iDreamPost
android-app
ios-app

Project K : ప్రభాస్ సినిమాలో పురాణాల లింకు

  • Published Mar 21, 2022 | 2:42 PM Updated Updated Mar 21, 2022 | 2:42 PM
Project K : ప్రభాస్ సినిమాలో పురాణాల లింకు

రాధే శ్యామ్ ఫైనల్ గా డిజాస్టర్ ముద్రతో ఈ వారం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోనుంది. ముందస్తు ఒప్పందాల్లో భాగంగా కొన్ని స్క్రీన్లు కంటిన్యూ చేసినప్పటికీ ఆర్ఆర్ఆర్ వచ్చాక ప్రేక్షకులు దీన్ని ఛాయస్ గా పెట్టుకుంటారని చెప్పలేం. నార్త్ లోనూ ది కాశ్మీర్ ఫైల్స్ దెబ్బకు పరిస్థితి నిరాశాజనకంగా తయారయ్యింది. సాహోని మించిన దారుణమైన ఫలితం దక్కడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. అందుకే వాళ్ళ ఆశలన్నీ రాబోయే వాటి మీద ఉన్నాయి. ముఖ్యంగా కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ మీద మాములు ఆశలు పెట్టుకోలేదు. హీరోయిజంని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే డైరెక్టర్ గా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

ఆది పురుష్ ఆల్రెడీ పూర్తయ్యింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మారుతీ డైరెక్షన్ లో రూపొందే ఎంటర్ టైనర్ ని వచ్చే నెల అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాగ అశ్విన్ తీయబోయే ప్రాజెక్ట్ కె మరో ఎత్తు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించలేని సబెక్టు తీసుకున్న అశ్విన్ ఇందులో ప్రభాస్ ని కల్కి అవతారంలో చూపించబోతున్నట్టు ఫిలిం నగర్ లీక్. వర్తమానం గతం భవిష్యత్తు ఈ కాన్సెప్ట్ మీద గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీ టచ్ చేయని పాయింట్ తో రూపొందుతుందట. అందుకే ఇంత ఎగ్జైట్ మెంట్.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇందులో అశ్వద్ధామగా కనిపించబోతున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. మహాభారతంలో అశ్వద్దాముడా లేక ఇంకేదైనా పురాణంలోని రిఫరెన్స్ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇవే కాకుండా ఇతిహాసాల నుంచి కూడా చాలా అంశాలు ఇందులో పొందుపరిచారట. దీపికా పదుకునే క్యారెక్టర్ సైతం రెగ్యులర్ హీరోయిన్ తరహాలో ఉండదని తెలిసింది. అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ తాలూకు డీటెయిల్స్ మాత్రం ఇంకా బయటికి రాలేదు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు అయిదు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కెకి ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఫైనల్ గా వేరొకటి లాక్ చేస్తారని చెబుతున్నారు.

Also Read : RRR : ఉత్తరాది రాష్ట్రాల మీద రాజమౌళి ఫోకస్