iDreamPost
android-app
ios-app

వారాహి యాత్ర.. పవన్ కల్యాణ్ కు పోలీస్ నోటీసులు!

వారాహి యాత్ర.. పవన్ కల్యాణ్ కు పోలీస్ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అరెస్టు తర్వాత మారుతున్న పరిస్ధితుల్లో పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లాలో నాలుగోదశ వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అవనిగడ్డలో తొలి సభ జరిగింది. అనంతరం బందరులో రెండు రోజులుగా కార్యకర్తలు, పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తున్న పవన్.. నేడు పెడనలో మరో బహిరంగసభకు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పవన్ చేసిన ఈ ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే చూపించాలి అంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా నాలుగో విడత కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం అవనిగడ్డలో పర్యటించిన పవన్.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇది ఇలా ఉంటే..నేడు పెడనలో జరిగే వారాహి బహిరంగసభలో రాళ్ల దాడి జరగొచ్చని తనకు సమాచారం ఉందంటూ పవన్ కల్యాణ్ మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యకర్తలు తన యాత్రలో దాడులు చేసినా ప్రతిదాడులు చేయొద్దంటూ జనసేన కార్యకర్తలకు పవన్ సూచించారు. ప్రతిదాడికి బదులుగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని కోరారు. దీంతో పవన్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కల్యాణ్ కి నోటీసులు జారీ చేశారు.

పెడన సభపై రాళ్లదాడికి సంబంధించి పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. పవన్ కు రాళ్ల దాడి జరుగుతుందనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. పవన్ సభ దగ్గర అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు తప్పకుండా తీసుకుంటామని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. పెడన ప్రాంతంలోని తోటమూల సెంటరులో బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసారని, తన సభలో దాడులు జరుగుతాయని ఆయన ఆరోపించారని తెలిపారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తాము పూర్తి విచారణ చేశామని ఆ ప్రాంతాన్ని పరిశీలించామని ఎస్పీ తెలిపారు. ఎటువంటి సమాచారంతో పవన్ దాడులు జరుగుతాయంటూ వ్యాఖ్యలు చేశారని ఎస్పీ ప్రశ్నించారు.