ajaykrishna
ajaykrishna
ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో భోళా శంకర్ మూవీతో రెడీ అయిపోయారు. చిరుతో పాటు తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా.. తాజాగా థియేటర్స్ లో విడుదలైంది. డైరెక్టర్ మెహర్ రమేష్ రూపొందించిన ఈ సినిమా.. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’కి రీమేక్. అన్నాచెల్లెళ్ళ అనుబంధం.. ఆ ఎమోషన్స్ చుట్టూ సాగే భోళా శంకర్ చిత్రం.. ప్రమోషన్స్ తో అయితే గట్టిగానే బజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఈ మెగా మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
శంకర్(చిరంజీవి).. తన చెల్లి మహాలక్ష్మి(కీర్తిసురేష్) పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. చెల్లిని బెస్ట్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ చేసేందుకు కలకత్తాకి షిఫ్ట్ అవుతాడు. అక్కడే క్యాబ్ డ్రైవర్ గా పనిలో చేరతాడు. అప్పటికే కలకత్తాలో వరుసగా అమ్మాయిల కిడ్నాపులు జరుగుతుంటాయి. అనుమానితుల ఫోటోలు క్యాబ్ డ్రైవర్స్ కి ఇచ్చి.. ఎవరైనా కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు చెబుతారు. కట్ చేస్తే.. శంకర్ కారణంగా కొంతమంది అమ్మాయిలను పోలీసులు కాపాడతారు. ఈ క్రమంలో కిడ్నాపర్స్ గ్యాంగ్ లీడర్ అలెక్స్(తరుణ్ అరోరా) శంకర్ గురించి తెలుసుకొని.. మహాలక్ష్మిని టార్గెట్ చేస్తాడు. అక్కడినుండి ఏం జరిగింది? అనేది అసలు కథ. అసలు శంకర్ ఎలా పోలీసులకు సమాచారం అందించాడు? అలెక్స్ నుండి తన చెల్లిని ఎలా సేవ్ చేశాడు? శంకర్ కి భోళా అనే పేరు ఎలా వచ్చింది? అనేది తెరపై చూడాల్సిందే.
భోళా శంకర్.. సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేశారో చూశాం. వేదాలం సినిమా రీమేక్ అని తెలిసినా.. ట్రీట్మెంట్ కొత్తగా ఉందేమో అని ఎవరైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఎందుకంటే.. ఓ సినిమాని రీమేక్ చేస్తున్నామంటే.. అక్కడినుండి తెచ్చి ఇక్కడ దింపేయడం కాదు. ఇక్కడి నేటివిటీని దృష్టిలో పెట్టుకొని.. ప్రేక్షకులకు ఇంకెంత బాగా కనెక్ట్ చేయొచ్చు అనే విధంగా స్క్రిప్ట్ ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఒక భాషలో ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యిందంటే.. దాన్ని మన భాషలో ఎలా సక్సెస్ చేయాలనే ఆలోచనలో.. ప్రతీ విషయాన్నీ పరిశీలన చేయాల్సి ఉంటుంది. అయితే.. ఫస్ట్ స్టెప్ లోనే భోళా శంకర్ టీమ్ రాంగ్ స్టెప్ వేసిందని చెప్పాలి.
తమిళంలో వేదాలం సినిమా హిట్ అవ్వడానికి అజిత్, కథ, అనిరుధ్ మ్యూజిక్.. ఇలా ఏమైనా కావచ్చు. కానీ.. తెలుగు ఆడియన్స్ కి కథ కొత్తదా కాదా? అనేది చూసుకోవాలి కదా! తెలుగులో భోళా శంకర్ తరహా కథలు ఎన్నో వచ్చాయి. చెల్లిని కాపాడుకోవడానికి అన్నయ్య పడే పాట్లు.. ఈ కాన్సెప్ట్ ఇదివరకు చాలా సినిమాలలో చూసేశాం. భోళా శంకర్ కథ కొత్తది కాదు. ఇదివరకు అన్నాచెల్లెళ్ళ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ ఓసారి తిరగేసి చూపించినట్లుగా సాగింది. దర్శకుడు మెహర్ రమేష్.. వేదాలం సినిమాని ఇలా ప్రెజెంట్ చేస్తాడని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు. పైగా బాస్ హీరో అక్కడ. తమన్నా, కీర్తి సురేష్ లాంటి స్టార్ కాస్ట్ ఉంది.
ఇక సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్ గా సాగింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏంటో అందరికీ తెలుసు. అలాంటిది ఆయన్ని పెట్టుకొని.. కామెడీ క్రియేట్ చేయడంలో మెహర్ రమేష్ తడబడ్డాడు. ఇందులో వెన్నెల కిషోర్.. చిరుని తమ్ముడు అని పిలవడం గమనార్హం. యాక్షన్ బ్లాక్స్ స్టైలిష్ గా తీసే డైరెక్టర్.. కామెడీని కాప్చర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సినిమా ఆరంభం అయిన తర్వాత.. అసలు కథలోకి వెళ్తున్నకొద్దీ.. పాటలు అడ్డుగా తగిలినట్లు అనిపిస్తుంది. సరిగ్గా గమనిస్తే.. సన్నివేశాలకు మధ్య లింక్ క్యారీ అవుతున్న ఫీల్ మిస్ అయ్యింది.
యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. కానీ.. పాత సినిమాలలోని కామెడీ సీన్స్ ని ఎందుకు రిపీట్ చేశారో.. ఈ సినిమాకు ఎలా సెట్ అవుతాయి అనుకున్నారో అర్ధం కాలేదు. సెకండాఫ్ లో సినిమా బెటర్. మెహర్ రమేష్ స్టైలిష్ మేకింగ్ ఇక్కడ కనిపిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవుతుంటాయి. కానీ.. సాంగ్స్ వల్ల లింక్ మిస్ అయిపోతుంది. అయితే.. ఆ పాటలు కూడా మెగాస్టార్ రేంజ్ లో లేకపోవడం మైనస్. కాకపోతే యాక్షన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక సినిమా మొదలైనప్పటి నుండి విలనిజం ఎక్కడ కూడా డామినేటింగ్ గా అనిపించదు. శంకర్ క్యాబ్ డ్రైవర్.. అతనికి ఆల్రెడీ భోళా భాయ్ అనే పేరు.. ఆ గతం పాత సినిమాలలో చిరుని గుర్తుచేస్తాయి.
ఇక యాక్టర్స్ విషయానికి వస్తే.. చిరు గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన స్టామినా నవరసాలలో ఉందని తెలిసిందే. కానీ.. మెహర్ రమేష్ చిరుని ఆ రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అయితే.. బాస్ ఎంట్రీ, ఖుషి సాంగ్, స్పూఫ్ వచ్చినప్పుడు థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. మహాలక్ష్మిగా కీర్తిసురేష్, హీరోయిన్ తమన్నా క్యారెక్టర్స్ బాగున్నాయి. బట్ తమన్నా లేకపోయినా పర్వాలేదని అనిపిస్తుంది. విలన్ గా తరుణ్ అరోరా పర్వాలేదు. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, బ్రహ్మాజీ, హైపర్ ఆది, వెన్నెల కిషోర్.. ఇలా అందరు వారి పాత్రలమేరా నటించారు. ‘ఖుషి’ నడుము సీన్ తో శ్రీముఖి క్లిక్ అవ్వొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ డిజపాయింట్ చేసినా.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అనిపించింది. నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి. అయితే.. డైరెక్టర్ మాత్రం రీమేక్ కథను మెప్పించే విధంగా చూపించలేకపోయాడు. చివరిగా మెగాస్టార్ చేయాల్సిన సినిమా కాదు ఇది.
(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)