గుండెపోటు మరణాలు ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి. సడన్, సైలెంట్ హార్ట్ ఎటాక్స్‌తో వృద్ధులే కాదు.. మధ్య వయస్కులు, యువకులు కూడా చనిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఫుల్ ఫిట్‌గా ఉండేవాళ్లు కూడా గుండెనొప్పుల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలా హార్ట్ ఎటాక్ వల్ల మరణించిన వారిలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందులో ఒకరు కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అప్పు మరణాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పటికే పునీత్ రాజ్‌కుమార్ పేరు మీద కర్ణాటక రత్న పురస్కారం ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మరో మంచి నిర్ణయం తీసుకుంది. పునీత్ కుటుంబం సాయంతో ఆయన పేరు మీద కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకురానుంది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు రావు తెలిపారు. హఠాత్తుగా వచ్చే గుండెపోటుతో సంభవించే మరణాలను అరికట్టడమే ఈ స్కీమ్ ఉద్దేశమని ఆయన అన్నారు. దీనికి అప్పు యోజన అనే పేరును పెట్టినట్లు చెప్పారు. ఈ స్కీమ్ కోసం పునీత్ ఫ్యామిలీ అందించిన నిధులతో పాటు బడ్జెట్లోనూ కొంత మొత్తాన్ని కేటాయించామన్నారు.
సర్కారు ఆస్పత్రులతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ఎయిర్‌పోర్ట్స్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ల (ఏఈడీ)ను అందుబాటులో ఉంచుతామని మంత్రి దినేష్ తెలిపారు. ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే ఆ పరికరం సాయంతో వారికి ప్రథమ చికిత్స చేయొచ్చని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత గంటలోపు వారిని ఆస్పత్రికి తరలిస్తే ప్రాణనష్టాన్ని ఆపొచ్చునని మంత్రి పేర్కొన్నారు. అప్పు యోజనలో భాగంగా ఏఈడీల ఏర్పాటు కోసం రెండు వారాల్లోగా టెండర్లను ఆహ్వానించనున్నట్లు దినేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలి దశను జయదేవ ఆస్పత్రిలో మొదలుపెట్టనున్నట్లు వివరించారు.
కాగా, గుండెపోటు ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువగా సంభవిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తొలి గంట (గోల్డెన్ అవర్)లోనే ప్రాథమిక చికిత్స అందించాలని నిర్ణయించింది. దీని కోసం చెన్నైకి చెందిన స్టెమీ ఇండియా అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే సకాలంలో ఆస్పత్రిలో చేర్చి, ఇంజక్షన్ ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం, ఈసీజీ లాంటి పరీక్షల ద్వారా రోగి పరిస్థితిని అంచనావేసి, అవసరమైన శస్త్ర చికిత్స చేయడం ఇందులో భాగంగా చెప్పొచ్చు. ఇప్పుడు కర్ణాటక కూడా ఏపీ దారిలోనే గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుండటం మంచి విషయమని చెప్పాలి.