iDreamPost

జనసేనకు 10 కోట్లు విరాళం! ప్రకటన సరే.. డబ్బులేవి పవన్?

  • Published Feb 20, 2024 | 2:29 PMUpdated Feb 20, 2024 | 2:29 PM

పార్టీ బలోపేతం కోసం తన స్వార్జితం నుంచి రూ.10 కోట్లు ఇస్తున్నట్లు పవన్‌ చేసిన ప్రకటనపై ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలే పెదవి విరుస్తున్నారు. పైగా దీని వెనక ఓ కిటుకుందని అంటున్నారు.

పార్టీ బలోపేతం కోసం తన స్వార్జితం నుంచి రూ.10 కోట్లు ఇస్తున్నట్లు పవన్‌ చేసిన ప్రకటనపై ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలే పెదవి విరుస్తున్నారు. పైగా దీని వెనక ఓ కిటుకుందని అంటున్నారు.

  • Published Feb 20, 2024 | 2:29 PMUpdated Feb 20, 2024 | 2:29 PM
జనసేనకు 10 కోట్లు విరాళం! ప్రకటన సరే.. డబ్బులేవి పవన్?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాజాగా చేసిన ఓ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏంటి అంటే.. పార్టీ బలోపేతం కోసం, ఎన్నికల నిర్వహణ ఖర్చు కోసం.. తన స్వార్జితం 10 కోట్ల రూపాయలు విరాళమిస్తున్నట్లుగా ప్రకటించాడు పవన్‌ కళ్యాణ్‌. ఆయన ప్రకటనపై ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు కేవలం పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే అని తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ జనసైనికులు మాత్రం.. వామ్మో ఈసారి మా జేబుకు భారీగానే చిల్లు పడేలా ఉందని ఆందోళన పడుతున్నారు. ఇచ్చేది లేదు పెట్టేది లేదనప్పుడు ఈ అతి ప్రకటనలు అవసరమా అని జనసేన నేతలు, కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎందుకంటే పవన్‌ ఇలానే ప్రకటనలు చేయడం.. ఆ తర్వాత దాని గురించి మర్చిపోవడం ఆయనకు అలవాటుగా వస్తుంది అంటున్నారు. పైగా ఇప్పుడు పవన్‌ ప్రకటించిన 10 కోట్ల రూపాయల విరాళం వెనక కూడా ఓ కిటుకుందని చెప్పుకుంటున్నారు జనసేన కేడర్‌.

ఇండస్ట్రీలో పవన్‌ భజన చేసే వారిని పక్కకు పెడితే.. మిగతా వాళ్లంతా.. ఆయనకు ధన దాహం ఎక్కువని అంటారు. సాధారణంగా ఓ సినిమా ప్లాఫ్‌ అయితే ఏ హీరో అయినా సరే తన రెమ్యూనరేషన్‌ తగ్గించుకుంటాడు.. తీసుకున్న మొత్తం నుంచి కొంచెం కూడా వెనక్కి తిరిగి ఇస్తాడు. కానీ పవన్‌ మాత్రం అలా చేయడు. పైగా వరుసగా సినిమాలు ఫెయిల్‌ అయినా.. తన రెమ్యూనరేషన్‌ ఏమాత్రం తగ్గించుకోడని చెబుతారు. పైగా గతంలో పవనే ఒక సందర్బంలో ఒక్కొ సినిమాకు తాను 50 ​కోట్ల రూపాయలు తీసుకుంటానని స్వయంగా చెప్పుకొచ్చాడు. మరి అంత భారీ ఎత్తున పారితోషికం తీసుకునే పవన్‌.. తన కారు ఈఎంఐ కట్టడానికి, సాఫ్ట్‌కు జీతాలు ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బు లేదని తరచు చెబుతూ ప్రజల్లో తన పట్ల సానుభూతిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు.

250 కోట్ల సంపాదన.. అయినా డబ్బులేవనే మాటే..

ఇక గత మూడేళ్ల నుంచి చూసుకుంటే పవన్‌ వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు. వకీల్‌ సాబ్‌, భీమ్లా నాయక్‌ విడుదల కాగా.. హరిహర వీరమల్లు, బ్రో, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ఓజీ సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇవి కాక మరి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల చొప్పున వీటన్నింటికి కలిపి సుమారు 250 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడు పవన్‌. అయినా సరే తాను పేదవాడిని అని.. తన దగ్గర డబ్బులేవని ప్రచారం చేసుకుంటాడు. పైగా పూర్తిస్థాయిలో రాజకీయాల్లోనే ఉంటానన్న పవన్‌.. ఆ తర్వాత మాట తప్పి.. వరుస సినిమాలు చేశాడు. ఏమి అంటే.. పార్టీ నడపడానికి డబ్బులు కావాలి.. అందుకే సినిమాలు చేస్తున్నాను అంటాడు.

కానీ అసలు వాస్తవం వేరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాలిటిక్స్‌లోకి రాక ముందు పవన్‌ కేవలం సినిమాల ద్వారా మాత్రమే ఆదాయం సంపాదించేవాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక.. ఇటు చంద్రబాబు నుంచి ముడుపులు, ప్యాకేజీ కింద బాగానే ముట్టిందని.. అంతేకాక లింగమనేని నుంచి గిఫ్ట్‌గా భారీ ఎత్తున భూములు పొందాడని అంటున్నారు. అంతేకాక పార్టీ కోసం పవన్‌ సొంత డబ్బు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరని చెబుతున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. జనసేన పార్టీ కోసం.. ఏడాదంతా విరాళాలు సేకరించే సంగతి అందరికి తెలుసు. దాంతో పవన్‌ చేతి నుంచి పార్టీ కోసం రూపాయి కూడా ఖర్చు చేసే అవకాశం లేదని అంటున్నారు.

జనసేన ఖర్చులు భరిస్తోన్న టీడీపీ..

ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లాస్‌ పార్టీ ఖర్చులన్నింటిని చంద్రబాబే భరిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. పవన్‌ తిరిగేందుకు హెలికాప్టర్లు, స్పెషల్‌ ఫైట్లు పంపేది టీడీపీనే అని తెలుగుతమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాక ఆయన నియోజవకర్గాల్లో పర్యటించినప్పుడు.. స్థానికంగా ఉండే అభిమానులు, తెలుగుదేశం అధిష్టాన పెద్దలు ఆయన ఖర్చులను భరిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే 2024లో మా కూటమి అధికారంలోకి రాగానే మీకు లబ్ధి చేకూరుస్తామని చెప్పి.. నిర్మాతల వద్ద నుంచి పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ఫండ్‌ వసూలు చేస్తున్నారని సమాచారం. పార్టీ కోసం విరాళాలు.. తన కోసం చంద్రబాబు డబ్బులు ఖర్చు చేస్తుండగా.. ఇక పవన్‌ సినిమాల ద్వారా సంపాదించిన మొత్తం అలానే ఉందని.. దాన్నుంచి ఆయన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అంటున్నారు రాజకీయ పండితులు.

గతంలో ఇలానే ప్రకటనలు.. ఆపై మాట తప్పిన వైనం..

అయితే పవన్‌ ఇలా గొప్ప కోసం ఇలా ఆర్భాటంగా ప్రకటనలు చేయడం ఇదే తొలసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో ఇలానే విరాళాలు, ఆర్థిక సాయం గురించి ప్రకటించాడు.. ఆ తర్వాత దాన్ని గాలికి వదిలేశాడు. ఇక కొన్ని సందర్భాల్లో.. పవన్‌ ఆర్థిక సాయం ప్రకటించి.. ఆ తర్వాత అభిమానులే ఆ మొత్తం ఇవ్వాలని కోరడం కూడా జరిగిందని అనడమే కాక.. ఆధారలతో సహా నిరూపిస్తున్నారు. గతంలో కామన్‌మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెడుతున్నానని.. అందుకోసం తనే రూ.కోటి విరాళంగా ఇస్తానని ప్రకటించాడు పవన్‌. ఆ తర్వాత దాన్ని పట్టించున్న పాపానా పోలేదు.

ఇక 2019 ఎన్నికల ప్రచారం సమయంలో భీమవరం వెళ్లినప్పుడు వంద అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయిస్తా.. అందుకు రూ.కోటి విరాళం ప్రకటించాడు పవన్‌. దానిపై ఇప్పటి వరకు మరో ప్రకటన వెలువడలేదు. అలానే వెంకటరాహుల్ అనే క్రీడాకారుడికి రూ.10 లక్షల సాయం చేస్తానన్నాడు.. అది గాల్లో కలిసిపోయింది. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య స్మారక భవనం కోసం రూ.కోటి ఇస్తున్నట్లు ఘనంగా ప్రకటించాడు పవన్‌ కళ్యాణ్‌. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు.

జనంలో పేరు కోసం పవన్‌ భారీ ఎత్తున విరాళం ఇస్తానని ప్రకటిస్తుంటాడు.. కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలాల్లేవు. పైగా పవన్‌ ప్రకటనల వెనక ఓ కిటుకు దాగుందని అంటున్నారు. అది ఏంటంటే.. ముందు ప్రచారం కోసం పవన్‌ ఆర్భాటంగా పవన్‌ కోట్ల రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటిస్తాడు. ఆ తర్వాత దానిపై స్పందించాల్సిందిగా తన అభిమానులు, కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేస్తాడు. గతంలో ఇలా అల్లూరు విగ్రహం, సంజీవయ్య స్మారక భవన కోసం రూ.కోటి లెక్కన ఇస్తానని ప్రకటించిన పవన్‌.. ఆ తర్వాత మీరు స్పందించండి అంటూ తన అభిమానులు, కార్యకర్తలను సోషల్‌ మీడియాలో కోరారు. వాళ్లు దానిపై స్పందిస్తూ.. భారీగా డబ్బు ఇచ్చారు. అదంతా ఎవరి జేబులోకి వెళ్లిందో నేటికి అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అయితే పవన్‌ చెప్పినట్లుగానే సీతరామారాజు విగ్రహం పెట్టలేదు. స్మారక భవనం కూడా కట్టించలేదు. డబ్బు మాత్రం భారీగా వసూలు చేశాడు.

రూ.10 కోట్ల విరాళం వెనక కిటుకు అదే..

తాజాగా పవన్‌ తన పార్టీ కోసం రూ.10 కోట్ల స్వార్జితాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అయితే ఇక్కడే పవన్‌ స్ట్రాటజీ వాడతాడని అంటున్నారు రాజకీయ పండితులు. నేను పార్టీ కోసం విరాళం ఇస్తున్నాను కదా.. మీరు కూడా పార్టీ కోసం డొనేషన్‌ ఇవ్వాలని కార్యకర్తలను కోరతాడని.. అలా వచ్చిన డబ్బు ఎక్కడికి పోతుందో పవన్‌కే తెలియాలి అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. అభిమానుల నుంచి పార్టీ కోసం డబ్బులు వసూలు చేసే వ్యూహమిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే పవన్‌.. పార్టీ కోసం ఇంత తక్కువ మొత్తం విరాళం ప్రకటించడం ఏంటి అంటున్నారు ఈ విషయం తెలిసిన జనాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి