iDreamPost

ఒకే రోజు 7 సినిమాల దాడి

ఒకే రోజు 7 సినిమాల దాడి

గడచిన రెండు నెలల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఘనంగా చెప్పుకోదగ్గ హిట్లు రెండే వచ్చాయి. ఒకటి అల వైకుంఠపురములో రెండు భీష్మ. ఇవి సాలిడ్ గా బయ్యర్లకు భారీ లాభాలు మిగిల్చిన సినిమాలు. మిగిలినవాటిలో ఎక్కువ డిజాస్టర్లే ఉండగా హిట్ లాంటివి చాలా తక్కువ బిజినెస్ చేసుకుని సేఫ్ గా బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ శుక్రవారం మీదే అందరి కన్ను ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సినిమాలు బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంత తీవ్రమైన క్లాష్ మంచిది కాకపోయినా నిర్మాతలు మాత్రం ఎవరికి వారు రిజల్ట్ పట్ల చాలా ధీమాగా ఉన్నారు.

అన్ని చిన్న సినిమాలే కావడంతో మరీ కిక్కిరిసిపోయే ఓపెనింగ్ దేనికీ వచ్చే అవకాశం లేకపోవడం అసలు ట్విస్ట్. వాటి వైపు ఓ లుక్ వేస్తే ఎప్పుడో 9 ఏళ్ళ క్రితం ప్రారంభమై ఆగుతూ సాగుతూ విడుదల నిలిచిపోయిన రాజశేఖర్ డ్యూయల్ రోల్ మూవీ ‘అర్జున’ ఇన్నాళ్లకు మోక్షం దక్కించుకుంది. హీరో మార్కెట్ దృష్ట్యా దీని మీద పెద్దగా ఆశలు లేవు. అందులోనూ ఇంత జాప్యం జరిగిందంటే అనుమానాలు రాక మానవు. ఇక నలభై క్రితం జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన ‘పలాస’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాలకు వేసిన ప్రీమియర్లకు మంచి రిపోర్ట్స్ వచ్చాయి. కాకపోతే మౌత్ టాక్ వస్తే తప్ప ఇలాంటివి కదలడం కష్టం.

బ్రహ్మాజీ కొడుకు హీరోగా రూపొందిన ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ వచ్చాక కాస్త అందరి చూపు దీని వైపు మళ్లింది. దీనికీ రిపోర్ట్స్ చాలా ముఖ్యం. ముగ్గురు అమ్మాయిల కథతో రూపొందిన ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, యూత్ స్టోరీగా తీసిన ‘కాలేజీ కుమార్’, ప్రభుదేవా డబ్బింగ్ సినిమా ‘కృష్ణమనోహర్ ఐపిఎస్’లు కూడా రేస్ లో ఉన్నాయి. సంఖ్యాపరంగా విడుదలవుతున్న సినిమాల సంఖ్య ఘనంగానే ఉంది కానీ దేనికీ చెప్పుకోదగ్గ హైప్ లేకపోవడం విచారకరం. పూర్తిగా టాక్ మీదే ఆధారపడుతున్న వీటికి శుక్రవారం పెద్ద ఛాలెంజ్ విసరబోతోంది. ఒకవైపు తమకు ఓపెనింగ్స్ రావడం లేదని నిర్మాతలు గగ్గోలు పెడుతూనే ఇలా ఒకేరోజు ఇన్నేసి సినిమాలు వదలడం గురించి మాత్రం మాట్లాడ్డం లేదు. చూద్దాం గెలుపు ఎవరిదో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి