iDreamPost
android-app
ios-app

Prashanth Neel: ఉగ్రం కథతోనే సలార్ ఎందుకు తీశాడు? బయటకి తెలియని నిజాలు!

సలార్‌ సినిమా విడుదలకు ముందే.. అది ఉగ్రం రీమేక్(రీ టెల్‌) అని ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశాడు. ఎందుకు ఉగ్రాన్ని మళ్లీ తీస్తున్నాడో కూడా వివరించి చెప్పాడు.

సలార్‌ సినిమా విడుదలకు ముందే.. అది ఉగ్రం రీమేక్(రీ టెల్‌) అని ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశాడు. ఎందుకు ఉగ్రాన్ని మళ్లీ తీస్తున్నాడో కూడా వివరించి చెప్పాడు.

Prashanth Neel: ఉగ్రం కథతోనే సలార్ ఎందుకు తీశాడు? బయటకి తెలియని నిజాలు!

ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఈ ఒక్క పేరు వింటే.. సినీ ప్రేక్షకుల నరాలు హైటెన్షన్ వైర్లు అయిపోతున్నాయి. ఈ ఒక్క పేరు వింటే ఫ్యాన్స్ పూనకాలతో రెచ్చిపోతున్నారు. ఈ ఒక్క మాట వింటే.. బాక్సాఫీస్ లెక్కలు చెల్లాచెదురు అయిపోతున్నాయి. సినిమా మాధ్యమానికి ఎలివేషన్ అనే మత్తు ఎక్కించి, మాస్ అనే పదాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లిపోయాడు నీల్. తాజాగా.. బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ సృష్టించిన సలార్ జాతర జరుగుతోంది. అక్కడ కాటేరమ్మ కొడుకు..ఒక్కో రికార్డ్ ని ఊచకోత కోసుకుంటూ పోతున్నాడు.

మన డైనోసార్ అన్నీ సినీ ఇండస్ట్రీల పై పడి దుమ్ము దులిపేస్తున్నాడు. ఇంతటి విజయానికి కారణం ప్రశాంత్ నీల్. కానీ.., ఇలాంటి సమయంలో కూడా ఈ పాన్ ఇండియా డైరెక్టర్ పై ఓ విమర్శ. ప్రశాంత్ నీల్ తన మొదటి చిత్రమైన ఉగ్రం సినిమానే మళ్ళీ సలార్ గా తీశాడని కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిజమే సలార్ లోని చాలా కథ ఉగ్రందే. ఇందులో దాపరికం ఏమి లేదు. నిజానికి సినిమా విడుదలకి ముందే ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు కూడా.

కానీ.., సలార్ విషయంలో కొందరిది ఇంకా అదే విమర్శ. ఇది ఉగ్రం కథ అంటూ తలలు బాదేసుకుంటున్నారు. నిజానికి ఉగ్రం సినిమా వెనుక.. ప్రశాంత్ నీల్ కి ఎన్నో బాధలు, కష్టాలు, నిద్రలేని రాత్రులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఉగ్రం కథను సినిమాగా చూడటం కోసం ప్రశాంత్‌ కష్టాలు పడ్డాడు.. కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఉన్న ఆస్తులంతా అమ్మి రోడ్డున పడే పరిస్థితికి వచ్చాడు. ఇంత నష్టం జరిగినా కూడా.. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ కావాలనే ఉగ్రం కథని ఎందుకు రీటెల్ చేశాడు?

తనని కట్టు బట్టలతో రోడ్డున పడేసిన ఉగ్రం మూవీ అంటే నీల్ కి ఎందుకు ఇంతటి ఇష్టం? తన జీవితాన్ని నరకప్రాయం చేసిన ఉగ్రం కథని మొత్తం ప్రపంచానికి చూపించాలన్న తపన దేనికి? అసలు ప్రశాంత్ నీల్ జీవితాన్ని ఉగ్రం సినిమా ఎన్ని మలుపులు తిప్పింది? ఇలాంటి అన్నీ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఆలోచన! ఓ చిన్న ఆలోచన చాలు.. కొన్ని సామ్రాజ్యాలు కూలిపోవడానికి! ఆ చిన్న ఆలోచనే చాలు ప్రపంచం మొత్తం నివ్వెరపోయే పని చేయడానికి. 2008లో ప్రశాంత్ నీల్ కి కూడా ఇలాంటి ఓ ఆలోచన వచ్చింది. అతను డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. 2001లో ప్రశాంత్‌ నీల్‌ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత 7 ఏళ్ల పాటు హార్స్‌ రేస్‌ కోర్సులో మునిగితేలాడు. ఓ మోస్తరుగా సెటిలైన కుటుంబం. డబ్బు గురించి లెక్క లేదు. జీవితంపై భయం లేదు.

తన తోటి వారంతా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో సెటిల్ అవుతుంటే ప్రశాంత్ మాత్రం అందరి దృష్టిలో 7 ఏళ్ళు ఖాళీగా ఉండిపోయాడు. అలాంటి స్థితిలోనే కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా సినిమాల్లోకి రావాలని డిసైడ్‌ అయ్యాడు. తన బావ కన్నడ హీరో అయిన శ్రీమురళికి ఈ విషయం చెప్పాడు నీల్. శ్రీమురళి ప్రోత్సాహంతోనే.. ‘‘ సెవంతి సెవంతి’ అనే కన్నడ సినిమా కోసం అసిస్టెంట్‌గా పనిలో చేరాడు నీల్. మూడు రోజులు షూట్ కి వెళ్లి, పని నచ్చక ఆగిపోయాడు. అక్కడ ప్రశాంత్ నీల్ కి నచ్చనది షూటింగ్ మాత్రమే గాని, సినిమా కాదు! తరువాత ఓ మిత్రుడ్ని తోడు చేసుకుని బెంగళూరులోని గాంధీ నగర్‌లో ఓ రూము తీసుకున్నాడు.

రూములో కూర్చుని లవ్‌స్టోరీ రాయటం మొదలుపెట్టాడు. వరుస ప్లాపులతో ఉన్న శ్రీమురళికి నిర్మాతలకు గొడవైంది. ప్రశాంత్‌ నీల్‌ శ్రీమురళి ఆఫీస్‌కు వెళ్లారు. ఆయన తన కుర్చీలో కోపంగా కూర్చుని ఉన్నారు. ఉగ్ర రూపంతో ఉన్న శ్రీమురళిని చూడగానే.. ప్రశాంత్‌ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఈయనకు లవ్‌ స్టోరీ సెట్‌ కాదు.. సీరియస్‌ స్టోరీ అయితేనే సెట్‌ అవుతుంది అనుకున్నాడు. శ్రీమురళి కోసం ఓ కొత్త కథ రాయటం మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్. దాదాపు 6 నెలలు కష్టపడి కథను పూర్తి చేశాడు.

Prashanth neel about why he based ugram story to salaar

తర్వాత శ్రీమురళిని సినిమా చేయడానికి ఒప్పించాడు. ఇక్కడ ప్రశాంత్ నీల్ లెక్క ఓ మంచి సినిమా చేయడం మాత్రమే కాదు.. మొత్తం కన్నడ ఇండస్ట్రీకి పేరు వచ్చే అంత మంచి సినిమా తీయడం. ఓ తొలి చిత్రం చేస్తున్న దర్శకుడు కనీసం ఊహించడానికి కూడా సాధ్యపడని ఆలోచన అది. కానీ.., ప్రశాంత్ నీల్ ఎంత తెలివైనోడో అంతే మొండోడు. తాను ఓ గొప్ప సినిమా చేస్తున్నా అనే నమ్మకంతోనే ఉగ్రం షూటింగ్ మొదలు పెట్టాడు. ఇందుకోసం అప్పు చేసి మరీ సినిమా నిర్మాణంలోకి దిగాడు.

దేశ వ్యాప్తంగా పేరున్న సినిమా టెక్నీషియన్లను తన టీంలో చేర్చుకున్నాడు. మిగిలిన వారంతా కొత్త వారే. పెద్ద చిత్రాలకు వాడే కెమెరాలను సైతం రంగంలోకి దించాడు. అయితే.., అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి.. ఉగ్రం షూటింగ్‌ పూర్తయి ఉంటే.. ప్రశాంత్‌ను ప్రపంచం గుర్తించే పరిస్థితి వచ్చేది కాదేమో.. ప్రపంచానికి ఆయన్ని పరిచయం చేయడానికి.. ప్రపంచం ఆయనకు పరిచయం కావటానికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. సినిమా కోసం  తెచ్చిన డబ్బులు మధ్యలోనే అయిపోయాయి.

చుట్టూ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్లు చెన్నై నుంచి వస్తున్న సమయంలో సినిమా టీం యాక్సిడెంట్‌కు గురైంది. దీని కారణంగా కూడా ఉగ్రం ఖర్చు మరింత పెరిగిపోయింది. షూటింగ్‌ కి లాంగ్‌ గ్యాప్‌ వచ్చి పడింది. ఉగ్రం సినిమా టీంకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఒక్కొక్కరిగా టెక్నీషియన్లు, ఇతర ముఖ్య సిబ్బంది బయటకు పోతూ ఉన్నారు. సినిమా నిరాటంకంగా సాగాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం ఈ సారి తన ఇంటిని అమ్మేశాడు ప్రశాంత్ నీల్. అక్కడ నుండి అంతగా సినిమా అనుభవం లేని వాళ్లతో పని చేయించుకున్నాడు. ఉగ్రం షూటింగ్‌ పూర్తయింది.

Prashanth neel about why he based ugram story to salaar

 

ఎడిటింగ్‌ కూడా పూర్తయింది. ప్రశాంత్‌ నీల్‌ మొత్తం సినిమా చూశాడు. ఆయనకు సెకండ్‌ హాఫ్‌ నచ్చలేదు. తాను అనుకున్న దానికి.. తెరపై చూస్తున్న దానికి పొంతన కుదరలేదు. ప్రశాంత్‌ కన్విన్స్‌ కాలేకపోయాడు. సెకండ్‌ హాఫ్‌ మొత్తం రీషూట్‌ చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇదే విషయాన్ని శ్రీమురళికి చెప్పాడు. రీ షూట్‌ చేయడానికి డబ్బులు కూడా లేని స్థితి. ఈసారి ఇంకాస్త అప్పు. ఆ డబ్బుతో ఓ చిన్న టీంను తయారు చేసి సెకండ్‌ హాఫ్‌ మళ్ళీ పూర్తి చేశాడు నీల్. సినిమా ప్రశాంత్‌ అనుకున్నట్లుగా రావటానికి 4 సంవత్సరాలు పట్టింది. ఏకంగా నాలుగు కోట్ల అప్పు మిగిలింది. ఈ నాలుగు సంవత్సరాలు ప్రశాంత్‌ కుటుంబం పది అద్దె ఇళ్లు మారి, ప్రశాంత్‌ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ వచ్చింది.

డిస్ట్రిబ్యూషన్‌లోనూ తప్పని కష్టాలు

ఉగ్రం సినిమా షూటింగ్‌ 2012లోనే పూర్తయింది. విడుదల అవ్వటానికి అన్ని రకాలుగా సిద్ధమైంది. కానీ, ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లటానికి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌ కూడా ముందుకు రాలేదు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. ప్రశాంత్‌ నీల్‌, శ్రీమురళి డిస్ట్రిబ్యూటర్ల కోసం చూస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్‌ కూడా సరిగా స్పందించటం లేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్టార్‌ హీరో దర్శన్‌ రంగంలోకి దిగాడు.

శ్రీమురళికి, దర్శన్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. శ్రీమురళి ‘ఉగ్రం’ సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు దొరకక ఇబ్బందిపడుతున్నాడని దర్శన్‌కు తెలిసింది. వెంటనే శ్రీమురళికి ఫోన్‌ చేసి విషయం కనుక్కున్నాడు. తన డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ‘ తుగదీప డిస్ట్రిబ్యూషన్స్‌’ నుంచి సినిమాను విడుదల చేస్తానని హామీ ఇచ్చాడు. మాట ఇచ్చినట్లుగానే ఉగ్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. భారత చిత్ర పరిశ్రమ అంతగా గుర్తించని శాండల్‌వుడ్‌లో 2014, ఫిబ్రవరి 21 ఓ చిన్న సినిమా రిలీజ్‌ అయింది.

Prashanth neel about why he based ugram story to salaar

ఆ సినిమానే ‘ ఉగ్రం’. మొదటి షో టాక్‌ కోసం ప్రశాంత్‌ నీల్‌ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఓ వైపు తన సినిమా హిట్‌ అవుతుందని అతడికి గట్టి నమ్మకం ఉన్నా.. ఏదో తెలియని భయం. 2 గంటల 11 నిమిషాల మూవీ ముగిసింది. ప్రేక్షకుల ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఎవర్ని కదిలించినా.. బొమ్మ బ్లాక్‌ బాస్టర్‌ అన్న టాక్‌ తప్ప వేరే మాట వారి నోటి నుంచి రాలేదు.

మొదటి రోజు సినిమా చూసిన దర్శన్‌, యశ్‌ లాంటి హీరోలు కూడా ఉగ్రం అద్బుతంగా ఉందని ‍ప్రశంసించారు. తన నెలల కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు ప్రశాంత్‌ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది. కన్నడ నాట పలు థియేటర్లలో 125 రోజులకుపైగా దిగ్విజయంగా నడిచింది. మంచి వసూళ్లను సాధించింది. అంతేకాదు.. ఉగ్రం సృష్టించిన సంచలనాలతో కన్నడ ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్‌ నీల్‌ వైపు తిరిగి చూసింది. ‘వీడు ఇండస్ట్రీనీ ఏలుతాడు’ అని అనుకున్న వాళ్లు లేకపోలేదు.

ఇలా ఉగ్రం సినిమా సూపర్‌ హిట్‌ అయింది. అయినా ప్రశాంత్‌కు ఎలాంటి లాభం లేకపోయింది. అప్పులు అప్పులుగానే మిగిలిపోయాయి. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు ‘ఉగ్రం’ ఆర్థికంగా సక్సెస్‌ కాకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమాకు సరైన పబ్లిసిటీ లేదు. ఆ సమయంలో మురళీ హీరోగా మార్కెట్‌లో లేడు. పైగా.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్ కొత్త వ్యక్తి. దానికి తోడు పైరసీ బూతం ప్రశాంత్‌ను తల్లకిందుకు చేసింది. ఉగ్రం చూసిన వాళ్లలో ఎక్కువ మంది పైరసీలో చూసిన వాళ్లు కావటం గమనార్హం.

Prashanth neel about why he based ugram story to salaar

పైగా.. మంచిగానే కలెక్షన్స్ వచ్చినా.. సినిమా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. దీనికి తోడు.. శాటిలైట్‌ విషయంలో కూడా ఇబ్బందే ఎదురైంది. ఎవ్వరూ కూడా ఉగ్రం శాటిలైట్‌ రైట్స్‌ తీసుకోవడానికి ముందుకు రాలేదు. దాదాపు సంవత్సరం తర్వాత ఎవరో తక్కువ ధరకు సినిమాను కొన్నారు. సాధారణంగా ఎవరైనా తమ సినిమా హిట్‌ అయితే, గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు. కానీ, ప్రశాంత్‌ నీల్‌ విషయంలో ఇప్పుడు అలా జరగలేదు. కోట్లలో అప్పు. రోజులు గడిచే కొద్దీ అతడిలో మదన మొదలైంది.

తన ఊహలకు సరైన న్యాయం జరగలేదన్న బాధ మొదలైంది. ఉగ్రం కథ సినిమాగా తెరకెక్కింది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. వాళ్లను మెప్పించింది. కానీ, తాను ఊహించుకున్న పరిధి ఇది కాదు. తనకి రావాల్సిన లాభాలు ఇవి కాదు.. ‘‘ నా కథ కేవలం కన్నడ నాటకు మాత్రమే పరిమితం కాకూడదు.. ప్రపంచం మొత్తానికి చేరాలి అని ప్రశాంత్ నీల్ ఆనాడే డిసైడ్ అయ్యాడు. ఇదే ప్రశాంత్‌ను పురుగులా తొలుస్తూ వచ్చింది. ఉగ్రం ప్రశాంత్‌ నీల్‌కు చాలా విషయాలు నేర్పింది.

అది సినిమా గురించి మాత్రమే కాదు.. జీవితం గురించి కూడా.. తన పిచ్చి కోసం కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చానన్న బాధ ఆయన్ని వెంటాడింది. అందుకే.. తన ప్రాధాన్యతలను మార్చుకున్నాడు. సినిమా కోసం కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేయొద్దని నిశ్చయించుకున్నాడు. ఏం చేసైనా సరే కుటుంబాన్ని సంతోష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ నుండే తన ప్రయారిటీ మార్చుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీని ఉద్దరించాలి, పరిశ్రమ పరిధి పెంచాలి ఇలాంటి ఆలోచనలను వదిలేశాడు.

Prashanth neel about why he based ugram story to salaar

డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. తన కథలు కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితం కాకూడదని పాన్ ఇండియా బాట పట్టాడు. బంగారం లాంటి ఈ ఆలోచనకి బలం చేకూర్చేలా.. బంగారం గనుల బ్యాక్ డ్రాప్ తో కేజియఫ్ కథ సిద్ధం చేసుకున్నాడు. సరిగ్గా.. ఆ సమయంలోనే అగ్నికి వాయువు తోడైనట్టు ప్రశాంత్ నీల్ కి “హోంబలే ఫిల్మ్స్” సపోర్ట్ దొరికింది. అక్కడ నుండి కేజియఫ్ -1, కేజియఫ్ -2 తో ప్రశాంత్ నీల్ సంచలనాలకి కేంద్ర బిందువు అయ్యాడు. తన సినిమాకి వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడం మొదలైంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వచ్చి పడింది నీల్ కి.

ప్రశాంత్ నీల్ కి ఇలాంటి సమయంలో మళ్ళీ తన ఉగ్రం కథ గుర్తుకి వచ్చింది. ఉగ్రం కోసం తాను ఏమి కోల్పోయాడో గుర్తుకి వచ్చింది. నిజానికి ఉగ్రం కథలో ఉన్న దమ్ము ఇంకా గుర్తు ఉండిపోయింది. ఉగ్రం చుట్టూ ఉండిపోయిన ఆ బ్యాడ్ నెంబర్స్ అన్నీ మార్చేయాలని అనుకున్నాడు నీల్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ స్కిల్ పెరిగింది. శక్తి పెరిగింది. మార్కెట్ పెరిగింది. అన్నిటికి మించి ప్రభాస్ కటౌట్ దొరికింది. ఇందుకే ఉగ్రం కథని మళ్ళీ తెరకెక్కించాలని, ఈసారి కాసుల వర్షం కురిపించాలని నిర్ణయించుకున్నాడు.

Prashanth neel about why he based ugram story to salaar

ఆ ఉగ్రం కథకి “ఖాన్సార్” అనే ఓ ఫిక్షనల్ వరల్డ్ యాడ్ చేసి.. సలార్ గా మార్చేశాడు. ఇందుకోసం కావాల్సిన అన్నీ మార్పులు చేసుకున్నాడు. ఫైనల్ గా సలార్ సూపర్ సక్సెస్. అండర్ ప్లేలో ఉండే ఉగ్రం కథ ఇంకా హిట్. ఇప్పుడు ప్రశాంత్ ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలుచుకున్నాడు. అక్కడే సాధించాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా ఒడిసి పట్టుకున్నాడు. చివరగా సినిమా విడుదలకి ముందు ఒక్కసారి ప్రశాంత్ నీల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుందాం.

‘‘ఉగ్రం కథ ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరాలని నేను అనుకున్నాను. 2014లో సినిమా థియేటర్లలో రిలీజైంది. కానీ, నా కల నెరవేరలేదు. ఆ కథకు న్యాయం చేయకుండా ముందుకు వెళ్లాలని నాకు అనిపించలేదు.నా బుర్రలో వేరే కథలు ఉన్నా ఉగ్రం కథకు న్యాయం చేయాలని అనిపించింది. ఉగ్రం కథకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. కేజియఫ్ సినిమా అంత ఎత్తుకు ఉగ్రం వెళ్లాలని భావించాను. నేను సలార్‌ను ఉగ్రం రీమేక్‌గా చూడ్డం లేదు. ప్రభాస్‌కు తగ్గట్టుగా చాలా మార్పులు చేశాను. ’’ సలార్‌ సినిమా విడుదలకు ముందు ప్రశాంత్‌ నీల్‌ ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలివే. ఇప్పుడు వాటిని ఇప్పుడు నిజం చేసి చూపించాడు నీల్. మరి, ప్రశాంత్‌ నీల్‌ ఉగ్రం సినిమాను సలార్‌గా మళ్లీ తీయటం వెనుక ఉన్న కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.