Tirupathi Rao
Tirupathi Rao
కోలీవుడ్ నటి సింధు ఇటీవల ధీనస్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె రోడ్డు పక్కన దిక్కుతోచని స్థితిలో మృతిచెందింది. ఆ విషయం తెలుసుకుని ప్రేక్షకులు ఎంతో బాధ పడ్డారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ.. చికిత్స కోసం డబ్బులేక చివరికి ప్రాణాలు కోల్పోయింది. అయితే సింధు మరణించిన తర్వాత ఆమె మిత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. ఏ ఒక్కరు ఆమెకు సహాయం చేసినా ఈ రోజు బతికి ఉండేదని చెప్పుకొచ్చారు.
సింధు భర్త చనిపోయిన తర్వాత కుటుంబం మొత్తం కష్టాల్లో కూరుకుపోయింది. ఆమె 2020లో మీడియాతో మాట్లాడిన మాటలను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించి అప్పుడే ఆమె ధీనంగా వేడుకుంది. తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని.. చికిత్స చేస్తే కోలుకునే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలియజేసింది. తన భర్త చనిపోయి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని వెల్లడించింది. ఇప్పుడు తను కూడా చనిపోతే తన కుమార్తె అనాథ అవుతుందని సింధు ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ఎవరైనా సాయం చేస్తే తన ఆరోగ్యం బాగుపడుతుందని వేడుకుంది.
కానీ, సింధుకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆమె మిత్రులు చెబుతున్నారు. సింధు గురించి నటి షకీల కీలక వ్యాఖ్యలు చేశారు. “సింధు ఎంతో మంచిది. అలాంటి మనిషి ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. కరోనా సమయంలో ఎంతోమంది రోడ్డున పడ్డారు. అలాంటి వారి కడుపు నింపేందుకు సింధు చొరవ తీసుకుని ఎంతో సహాయం చేసింది. దాతల ద్వారా సేకరించిన వాటితో ఎంతో మందికి సహాయం అందించింది” అంటూ షకీల చెప్పుకొచ్చింది. ఇప్పుడు సింధు మిత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా ఎవరూ సింధుకు సహాయం చేయలేదని తెలియజేశారు. రజినీకాంత్, విజయ్, అజిత్ వంటి వారిలో ఏ ఒక్క హీరో ముందుకొచ్చినా ఈరోజు సింధు ప్రాణాలతో ఉండేదని వాపోయారు.
అజిత్ ని సాయం కోరేందుకు సింధు చాలా ప్రయత్నాలు చేసిందని చెబుతున్నారు. అజిత్ పీఏకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని చెప్పారు. అయితే ఆమె నేరుగా అజిత్ ని కిలిసేందుకు వెళ్లిందని చెప్పారు. అజిత్ వద్ద సాధారణమైన ఫోన్ ఉంటుందని.. అతనికి రిపోర్ట్స్ పంపడం కుదరదని చెప్పారట. అయితే ఫోన్లో కూడా మాట్లాడించలేదని చెప్పారు. అసలు ఈ విషయం అజిత్ కు తెలుసో లేదో కూడా తెలియంటున్నారు. ఇండస్ట్రీ నుంచి చిన్న నటుడు కార్తిక్ మాత్రం రూ.20 వేలు సహాయం చేసినట్లు చెప్పారు. గతంలో సింధు వేసిన ప్రశ్న ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదు? అంటూ సింధు గతంలో వేసిన ప్రశ్న ఆమె మరణించిన తర్వాత బాగా వినిపిస్తోంది. సింధు ఎలాంటి పరిస్థితిలో చనిపోయిందో తెలుసుకుని ప్రేక్షకులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.