకు కాలు కదపని వాళ్ళు లేరు. ఎక్కండయ్య బండి, కన్నె పిట్టరో పాటలకు సీట్ లలో కుదురుగా కూర్చోవటం కష్టమైపోయింది. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది సంభాషణల రచయిత, ఇప్పటి సీనియర్ మోస్ట్ యాక్టర్ ఎల్.బి.శ్రీరామ్ గురించి. ఆయన రాసిన డైలాగ్స్ ఇప్పుడు చూసినా ఇంత మంచి టైమింగ్ ఉన్న రైటర్ తక్కువ సమయంలో రచనకు స్వస్తి చెప్పి నటనకు అంకితం కావడం కాస్త భాధ కలిగిస్తుంది.

టపాసుల్లా పేలే పంచ్ లతో హాల్ మొత్తం నవ్వుల జడి వాన కురిపించారు. ఆయన కలంలో ఎంత చమత్కారం ఉంటుందో చివర్లో ఇచ్చిన సాంపిల్స్ చూడండి. మీకే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి, సహనిర్మాతక కం కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి తన చాయాగ్రహణంతో గ్రాఫిక్స్ అంతగా అందుబాటులో లేని టైంలో కూడా చక్కని క్వాలిటీ తో సినిమాను రిచ్ గా చూపడంలో వందకు వంద మార్కులు కొట్టేసారు. మరో నిర్మాత డాక్టర్ కెఎల్ నారాయణ రాజీపడని మనస్తత్వం ఇందులో చూడొచ్చు. మొదటి సినిమా క్షణక్షణం కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే డ్రీం ప్రాజెక్ట్ కు ప్రొడ్యూసర్ ఈయనే.

ముగింపుకొచ్చేద్దాం

దర్శకుడికి పేరు చరిత్రలో నిలిచిపోవడమనేది అతను ఎలాంటి సినిమాలు చేసాడనేదాని మీద ఆధారపడి ఉంటుంది. కామెడీ పరంగా జంధ్యాల గారి తర్వాత ఆయన సరసన చోటు సంపాదించుకున్న ఘనత ఈవివి కే చెందుతుంది. ఆరోగ్యకరమైన హాస్యంతో స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన అంశాల్ని మర్చిపోకుండా వాటిని తెలివిగా కూర్చి అల్లిన హలో బ్రదర్ ఎన్ని సార్లు చూసిన విసుగు రాకపోవడానికి అదే కారణం. రిపీట్ ఆడియన్స్ వల్లే ఎక్కువ కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకోగలిగింది ఈ సినిమా. అందుకే అన్నది డబుల్ వినోదాల చిరునామా “హలో బ్రదర్”

ఎల్.బి.శ్రీరామ్ పెన్ పవర్ నుంచి కొన్ని ఇంకు చుక్కలు

రమ్యకృష్ణ – “ఆవతల కొంప తగలడిపోతోంది మగడా” నాగ్ – ”పర్లేదు నాది అద్దె కొంపే “

నాగ్ – “పాలేంటి ఇంత చేదుగా ఉన్నాయి, ఏం కలిపారు ఇందులో” సౌందర్య – ”పాలవాడు నీళ్ళు కలిపాడు,మేము చక్కర కలిపాం,అంతే”

స్టేషన్ కు వచ్చాక జైలర్ తో సెల్ దగ్గర నాగ్ – “ఏంటి బాబాయి గోడకి సున్నం లేదు,సీలింగ్ కి ఫ్యాను లేదు, జైలు కొచ్చే మాలాంటి రెగ్యులర్ కస్టమర్స్ కే ఇలాంటి రూమ్ ఇస్తే ఇంక కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి”

బ్రహ్మానందం విలన్ గ్యాంగ్ తో – “ఏవండి రాజనాల గారు, మీరు బాగా సీనియర్ మోస్ట్ విలనీ కదండీ ఒకటడుగుతా సెప్పండి , వీడు నిన్న గాక మొన్న వచ్చిన బచ్చా విలన్. వీడికే ఇన్ని తెలివితేటలు ఉంటె మా యువ సామ్రాట్ కు ఎన్ని ఉంటాయండి.ఆలోచించండి”

మార్వాడి సేటు – “రాం రాం ఆయియే” నాగ్, బ్రమ్మీలు – ”లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై”

నాగ్ – “కాశి…ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి” బ్రహ్మానందం – ”కర్తవ్యం అంటే విజయశాంతి ని అడిగి తెలుసుకోవాలి భయ్యా”

ఇలాంటి చమక్కులు ఎన్నెన్నో ……. పేజీలు సరిపోవండి బాబు… ఈ సారికి క్షమించి సినిమా చూసెయ్యండి…

Show comments