ఇంకో రెండు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ 2023 సంక్రాంతి ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతోంది. నువ్వా నేనా అనే రీతిలో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు పందేనికి రెడీ కావడం ట్రేడ్ తో పాటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. జనవరి 12ని ముందుగా ‘ఆది పురుష్’ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ టీమ్ దాని మీద వర్క్ చేస్తోంది. ఏది ఏమైనా వాయిదా ప్రసక్తే లేదని దర్శకుడు ఓం రౌత్ తేల్చి చెబుతున్నారు. 13న చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ రావడం లాంఛనమే. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చేసి థియేటర్ల అగ్రిమెంట్లు కూడా మొదలుపెట్టారని ఇన్ సైడ్ టాక్.
దర్శకుడు బాబీ డబ్బింగ్ తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా కానిస్తున్నారు. బ్యాలన్స్ ఉన్న టాకీ పార్ట్, పాటలు డిసెంబర్ మొదటి వారానికి ఫినిష్ చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం టైటిల్ రివీల్ రేపు కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా జరగనుంది. ‘వీరసింహారెడ్డి’ అనే లీక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. జనవరి 8 లేదా 11 ఈ రెండు తేదీల్లో ఒకటి ఫిక్స్ అవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ లేనట్టే. చిరు బాలయ్య నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఒకరే అయినప్పటికీ తప్పని పరిస్థితిలో క్లాష్ కి సిద్ధమయ్యారట.
ఇక దిల్ రాజు నిర్మాణంలో విజయ్ వంశీ పైడిపల్లి కాంబోల ‘వారసుడు’ సైతం పొంగల్ కే రానుంది. తమిళంలో ఏమో కానీ తెలుగులో మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ల సమస్య వస్తుంది. పైన చెప్పిన మూడింటికి సర్దడమే పెద్ద సవాల్ అనుకుంటే ఇప్పుడిది కూడా చేరితే ఇబ్బంది తప్పదు. ఒకవేళ వీటిలో ఏది తప్పుకున్నా అఖిల్ ‘ఏజెంట్’ని రంగంలో దింపేందుకు అనిల్ సుంకర రెడీ అవుతున్నారనే టాక్ కూడా ఉంది. కరోనా పూర్తిగా సద్దుమణిగాక టాలీవుడ్ కు రాబోతున్న అతి పెద్ద సంక్రాంతి ఇదే కానుంది. ఎంత లేదన్నా అయిదారు వందల కోట్ల థియేట్రికల్ బిజినెస్ వీటి మీద జరగనుంది. మరి ఎవరు ఆగుతారు ఎవరు దూకుతారనేది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది.