iDreamPost

Bheemla Nayak Review : భీమ్లా నాయక్ రివ్యూ

Bheemla Nayak Review : భీమ్లా నాయక్ రివ్యూ

2022లో భారీ హైప్ తో వస్తున్న సినిమాగా భీమ్లా నాయక్ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరూ చూస్తున్నదే. తెలంగాణలో బెనిఫిట్ షోల సందడి ఏపిలో పరిమిత షోల హడావిడి వెరసి పవన్ కళ్యాణ్ సునామి ఏ రేంజ్ లో ఉండబోతోందోనని ట్రేడ్ కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూసింది. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అజిత్ వలిమై టాక్ ఏమంత పాజిటివ్ గా లేకపోవడంతో భీమ్లా నాయక్ కు సోలో బాక్సాఫీస్ గ్రౌండ్ దొరికింది. మొదటి రోజు రికార్డుల మోత ఖాయమనే విశ్లేషణలు గట్టిగానే ఉన్నాయి. మరి ఇంత హైప్ లో పవర్ స్టార్ అంచనాలు అందుకున్నాడో లేదో రివ్యూలో చూద్దాం

కథ

శ్రీశైలం అడవుల గుండా తాగి వాహనంలో వెళ్తున్న వాలంటరీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డానియల్ శేఖర్(రానా)కు మధ్యలో చెక్ పోస్ట్ డ్యూటీలో ఉన్న ఇన్స్ పెక్టర్ భీమ్లా నాయక్ తో గొడవ ఏర్పడుతుంది. ఇద్దరూ ఈగోలతో పరస్పరం ద్వేషం పెంచుకుంటారు. భీమ్లా చేసిన అవమానానికి బదులు తీర్చుకోవాలని ప్లాన్ చేసిన డానీ తెలివిగా ట్రాప్ చేసి అతన్ని ఖాకీ డ్రెస్ కు దూరం చేస్తాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరిగిపోయి బద్ధ శత్రువులుగా మారతారు. మరి ఈ చిచ్చు ఎలా రగిలింది భీమ్లా డానియల్ కుటుంబాలు ఇందులో ఎలా ఇబ్బంది పడ్డాయి, చివరికి ఎవరు గెలిచారు ఓడారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి

నటీనటులు

పవన్ కళ్యాణ్ కు ఈ పాత్ర పర్ఫెక్ట్ ఛాయస్. భీమ్లా నాయక్ గా విశ్వరూపం చూపించాడు. కాకపోతే ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లకు అందులో బిజూ మీనన్ చేసిన అండర్ ప్లేనే బెటర్ అనిపించవచ్చు. కానీ అభిమానుల కోణంలో చూస్తే రచయిత త్రివిక్రమ్ చేయించిన ఈ మేకోవర్ కరెక్టే అనిపిస్తుంది. అక్కడక్కడా అరుపులు కాస్త డామినేట్ చేసినట్టు అనిపించినా ఓవరాల్ గా ఫ్యాన్స్ ని ఏ మాత్రం నిరాశపరచకుండా ఫుల్ మీల్స్ పెట్టేశాడు పవన్. అన్నీ కొలత వేసినట్టుగా ఫైట్లతో పాటు అదనంగా పాటలను సెట్ చేయడం బాగా కుదిరింది. రీమేకే అయినప్పటికీ తమ మార్కు ఉండేలా పవన్ తీసుకున్న శ్రద్ధ ఫలించిందనే చెప్పాలి.

రానాకు చాలా గ్యాప్ తర్వాత తన క్యాలిబర్ కు తగ్గ పాత్ర దొరికింది. చాలా సీన్లలో పవన్ కు ధీటుగా సూపర్బ్ అనిపించే స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. డానియల్ గా తను తప్ప ఇంకెవరు సెట్ కారు అన్నంత సహజంగా ఉన్నాడు. నిత్య మీనన్ ఉన్న కాసిన్ని సీన్లలో ఉనికిని చాటుకుంది. సంయుక్త మీనన్ మొదట మొక్కుబడిగా కనిపించినా ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చి గుర్తుండిపోతుంది. సముతిరఖనిది రెగ్యులర్ పాత్రే. రావు రమేష్, శత్రు, రఘుబాబు, కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులందరివి ఎక్కువ తక్కువ కాకుండా నీట్ గా సెట్ అయ్యాయి. మురళి శర్మ కూడా రొటీనే కానీ దీనికి బాగా సూట్ అయ్యాడు

డైరెక్టర్ అండ్ టీమ్

హీరో విలన్ లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఈగో డ్రామాను బేస్ చేసుకుని రూపొందిన అయ్యప్పనుం కోశియుమ్ ని తెలుగు ఆడియెన్స్ టేస్ట్ కు తగ్గట్టు, అందులోనూ అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ ప్లే మాటలు రాసిన త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యధాతథంగా తీస్తే అంత ల్యాగ్ ఉన్న ఒరిజినల్ వెర్షన్ ను మన వాళ్ళు భరించలేరని గుర్తించి దానికి తగ్గట్టు చేసిన మార్పులు బాగా అమిరాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అదనంగా జోడించినా రెండున్నర గంటల లోపే మొత్తం ముగించేయడం ఆయన ప్రతిభకు నిదర్శనం. మాతృకలో సోల్ ని తగ్గించకుండా వీలైనంతగా దానికి కట్టుబడే రాశారు.

దర్శకుడు సాగర్ కె చంద్ర గురించి కాకుండా ముందుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించడానికి కారణం అంతా తానై ముందుండి నడిపించారు కాబట్టి అది ప్లస్ అయినా మైనస్ అయినా అందులో సగం క్రెడిట్ ఆయనకు ఇవ్వాలి. అలా అని సాగర్ పనితనం లేదని కాదు. పేపర్ మీద త్రివిక్రమ్ ఎంత గొప్పగా రాసినా దాన్ని తెరపైన అంతే ప్రభావంతో తెరకెక్కించడంలో డైరెక్టర్ టాలెంట్ చాలా అవసరం. ఈ విషయంలో ఫెయిల్ అవ్వడం వల్లే గతంలో తీన్ మార్ ఫలితం రివర్స్ అయ్యింది. కానీ సాగర్ అలా చేయలేదు. నీట్ గా పవన్ రానా ఇద్దరినీ బాలన్స్ చేస్తూ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా క్లీన్ గా తీసుకుంటూ పోయారు.

ఎంత ఈగోల యుద్ధమైనా కూడా మంచి మలుపులు చాలా అవసరం. నిజానికి అయ్యప్పనుంలో కూడా ఇవి పెద్దగా ఉండవు. కేవలం రెండు మూడు ట్విస్టులతో మూడు గంటల సేపు డ్రామా నడుస్తుంది. అందులో నేటివిటీ కీలక పాత్ర పోషించింది. భీమ్లా నాయక్ అనౌన్స్ చేసినప్పుడు ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనే అనుమానాలు చాలా వచ్చాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ ఒక టీమ్ వర్క్ గా ఈ సినిమాని ఫ్యాన్స్ మెచ్చే కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడంలో సాగర్ ఎఫర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టిస్టుల సెలక్షన్ దగ్గర నుంచి ఫారెస్ట్ సెటప్ కు సంబంధించిన సన్నివేశాల కూర్పు దాకా ప్రతిదీ చక్కగా సాగింది.

కాకపోతే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఎలివేషన్లు పెట్టడంతో సెకండ్ హాఫ్ లో కొంత సౌండ్ ఎక్కువయ్యింది. ఇది ఫ్యాన్స్ కు నచ్చుతుంది. అందులో డౌట్ లేదు. కానీ కామన్ ఆడియన్స్ కి ఇదంతా పూర్తి స్థాయిలో కనెక్ట్ అవుతుందా లేదా అనేది బాక్సాఫీస్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతోంది. ఒకవేళ వకీల్ సాబ్ తో పోల్చుకుంటే కనక అందులో కొంత డ్రైగా సాగే కోర్ట్ ప్రహసనం కన్నా పవన్ రానాల యుద్ధాలు బెటర్ అనిపిస్తాయి. నిత్య మీనన్ ను అరెస్ట్ చేసాక చివర్లో ఎక్కడా కనిపించకపోవడం బహుశా కాల్ షీట్లు లేకపోవడం వల్లో లేక హడావిడిగా రిలీజ్ డేట్ ఉండటం వల్ల తీయలేకపోయారో చెప్తే బాగుంటుంది.

ఇన్నేసి ప్లస్సులున్నాయి కాబట్టి భీమ్లా నాయక్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజని చెప్పడానికి లేదు. ఇద్దరి మధ్య పోరు ఎంత బాగున్నా ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ పూర్తిగా మిస్ అయ్యింది. ఈ సబ్జెక్టులో కామెడీ అవసరం లేదు కాబట్టి దాన్ని మరీ కంప్లయింట్ గా చెప్పలేం కానీ అది కోరుకునే వాళ్ళు ఉంటారుగా. ఇప్పటికే హిట్ అయిన పాటలు విజువల్ గా పర్వాలేదు అంతే. అంత ఇష్టం పాట లేకపోవడం మ్యూజిక్ లవర్స్ ని నిరాశపరుస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే పవన్ పాత్రకు సంబందించిన ఫ్లాష్ బ్యాక్ రెగ్యులర్ గా ఉండటం కొంత మైనస్. బిల్డప్పులు భారీగా ఇచ్చారు కానీ అది చాలా సినిమాల్లో చూసిందే వచ్చిందే. కాకపోతే దానికి క్లైమాక్స్ లో ఇచ్చే లింక్ బాగుంది.

ఫస్ట్ హాఫ్ లో ప్లాట్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం ఎక్కువ టైం తీసుకోవడం కొంత నిడివి పెంచినట్టు అనిపించినా ఆ లోటు క్రమంగా తగ్గించే ప్రయత్నం వర్కౌట్ అయ్యింది. బాగా పేలిన మూడు యాక్షన్ బ్లాక్స్ ని ఆధారంగా చేసుకుని సినిమా అద్భుతంగా ఉందని చెప్పలేం కానీ ఒకవేళ అవి లేకపోతే మటుకు భీమ్లా నాయక్ ని అంత ఈజీగా భరించడం అయ్యేది కాదు. ఇటీవలి కాలంలో కమర్షియల్ సినిమాలు సగం ఎలివేషన్లతోనే బ్రహ్మాండంగా మాస్ కి కనెక్ట్ అయిపోయి బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఈ భీమ్లా నాయక్ కూడా వాళ్ళను అదే కోవలో సంతృప్తి కలిగిస్తే పవన్ కు మరో సూపర్ హిట్ పడ్డట్టే. అందులో అనుమానం అక్కర్లేదు.

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పడానికి ఏముంది. ఎప్పటిలాగే థీమ్ కు తగ్గట్టు మంచి బిజిఎమ్ ఇచ్చాడు. ఇది డిఫరెంట్ టోన్ లో సాగే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఇంతకంటే ఆశించలేం. పాటల గురించి ఆల్రెడీ తెలిసిందే. రవి కె చంద్రన్ ఛాయాగ్రహణంలో విజువల్స్ కు ఫెంటాస్టిక్ అనే మాట చిన్నదే. పెట్టిన ఖర్చు కన్నా రిచ్ నెస్, దర్శకుడు కోరుకున్న ఇంటెన్సిటీ తెరమీద కనిపించడంలో ఈయన అనుభవం మరోసారి మంచి అవుట్ ఫుట్ ఇచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్ మీద పెద్దగా ఫిర్యాదేమి లేదు. సితార నిర్మాణ విలువలు దీనికి ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఇచ్చాయి. క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తుంది

ప్లస్ గా అనిపించేవి

పవన్ ఎనర్జీ
రానా స్క్రీన్ ప్రెజెన్స్
తమన్
పరస్పరం ఛాలెంజ్ చేసుకునే ఎపిసోడ్స్

మైనస్ గా తోచేవి

కొంత స్లోగా సాగే ఫస్ట్ హాఫ్
రెగ్యులర్ గా అనిపించే ఫ్లాష్ బ్యాక్
సింగల్ లైన్ డ్రామా
బెటర్ గా ఉండాల్సిన పాటలు

కంక్లూజన్

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ని ఫాలోయింగ్ ని మైంటైన్ చేస్తున్న హీరోగా పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఏది మినిమమ్ ఉండాలని అభిమానులు ఆశిస్తారో వాళ్ళను పూర్తిగా సంతృప్తి పరిచే సినిమా భీమ్లా నాయక్. న్యూట్రల్ ఆడియన్స్ కి ఇది బెస్ట్ అనిపించకపోవచ్చు కానీ మరీ తీవ్రంగా నిరాశ చెందే అవకాశం ఇవ్వలేదు. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాని ఏ మోతాదులో మెచ్చుతారనేది ఫైనల్ స్టేటస్ ని డిసైడ్ చేస్తుంది. త్రివిక్రమ్ కలం బలంతో దర్శకుడు సాగర్ కె చంద్ర దీన్నో ఈగో యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దిన తీరు అసలు పోటీనే లేని బాక్సాఫీస్ ని తన కంట్రోల్ లోకి తీసుకుంటుందో లేదో చూడాలి

ఒక్క మాటలో – మాస్ నాయక్

Also Read : Valimai Review : వలిమై రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి