iDreamPost

పవర్ స్టార్ సరసన గబ్బర్ సింగ్ భామ

పవర్ స్టార్ సరసన గబ్బర్ సింగ్ భామ

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ఇవాళ మొదటి ఆడియో సింగల్ తో సందడి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది కాని తను పవన్ కు జోడి కాదు. కథలో ముఖ్యమైన బాధితురాలి పాత్రలో నటిస్తోంది. అయితే ఇందులో చాలా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో పవన్ భార్యగా నటించే యువతీ ఎపిసోడ్ ఒకటుంది. తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేయగా తాజాగా తెలుగులో అదే పాత్రను శృతి హాసన్ చేయబోతున్నట్టు హాట్ అప్ డేట్. ఇది పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్.

గతంలో గబ్బర్ సింగ్ లో ఈ కాంబినేషన్ మేజిక్ చేసింది. ఇండస్ట్రీ రికార్డ్ హిట్ గా నిలిచిన ఆ మూవీ తర్వాత శృతి హాసన్ కొన్నేళ్ళు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరసగా రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన ఛాన్సులు కొట్టేసింది. తను గ్యాప్ తీసుకోక ముందు చేసిన చివరి సినిమా కూడా పవన్ తోనే. కాటమరాయుడు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడు రవితేజ క్రాక్ తో ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శృతి హసన్ కు వకీల్ సాబ్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు.

కథ మొత్తం ఉండదు కాని కథను మలుపు తిప్పే ఎపిసోడ్ లో ఉంటుంది కాబట్టి శృతి హాసన్ కు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ గబ్బర్ సింగ్ జోడి కాబట్టి అభిమానులకూ ఒక సెంటిమెంట్ లా అనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. పవన్ తో మూడుసార్లు జోడి కట్టిన బ్యూటీ కూడా ఒక్క శృతి హాసనే. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తనకు పవన్ కు ఒక డీసెంట్ ఎమోషనల్ సాంగ్ ఉంటుందట. తమన్ ఎన్ని ట్యూన్స్ ఇస్తున్నాడో తెలియదు కాని పవన్ కన్పించేవి రెండే అని వినికిడి. అధికారికంగా ఇంకా చెప్పకపోయినా శృతి హాసన్ ఉండటం కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి