టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి జైలులో పూర్తి భద్రత ఉందని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. ఇంటి భోజనంతో పాటు మందులు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆయనకు సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఈ కేసులో బాబు అన్ని ఆధారాలతో దొరికిపోయారన్నారు సుధాకర్‌రెడ్డి. చంద్రబాబు ఇప్పుడు న్యాయవ్యవస్థను భ్రష్ఠు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏఏజీ ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో ఆయనకు పూర్తి భద్రత ఉందని తెలిపారు. జైల్లో ఖైదీలు గాక స్వామీజీలు ఉంటారా? అని పొన్నవోలు ప్రశ్నించారు.
జైలులో చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులు కూడా అందిస్తున్నారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయనకు బెయిల్, హౌజ్ అరెస్ట్.. ఇలా పిటిషన్లు వేసుకొనే హక్కులు కూడా ఉంటాయని తెలిపారు. తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు నడవడాన్ని మాజీ అధికారి పీవీ రమేష్ ఆక్షేపించడాన్ని ఏఏజీ సుధాకర్‌రెడ్డి ఖండించారు. పీవీ రమేష్ జడ్జి ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఉందని.. అందులో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. ఈ పరిణామాలను చూస్తుంటే.. అప్పుడే ఒక వికెట్ పడిపోయిందని అనుమానం కలుగుతోందన్నారు ఏఏజీ.
పీవీ రమేష్‌ను ప్రలోభ పెట్టినట్లు కనిపిస్తోందని ఏఏజీ సుధాకర్‌రెడ్డి అన్నారు. ‘ప్రలోభ పెట్టడం, లోబర్చుకోవడం, మేనేజ్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చంద్రబాబను జైల్లోనే ఉంచాలని బలంగా చెబుతున్నాం. ఏ వ్యవస్థనైనా భ్రష్ఠు పట్టించే సమర్థత వాళ్లకు ఉంది. ఆర్డర్ తమకు అనుకూలంగా రాకపోయేసరికి ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా నిందిస్తున్నారు. న్యాయవ్యవస్థపై దాడి చేయడం దురదృష్టకరం. న్యాయవ్యవస్థను కూలదోయాలని ప్రయత్నిస్తే వాళ్లే కూలిపోతారు’ అని ఏఏజీ సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. స్కిల్ స్కామ్ కేసులో తాను వృత్తిపరంగా మాత్రమే పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తన మీద ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవని సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బాబు హౌస్ కస్టడీకి నో చెప్పిన ACB కోర్టు!