సెలబ్రిటీలను ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఏ రేంజ్లో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి జీవితం పూలపాన్పు లాంటిదని అందరూ అనుకుంటారు. కార్లు, విమానాల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటూ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తారని భావిస్తారు. అయితే ఇందులో కొంతమేర నిజం ఉంది. బాగా పేరున్న స్టార్స్, పెద్ద సెలబ్రిటీలు ఇలాంటి జీవితాన్ని గడుపుతారు. కానీ వారికి కూడా బాధలు ఉంటాయి. అందరి జీవితాల్లాగే సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యం అనేది పేద, ధనిక, సెలబ్రిటీనా కాదా అనేది చూడదు.
అనారోగ్యం వల్ల తాను నరకం చూశానని అంటున్నారు నటి ప్రియాంక కామత్. తెరపై అందర్నీ నవ్వించిన ఆమె.. తన నిజజీవితంలో కన్నీటి బాధను అనుభవించారు. చక్కటి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించే ప్రియాంక అనారోగ్యం వల్ల పడిన బాధ అంతా ఇంతా కాదు. ‘మజ్జా భరత’, ‘గిచ్చి గిలి గిలీ’ లాంటి షోలతో శాండల్‌వుడ్‌లో బాగా ఫేమస్ అయ్యారు ప్రియాంక కామత్. సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించిన ప్రియాంక.. గతేడాది ప్రియుడు అమిత్ నాయక్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వెన్నెముకకు సంబంధించిన సమస్యలతో దాదాపు నడవలేని స్థితికి చేరుకున్నారు.
సుమారు ఏడెనిమిది నెలలు ప్రియాంక కామత్ బెడ్‌కే పరిమితం అయ్యారు. ఆ తర్వాత క్రమంగా ఆమె అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ కష్ట కాలంలో తన భర్త అండగా నిలిచి తనకు పునర్జన్మ ఇచ్చారని చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. వెన్నెముక సర్జరీ తర్వాత మరో రెండు ఆపరేషన్లు తనకు జరిగాయని చెప్పారామె. ‘నా శరీరానికి దాదాపు 70 శాతం ఇన్ఫెక్షన్ సోకింది. నేను బతికే ఛాన్స్ 50 శాతమే ఉందని డాక్టర్స్ అన్నారు. ఎందుకంటే నా బాడీలో స్క్రూలు, రాడ్లు అమర్చారు. దీంతో నన్ను విడిచిపెట్టి మరొకర్ని పెళ్లి చేసుకోమని అమిత్‌కు చెప్పా. కానీ తను నాకు అండగా నిలిచారు. నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు కూడా తనే మార్చారు’ అని ప్రియాంక కామత్ చెప్పుకొచ్చారు.