iDreamPost

3+3… రాజీనామా చేస్తే అదిరిపోద్ది..

3+3… రాజీనామా చేస్తే అదిరిపోద్ది..

అమరావతిని మార్చే అధికారం మీకెక్కడిది..? ముఖ్యమంత్రికి రాజధానిని మార్చే అధికారం లేదు..! అవసరమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లి…గెలిచి అప్పుడు రాజధాని మార్చండి…! ఇదీ గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్ల వాదన…! టీడీపీ వాళ్లు అడగడం.. వైఎస్‌ జగన్‌ పాటించడం..రెండూ ఎలాగో జరిగేవి కావు..! అయితే మూడు ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం టీడీపీ చేతుల్లోనే ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని ప్రజాభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రపంచం ముందుంచొచ్చు. ఈ నేపథ్యంలో ఆ ఆరుగురు ఎవరనే తెలుసుకొనే ముందు టీడీపీ ఎన్నికల డిమాండ్‌ ఎత్తుకోవడానికి గల కారణాలనూ ఒకసారి పరిశీలిద్దాం…..!

అసలెందుకీ డిమాండ్‌…!

ఎన్నికలు జరిగి…బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నిండా ఏడాది కూడా కాలేదు..! కానీ, అప్పుడే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారు. జగన్‌ మూడు రాజధానులతో పరిపాలనా వికేంద్రీకరణకు నడుంబిగించడమే దీనంతటికీ ప్రధాన కారణంగా ఉంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రకరకాల కారణాలతో అమరావతితో అవిభాజ్యమైన ప్రేమానురాగాలను పెంచుకున్నారనేది విస్పష్టం. రాజకీయాలపై కొద్ధి పాటి అవగాహన కలిగిన వారెవరికైనా సదరు కారణాలేంటో స్పష్టంగా అర్థమవుతాయి..! అయితే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్‌ చర్యలు..చంద్రబాబుకి అస్సలు మింగుడుపడటం లేదు. అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్ది మరో ప్రతిష్టానపురం నిర్మాతగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలనుకొన్న చంద్రబాబు కలలు కల్లలుగా మిగిలిపోతుండటం, బడాబాబులకు దోచిపెట్టిన భూముల వివరాలు బయటకొస్తుండటంతో చంద్రబాబు మరో ఎన్నికల నినాదం ఎత్తుకున్నారు.

ప్రజాభిప్రాయం కోరాల్సిందేనా…?

అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తానని జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టలేదు…! తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రధాన విమర్శ…! ఈ విమర్శలో నిజం లేకపోలేదు…! అయితే అదే మ్యానిఫెస్టోలో రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని జగన్‌ చెప్పలేదు…! ఇదెక్కడ వాదన అని కొంత మందికి అనిపించొచ్చు. కానీ, ఏదైతే ఒక వాదనకు ఆధారంగా ఉంటుందో…ప్రతివాదనకు సదరు ఆధారానికి మించిన ఊతం ఏముంటుంది..! పైగా వైఎస్‌ జగన్‌ గెలిస్తే అమరావతిని రాయలసీమకు…అందునా ఇడుపులపాయకు తరలిస్తారంటూ తెలుగుదేశం ఊరురా ప్రచారం చేసింది. ఆ కోణంలో టీడీపీ వ్యాఖ్యలు నమ్మే రాయలసీమ ప్రజలు తమకు రాజధాని వస్తుందనే ఆశతో జగన్‌కు ఓట్లేశారని అనుకుందాం…మరి అమరావతి పరిధిలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీని ఎందుకు గెలిపించారు…? రాయలసీమకు చాలా దూరంలో ఉన్న విజయనగరంలో తొమ్మిదింటికి 9 సీట్లను వైఎస్సాఆర్‌సీపీకి ఎందుకు కట్టబెట్టారు..? దీన్ని బట్టి ప్రజలు తెలుగుదేశం వాదనను గత ఎన్నికల్లోనే తిరస్కరించినట్టుగా అర్థంచేసుకోవాలి. దాన్ని మరచి ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి..175 నియోజవర్గాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరుకోవడం వల్ల వందల కోట్ల ప్రజాధనం ఖర్చవుతుంది. చంద్రబాబుకి నిజంగా ప్రజా అభిప్రాయం తెలుసుకోవాలని అనిపిస్తే తనతో సహా మరో ఐదుగురిని రాజీనామాకు సిద్ధం చేస్తే సరిపోతుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడానూ….!

ఆ ఆరుగురు ఎవరంటే…!

అమరావతిపై ప్రజాభిప్రాయాన్ని సూచాయగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం తెలుగుదేశం చేతుల్లోనే ఉంది. దీనికి కోసం వైఎస్‌ జగన్‌ను డిమాండ్‌ చేయాల్సిన అవసరం లేదు…బ్రతిమాలాల్సిన అవసరం అంతకంటే లేదు. తమ పార్టీ అభ్యర్థులుగా గెలిచిన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయడు, విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌లతో రాజీనామా చేయించి… మళ్లీ ఎన్నికలకు వెళితే సరిపోతుంది. తద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం ముందుంచి జగన్‌పై ఒత్తిడి తీసుకురావొచ్చు. విజయవాడ, గుంటూరులు అమరావతిని ఆనుకొనే ఉన్నాయి కదా..ప్రస్తుతం. అక్కడి ప్రజలు సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు కదా అనే సందేహం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానుల్లో కలగొచ్చు. కానీ, శ్రీకాకుళంలో వచ్చే ఫలితం రాజధాని విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల అభిమతాన్ని తెలుపుతుందనడంలో సందేహం లేదు. ఆ ఎంపీలతోపాటు పనిలో పనిగా సీమ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌లు సైతం రాజీనామాకు సిద్ధపడితే రాయలసీమ ప్రజలనాఢి సైతం తేటతెల్లం అవుతుంది.

రాజీనామాలకు సిద్ధమేనా…!

సాధారణంగా నూటికో కోటికో తప్ప ఏ రాజకీయ నాయకుడూ పదవిని వదులకొనేందుకు సిద్ధపడడు..! కోట్లు ఖర్చు చేసి…ప్రత్యర్థులతో పోరాడి సాధించుకున్న కుర్చీపై ఆ మాత్రం ప్రేమ, మమకారాలు సహజం..! అందుకే ప్రత్యర్థులను చీటికీ మాటికి రాజీనామా చేయమని డిమాండ్‌ చేసే రాజకీయ నాయకులు తమ దగ్గరకొచ్చే సరికి ఆమడ దూరం పారిపోతారు. పైగా ఈ మధ్య కాలంలో అనేక రాజీనామా డ్రామాలు చూసిన ప్రజలు రాజకీయ నాయుకులపై ఓ అవగాహనకొచ్చారు. కాబట్టి రాజధానిగా విశాఖపట్నం వద్దు అమరావతే ముద్దు అని నినదించిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో సహా కేశినేని నాని, గల్లా జయ్‌దేవ్‌, పయ్యావుల కేశవ్ లు రాజీనామాలకు రెడీ అవుతారనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు చెప్పినా కేశినేని వంటి వ్యక్తులు వింటారనుకోవడం భ్రమే….!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి