‘ఈపాటికి రైలొచ్చేసే వుంటుంది. మీరింకా నీళ్ళూ పోసుకోలేదు, జపఁవూ కానివ్వలేదు. తొరగా లేచి తెమలండి!’ భార్య చదువుతున్న స్తవానికి చదువుతున్న పేపరు పక్కనబడేసి భుజాన తువ్వాలేసుకుని లేచాడు సీతారాఁవుడు. ఏడుగంటల బండికి దిగుతాన్నాడు లక్షినాణ…అదే…బాపు! కాలవగట్టున నిలబడి చెంబుతో నీళ్ళుపోసుకోడం అలవాటు సీతారాఁవుడికి. చప్టాలు జారుతున్నాయి. చల్లటి నీళ్ళలో కొబ్బరాకుల నీడలు నిలకడగా, నిశ్శబ్దంగా కదులుతున్నాయి. గోదారి కాలవగట్టునే ఇల్లు. పెరటిగుమ్మంలోంచి బయటకి రాగానే గలగల్లాడుతూ కనబడుతూ వుంటుంది. దూరంగా వేణుగోపాలస్వామి గుళ్ళోంచి గంటలు మృదువుగా వినబడుతున్నాయి. […]