Microlino Electric Car: బైక్ కంటే బుల్లి కారు.. ఇరుకు సందుల్లోనూ ఈజీగా నడపచ్చు! ధర ఎంతంటే?

బైక్ కంటే బుల్లి కారు.. ఇరుకు సందుల్లోనూ ఈజీగా నడపచ్చు! ధర ఎంతంటే?

Microlino Electric Car: ఆ మధ్య బైక్ ధరలో బైక్ సైజులో యకుజా ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బైకు సైజులోనే వింగ్స్ ఈవీ రాబిన్ కారు ఒకటి వచ్చింది. ఈ రెండు కార్ల గురించి మీరు తెలుసుకునే ఉంటారు. అయితే ఇప్పుడు వీటి కంటే బుల్లి కారు గురించి తెలుసుకోబోతున్నారు. ఇది బైక్ కంటే చిన్నగా ఉంది.

Microlino Electric Car: ఆ మధ్య బైక్ ధరలో బైక్ సైజులో యకుజా ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బైకు సైజులోనే వింగ్స్ ఈవీ రాబిన్ కారు ఒకటి వచ్చింది. ఈ రెండు కార్ల గురించి మీరు తెలుసుకునే ఉంటారు. అయితే ఇప్పుడు వీటి కంటే బుల్లి కారు గురించి తెలుసుకోబోతున్నారు. ఇది బైక్ కంటే చిన్నగా ఉంది.

ఎలక్ట్రిక్ కార్లు కొనడానికే కాదు చూడ్డానికి కూడా హాయిగా ఉంటుంది. టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ వాడే వస్తువుల సైజు తగ్గిపోతుంది. ఒకప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు వంటివి పెద్ద పెద్దగా ఉండేవి. రాను రాను చిన్న సైజులోకి వచ్చేసాయి. ఇప్పుడు కార్లు కూడా చిన్న సైజులోకి వచ్చేస్తున్నాయి. పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యల కారణంగా బుల్లి కార్లను తయారు చేస్తున్నాయి పలు కంపెనీలు. ఈ క్రమంలో ఓ ప్రముఖ కంపెనీ ఒక బుల్లికారుని తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ మీరు చూసిన కార్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ కారు మరొక ఎత్తు. చాలా చిన్న సైజులో ఉన్న ఈ కారు ఫీచర్స్ తెలిస్తే నిజంగా మతి పోవాల్సిందే. ఇద్దరు కూర్చుని ప్రశాంతంగా జర్నీ చేయవచ్చు. మూడు బీర్ కేసులు పట్టేంత స్పేస్ ఈ కారులో ఇచ్చారు. దీన్ని స్మార్ట్ ఫోన్ ని ఛార్జ్ చేసుకున్నంత ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. కారు పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. దీన్ని ఎక్కడైనా చాలా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు.  కార్లు సైతం దూరలేని ఇరుకు సందుల్లో ఈ కారు దూరిపోతుంది. బైక్ కంటే చిన్న సైజులో ఉంటుంది.

ఇది సన్ రూఫ్ తో వస్తుంది. కారు చిన్నదే అని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇందులో 2 సీట్లు ఉన్నాయి. రెండు డోర్లు ఉన్నాయి. ముందు ఒకటి, వెనుక ఒకటి. ముందు ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చునేంత స్పేస్ ఉంది. వెనుక 230 లీటర్ల ట్రంక్ స్పేస్ ఉంది. షాపింగ్ బ్యాగ్స్, ఒక పెద్ద సూట్ కేసు, 2 హ్యాండ్ లగేజ్ లు, 3 బీర్ కేసులు పెట్టుకోవచ్చు. ఇక దీని రేంజ్ విషయానికొస్తే.. మూడు వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ ఫుల్ ఛార్జ్ తో 228 కి.మీ. ప్రయాణిస్తుంది. మిడ్ వేరియంట్ 177 కి.మీ. రేంజ్ ఇస్తుంది. బేస్ వేరియంట్ 93 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఇక టాప్ స్పీడ్ విషయానికొస్తే.. బేస్ వేరియంట్ గంటకు 45 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుండగా.. మిగతా రెండు వేరియంట్లు గంటకు 90 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ఈ కారు 5 సెకన్లలో 50 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని కెర్బ్ వెయిట్ వచ్చేసి 496 కిలోలు. దీని పవర్ వచ్చేసి 12.4 కిలోవాట్ గా ఉంది.

బ్యాటరీ విషయానికొస్తే టాప్ వేరియంట్ లో 15 కిలో వాట్, మిడ్ వేరియంట్ లో 10.5 కిలోవాట్, బేస్ వేరియంట్ లో 5.5 కిలోవాట్ బ్యాటరీలు ఇచ్చారు. 5.5 కిలోవాట్ బ్యాటరీ 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 2 గంటలు, 10.5 కిలోవాట్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 4 గంటలు, 15 కిలోవాట్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 5.5 గంటల సమయం పడుతుంది. ఇది 9 రంగుల్లో లభిస్తుంది. మైక్రో మొబిలిటీ సిస్టమ్స్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇటలీలో ఉంది ఈ కంపెనీ. ఇతర దేశాల్లో కూడా లాంఛ్ చేసే ఆలోచనలో ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బేస్ వేరియంట్ రూ. 8.10 లక్షలు, మిడ్ వేరియంట్ రూ. 9 లక్షలు, టాప్ వేరియంట్ రూ. 9.80 లక్షలు ఉంటుందని అంచనా. అయితే అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 19,500 యూఎస్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 16 లక్షలు పైనే. మరి ఇది భారత్ లో లాంఛ్ అయితే దీని క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి. 

Show comments