చిరిగిన నోట్లను ఫ్రీగా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ నిబంధనలు ఇలా..!

పచారీ సరుకుల కోసం దుకాణానికి వెళ్లినప్పుడు కాస్తంత చిరిగిపోయినా, నలిగిన నోటు తీసుకెళితే.. ఇది చెల్లదు.. మరొకటి ఇవ్వండంటూ సతాయిస్తాడు వ్యాపారి. ఇక మనకు తెలియకుండా చినిగిపోయిన నోటు మన చేతికి వచ్చినా.. లేదా అనుకోకుండా మన చేతుల్లో చిరిగిపోయినా దాన్ని మార్చేందుకు నానా అవస్థలు పడుతుంటాం. ఇక బస్సు ఎక్కేటప్పుడు మార్చేద్దామనుకుని కండక్టర్‌కు ఇస్తే.. ఏంటమ్మా ఇలాంటి నోటిచ్చావ్.. చెల్లదు అంటూ తిరిగి ఇచ్చి.. మరో నోటు ఇవ్వమంటూ మండిపడతాడు. పది, ఇరవై రూపాయల నోటు అయితే పక్కన పెట్టేస్తాం కానీ.. రూ.200, రూ.500 చిరిగిన నోట్లు ఉంటే మాత్రం ప్రాణం ఊసురుమంటూంది. అవి ఎలా మార్చాలో, ఎక్కడ మార్చాలో అవగాహన ఉండదు. దీంతో మధ్యవర్తిని ఆశ్రయిస్తుంటారు చాలా మంది. కమీషన్ పద్ధతిలో పది రూపాయలకు ఇంత అని చార్జ్ చేసి చిరిగిన నోటు ప్లేసులో తళతళలాడే కరెన్సీ నోట్లు ఇస్తుంటారు. అయితే కమీషన్ లేకుండా మీ చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చునని సూచిస్తుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్.

సులువుగా మీ చినిగిపోయిన నోట్లను బ్యాంకుల్లోనే మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది ఆర్బీఐ. అది కూడా ఉచితంగా. దీని కోసం ఎలాంటి ఫారమ్‌ను పూర్తి చేయాల్సిన అవసరం లేదు. అయితే తక్కువ డ్యామేజ్ ఉన్న నోట్లకు ఓ విలువ, ఎక్కువ పాడైన నోట్లకు పర్సంటేజ్ ఆధారంగా చెల్లిస్తారు. పెద్ద మొత్తంలో చిరిగిన నోట్లు ఉంటే వాటన్నింటిని ఒకేసారి మార్చుకునే అవకాశం లేదు. కేవలం 20 పాడైన కరెన్సీని మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. అలాగే దాని విలువ రూ. 5 వేలను మించరాదు. ఎక్కువ మొత్తంలో చిరిగిన నోట్లను మార్చుకోవాలంటే మాత్రం కొంత సమయం వేచి చూడాల్సిందే. ఆ పాడైన డబ్బులు మీ దగ్గర కలెక్ట్ చేసుకుని, ఆ తర్వాత మీ ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అలాగే నోటు చిరిగిన దాన్ని బట్టి మీకు అమౌంట్ లభిస్తుంది.

అలాగే ముక్కలు ముక్కలుగా అయిపోయిన, లేదా ఉద్దేశ పూర్వకంగా నోట్లు చించితే.. బ్యాంకు ఆ నోట్లను తీసుకోదు సరికదా.. ఎక్కడా మార్చుకునే అవకాశం ఉండదు . 78 చ.సెం.మీ కాస్త నలిగిన, చిరిగిన రూ.500 నోటుకు దానికి సమానమైన డబ్బు ఇస్తారు. ఒక వేళ 39 చ. సెం.మీ పాడైపోనయిన కరెన్సీకి సగం డబ్బులు మాత్రమే అందుతాయి. అంటే రూ. 250 మాతమ్రే చేతికి వస్తాయి. చిరిగిన నోట్ల మీద మహాత్మాగాంధీ బొమ్మతో, మార్క్‌తో పాటు, సీరియల్ నంబర్, గవర్నర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. అటువంటి నోట్లను మాత్రమే బ్యాంకులు మారుస్తాయి. మీ దగ్గర ఉన్న చిరిగిన నోట్లు మార్చుకోవాలంటే.. మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులకు వెళ్లవచ్చు. ఆ బ్యాంకులో మీకు ఖాతా కూడా ఉండాల్సిన అవసరం లేదు.

Show comments