గతకొంత కాలంగా సినీ పరిశ్రమని తీవ్ర విషాదాలు వెంటాడుతున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన నటీ, నటులు, టెక్నిషియన్స్ పలు కారణాలతో మరణించడం బాధాకరం. టాలీవుడ్ తో పాటుగా తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది నటులు ఇటీవలే మరణించారు. ఇక కొన్ని రోజుల క్రితమే స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన మరణం మరువముందే.. ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత మరణించారన్న వార్త ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది.
కన్నడ స్టార్ ప్రొడ్యూసర్, పంపిణీ దారుడు కేసీఎన్ మోహన్(61) ఆదివారం నాడు బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడ సినిమా పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కీర్తి గడించారు మోహన్. అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడం ద్వారా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మోహన్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా.. ఏడాది క్రితమే మోహన్ సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మృతి చెందారు. ఆ దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే మోహన్ కుటుంబం కోలుకొంటోంది. ఇంతలోనే మోహన్ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.