వాలంటీర్లను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ మీద మంత్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్‌కు వ్యతిరేకంగా వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడీ వివాదంపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. అధికార పక్షం, ప్రతిపక్షం కాకుండా నడుమ ఉన్న పనికిమాలిన పార్టీ సచివాలయ వ్యవస్థపై గగ్గోలు పెడుతోందని పరోక్షంగా పవన్‌పై ఆమె ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ దుర్మార్గమని ఆమె అన్నారు.
ప్రజలు అందరూ వాలంటీర్లకు మద్దతుగా నిలవాలని రోజా పిలుపునిచ్చారు. పవన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కూడా రోజా మండిపడ్డారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ కల్యాణ్ పిచ్చిగంతులు వేస్తున్నాడంటూ ఆమె సీరియస్ అయ్యారు. ‘పవన్ కల్యాణ్ ఒక పనికిమాలినోడు. కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌లో దాక్కున్నారు. ఇప్పుడు మీకు చప్పట్లు కొట్టేవారికి కరోనా టైమ్‌లో సేవలు అందించింది వాలంటీర్లే. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ పిచ్చిగంతులు వేస్తున్నాడు’ అని రోజా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో మోసం జరిగితే నోరెందుకు లేవలేదని పవన్‌పై సీరియస్ అయ్యారు రోజా. ఆయనకు అసలు చట్టాల గురించి ఏమాత్రం తెలియదన్నారు. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడమే పవన్‌కు తెలుసునని పేర్కొన్నారు. అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ అనుకుంటున్నాడా అని ఆమె ప్రశ్నించారు. పవన్ సంస్కారం గురించి చెబితే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుందని రోజా విమర్శించారు. ఎవరి మాటా వినడు కాబట్టే పవన్‌ను భార్యలు వదిలేశారని ఆమె దుయ్యబట్టారు. ఎన్సీఆర్ రిపోర్టులో తెలంగాణ టాప్‌లో ఉందన్న రోజా.. అక్కడ మాట్లాడితే కేసీఆర్ మక్కెలు విరగ్గొడతారని భయమా అని నిలదీశారు.