iDreamPost
android-app
ios-app

కిడ్నీ బాధితుడి వెనుక లోన్ యాప్స్ కుట్ర.. అసలు పూర్తి కథ

  • Published Jul 09, 2024 | 8:28 PM Updated Updated Jul 09, 2024 | 8:28 PM

A Kidney Victim's Story: గుంటూరుకు చెందిన మధుబాబు అనే ఆటో డ్రైవర్ 30 లక్షల కోసం కిడ్నీ వేరే వ్యక్తికి దానం చేశారు. అయితే అతని చేతిలో లక్ష పెట్టి జంప్ అయ్యారు. అసలు కిడ్నీ అమ్ముకునే పరిస్థితికి ఆ వ్యక్తి రావడానికి కారణం ఏంటి? దీని వెనుక లోన్ యాప్స్ ఒత్తిడి ఏమైనా ఉందా?

A Kidney Victim's Story: గుంటూరుకు చెందిన మధుబాబు అనే ఆటో డ్రైవర్ 30 లక్షల కోసం కిడ్నీ వేరే వ్యక్తికి దానం చేశారు. అయితే అతని చేతిలో లక్ష పెట్టి జంప్ అయ్యారు. అసలు కిడ్నీ అమ్ముకునే పరిస్థితికి ఆ వ్యక్తి రావడానికి కారణం ఏంటి? దీని వెనుక లోన్ యాప్స్ ఒత్తిడి ఏమైనా ఉందా?

కిడ్నీ బాధితుడి వెనుక లోన్ యాప్స్ కుట్ర.. అసలు పూర్తి కథ

ఒకప్పుడు అప్పు అంటే ఊర్లో తెలిసినవాళ్ళనో.. ఫ్రెండ్స్ నో అడిగేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అప్పు కావాలంటే ఆన్ లైన్ యాప్స్ బాటపడుతున్నారు. 10 నిమిషాల్లో వివరాలు ఇస్తే.. 5 నిమిషాల్లో లోన్ వచ్చి పడుతుంది. దీంతో విచ్చలవిడిగా లోన్ యాప్స్ పై ఆధారపడిపోతున్నారు. కొన్ని లోన్ యాప్స్ కూడా కస్టమర్ల అవసరాలను క్యాష్ చేసుకుందామని గోతికాడ గుంటనక్కల్లా ఎదురుచూస్తున్నాయి. లోన్ కరెక్ట్ గా కట్టే వాళ్లతో వీళ్ళకి ఉపయోగం ఉండదు.. సరిగా చెల్లించనివారితోనే లోన్ యాప్స్ కి భారీ లాభం. అందుకే ఈ ట్రాప్ లోకి లాగే ప్రయత్నం చేస్తారు. లోన్ గురించి ఎంక్వైరీ చేసిన వారికి లోన్ ఇస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.

కానీ లోన్ అవసరమే లేని వ్యక్తులకు కూడా లోన్ కావాలా సార్? క్రెడిట్ కార్డు తీసుకోండి సార్ అంటూ కాల్స్, మెసేజులు వస్తున్నాయి. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద స్కామో అనేది అర్థం చేసుకోవచ్చు. లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకున్నాక కస్టమర్ ఎప్పుడు మిస్ పేమెంట్ చేస్తాడా అని కాచుకుని కూర్చుంటారు. పేమెంట్ లేటయితే వడ్డీలు ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు. కొన్ని సందర్భాల్లో తీసుకున్న అసలు కంటే కూడా కట్టిన వడ్డీనే ఎక్కువ ఉంటుంది. లోన్ యాప్స్ వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఒక యువకుడు మాత్రం లోన్ యాప్ వాళ్ళు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక కిడ్నీ అమ్ముకునేందుకు ప్రయత్నించాడు.    

గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆటోడ్రైవర్ గా పని చేస్తారు. ఈయన పలు వ్యాపారాలు పెట్టి అప్పుల పాలయ్యారు. ఆ అప్పులు తీర్చడం కోసం లోన్ యాప్స్ లో అప్పు తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడడంతో చివరి ఆప్షన్ గా కిడ్నీ అమ్ముకోవాలని అనుకున్నారు. 30 లక్షలు ఇస్తామంటే నమ్మి మోసపోయారు. ఇది ఒక కథ. ఇలాంటి కథలు, వ్యధలు మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. నేటి యువత చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. వ్యాపారం కోసం అప్పు చేసి నష్టపోవడం లాంటివి పక్కన పెడితే.. క్రికెట్ బెట్టింగ్ లని, బెట్టింగ్ యాప్ లని, ట్రేడింగ్ యాప్ లని రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు. ఆ మధ్య అలానే ఒక బీటెక్ విద్యార్ధి అప్పు తెచ్చి మరీ 46 లక్షలు ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టి నిండా మునిగాడు.

ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి 21 లక్షలు నష్టపోయాడు. ఇలా వీరంతా డబ్బు సంపాదించాలి అన్న ఆశతో ఎవరో ఒకరి చేతిలో మోసపోతున్నారు. అయితే గుంటూరుకి చెందిన మధుబాబు గానీ, 46 లక్షలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి గానీ, 21 లక్షలు నష్టపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానీ వీళ్ళలో కామన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే.. వీళ్ళు ఒక ట్రాప్ లో పడ్డారు. వీళ్ళకి ఆశ ఉండచ్చు కానీ వీళ్ళని అలా ఉసికొల్పింది మాత్రం సోషల్ మీడియా ప్రకటనలు.

అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న మధు బాబుకి ఫేస్ బుక్ లో కిడ్నీ అమ్మితే డబ్బులిస్తామన్న ప్రకటన కనిపించడం.. అసలు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనే లేని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇన్ స్టాలో రీల్స్ చూస్తుండగా స్టాక్ మార్కెట్ గురించి ప్రకటన కనిపించడం.. చూస్తుంటే వీళ్ళు ఒక ట్రాప్ లో ఇరుక్కున్నట్టు అర్థమవుతుంది. బీటెక్ విద్యార్ధి మాత్రం డబ్బు సంపాదించాలన్న అత్యాశతో అప్పు తెచ్చి మరీ ట్రేడింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టాడు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాడు. ఇలా క్రికెట్ బెట్టింగులు, బెట్టింగ్ యాప్ లు, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ అంటూ రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్ చేసి దారుణంగా నష్టపోతున్నారు. మెజారిటీ యువత మొత్తం ఈ మాయదారి స్క్రాప్ లో పడి కొట్టుకుపోతున్నారు. బయటకు వస్తేనే తప్ప తెలియని కథలు, వ్యధలు ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మంది రారు. వీళ్ళ అత్యాశే కేటుగాళ్ల పెట్టుబడి.

అది లోన్ యాప్స్ అయినా, బెట్టింగ్ యాప్స్ అయినా, ట్రేడింగ్ యాప్స్ అయినా.. ఇంకేవైనా గానీ మోసం చేయడం, మోసపోయేలా చేయడం, ఒత్తిడి చేయడం, మృత్యు ఒడిలోకి వెళ్లేలా చేయడం, ఇప్పుడు గుంటూరు మధుబాబులా ఒంట్లో అవయవాలు అమ్ముకునే స్థితికి వచ్చేలా చేయడం.. ఇదే జరుగుతుంది. ఎంతవరకూ జరుగుతుంది అంటే నమ్మినంత కాలం. మధుబాబు కిడ్నీ అమ్ముకునే స్థాయికి వచ్చారంటే అతనికి ఏ స్థాయిలో లోన్ యాప్స్ ఒత్తిడి ఉందో అనేది అర్థమవుతుంది. వీరి కథ, వ్యధ తెలిసిన తర్వాతయినా నేటి యువత మారాలి.