iDreamPost

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మౌలిక సదుపాయాలను ప్రయివేటు సంస్థలు కూడా వినియోగించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసి)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌, గిరిరాజ్‌ సింగ్‌, జితేంద్ర సింగ్‌ కేబినెట్‌ నిర్ణయాలను వివరించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించేందుకు మార్గనిర్దేశం చేయడానికి భారత జాతీయ అంతరిక్ష, అభివఅద్ధి, అధికార కేంద్రం (ఇన్‌-స్పేస్‌)ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర అణు విద్యుత్‌, అంతరిక్ష సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో విధానాల తయారీకి దోహదం చేస్తుందని చెప్పారు.

ఇస్రో మౌలిక సదుపాయాలను ప్రైవేట్‌ సంస్థలు ఉపయోగించుకునేందుకు వీలుగా ఇన్‌-స్పేస్‌ సంస్థను మారుస్తామని తెలిపారు. ఇన్‌-స్పేస్‌ కొత్తదేమీ కాదని ఇంతకు ముందే ఉందని, ఇప్పుడు ఇస్రోలో దాని పాత్రను విస్తరిస్తున్నామని చెప్పారు. అంతరిక్ష విభాగంలో ఇదొక నూతన మలుపుగా ఆయన చెప్పుకొచ్చారు. రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయని, ఒకదాని పరిధిలోకి మరొకటి రాదని స్పష్టం చేశారు. ఇస్రో ఎప్పటిలాగే తన కార్యకలాపాలు నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. తన ప్రాజెక్టులు, మిషన్లు కొనసాగుతాయని తెలిపారు. నిర్ణయాధికారం దానికే ఉంటుందన్నారు.

ఆర్బీఐ పర్యవేక్షణ పరిధిలోకి సహకార బ్యాంకులను‌ తీసుకొస్తూ కేంద్ర మంత్రి వర్గం ఆర్డినెన్స్ ను ఆమోదించింది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయ హోదానిస్తూ కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వెనుకబడిన తరగతుల్లో (ఒబిసి) ఉప వర్గీకరణను పరిశీలించేందుకే ఏర్పాటు చేసిన కమిషన్‌ గడువును మరో ఆరు నెలలు పొడగించారు. వచ్చే ఏడాది 2021 జనవరి 31 వరకు కమిటీ అమల్లో ఉంటుంది. మయన్మార్‌లో ఎ-1, ఎ-3 బ్లాకుల్లో అభివఅద్ధి కోసం అదనపు పెట్టుబడులు పెట్టేందుకు ఒఎన్‌జిసి విదేశ్‌ లిమిటెడ్‌కు అనుమతులిచ్చారు.

రూ.15 వేల కోట్లతో పశు సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రత్యేక నిధికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. అర్హతలున్న లబ్ధిదారులకు వడ్డీలో మూడు శాతం రాయితీ లభిస్తుందని ప్రకటించారు. పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియ మరింత సులభతరం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించనున్నారు. పాస్‌పోర్ట్‌ జారీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హర్యానా ముందంజలో నిలిచాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి