రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. SI భర్త దారుణ నిర్ణయం

భార్యా భర్తల మధ్య అపార్ధాలు, అనర్థాలు వచ్చాయా.. వాటిని ఎవ్వరూ తీర్చలేరు. అది ప్రేమ పెళ్లిలో అయినా, పెద్దల కుదిర్చిన వివాహమైనా. పాలు, నీళ్లలా ఉండాల్సిన భార్యా భర్తలు నెయ్యి, నిప్పుగా మారితే.. కాపురం తగుల బడిపోతుంది. ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నవారే. ఇద్దరు తమ సంపాదనను కుటుంబానికి ఖర్చుపెడుతున్నట్లే.. పనుల్లో కూడా భాగస్వామ్యం కావాలి. అప్పుడే చాలా సమస్యలు పరిష్కరించుకున్నవారు అవుతారు. అయితే వీరిలో ఒకరిదీ ఆధిపత్యం, మరొకరిది మొండితనం అయితే గంటకో గొడవ.. ఆరు నెలలకే విడాకులు అయిపోతున్నాయి. పెద్దల కుదిర్చిన పెళ్లిలో అయితే దంపతులకు తల్లిదండ్రులు మద్దతుగా నిలుస్తారు కానీ, ప్రేమ పెళ్లిలో ఆ లోటు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ గొడవల కారణంగా కొన్ని సార్లు మనస్థాపానికి గురై క్షణికావేశంలో ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మరొకర్ని ఒంటరి చేసేస్తున్నారు.

వారిద్దరిదీ ప్రేమ వివాహం. ఆ ప్రేమకు ప్రతి రూపంగా ఓ చిన్నారి కూడా పుట్టింది. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించగా.. భార్యకు కొలువు వచ్చింది. భర్త కూడా ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ ఏమైందో ఏమో.. భార్య, బంగారం లాంటి బిడ్డను వదిలి.. ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా నందివాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరుకు చెందిన శిరీష, గుంటూరు జిల్లా పెదకాకాని వాసి బి అశోక్ ప్రేమించుకుని, రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరిది కులాంతర వివాహం. ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది. శిరీష, అశోక్ ఇద్దరూ ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నించగా.. శిరీషకు ప్రభుత్వ కొలువు వరించింది. మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పని చేస్తున్న శిరీషకు 4 నెలల క్రితం నందివాడకు బదిలీ అయ్యింది. వీరి కాపురం అక్కడకు షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.

ఆదివారం మధ్యాహ్నం భర్త భోజనానికి కూడా రాకపోగా.. అశోక్‌కు ఫోన్ చేసింది శిరీష. బయట పని ఉందని చెప్పిన అతడు.. సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే గుర్తించిన భార్య శిరీష, ఆమె తరుఫు బంధువులు హుటాహుటిన గుడివాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. రాత్రి 10 గంటల తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. వీరిద్దరి మధ్య ఏమన్నా గొడవలయ్యాయా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show comments