iDreamPost

కాటేస్తున్న కరోనా .. ప్రైవేటు వైద్యం ఏమైంది..?

కాటేస్తున్న కరోనా .. ప్రైవేటు వైద్యం ఏమైంది..?

ప్రైవేటు ఆసుపత్రులు.. దీనిని గురించి ఉపోద్ఘాతం అనవసరం. ఇవి ఏ స్థాయిలో ‘సేవలందిస్తాయో’ ప్రతి సామాన్యుడికి తెలిసిందే. అయితే కోవిడ్‌ 19 అలియాస్‌ కరోనా ప్రారంభమయ్యాక ఈ ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు ఏమయ్యాయన్నదే ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం. రాష్ట్రంలోని అన్ని పేరున్న పట్టణాల్లోనూ వందల సంఖ్యలోనే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. రకరకాల స్పెషలైజేషన్లతో అనేక రకాల ప్రత్యేక సేవలను ఇవి ఇప్పటి వరకు అందించాయి కూడా.

అయితే గత నెల 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జనతా కర్ఫూ మొదలుకుని ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ వరకు ప్రతి రోజూ 200 నుంచి 500ల వరకు ఔట్‌ పేషంట్లను పరీక్షించే ఈ ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నాయన్నదే ప్రశ్న. కొందరు సేవా భావంతో ఆసుపత్రులు నిర్వహించే వైద్యులు వీడియో కాల్స్‌ ద్వారా తమ వద్దకు వచ్చే వారికి అందుబాటులో ఉన్నారు. వారికి వచ్చే అత్యవసర అనారోగ్యాలకు చికిత్సలు కూడ అందిస్తున్నారు. వీరిని పక్కన పెడితే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఏంటన్నదే ఇక్కడి ప్రశ్న. తమ వద్దకు ఎన్నో ఏళ్ళుగా వస్తున్న రోగులను కూడా దాదాపుగా నేరుగా కలిసే ప్రయత్నం కూడా ప్రైవేటు వైద్యులు చేయడం లేదన్నది పలువురు పేషెంట్లు చెబుతున్న మాట. ఆసుపత్రి సిబ్బంది చేతే పరీక్షలు పూర్తి చేయించేస్తున్నారంటున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా దాదాపుగా ప్రైవేటు ఆసుపత్రుల సేవలు నిలిచిపోయాయనే చెప్పాలి. అది వారి ముందు జాగ్రత్తకావొచ్చు లేదా ఇప్పుడొచ్చిన మహామ్మారికి వారి వద్ద వైద్యం లేక కావొచ్చు. జనానికి ఆనారోగ్యం (అది ఏ స్థాయిదైనాకానీ) వచ్చినప్పుడే కదా వైద్యుల అవసరం. కరోనా లాంటి ఉపద్రవం వచ్చిపడితే దానిని ఎదుర్కొనే విషయంలో ప్రైవేటు వైద్యుల పాత్ర ఏంటన్నదే సర్వత్రా వ్యక్తమవుతున్న సందేహం. అత్యవసర సమయంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తప్ప సేవలందించేందుకు స్వచ్ఛంధంగా ముందుకు రాకపోవడం ప్రైవేటు ఆసుపత్రుల ‘సేవా భావాన్ని’ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాల నుంచి అనేకానేక ప్రయోజనాలు పొందుతూ తమ స్వప్రయోజనాన్ని మాత్రమే చూసుకుంటున్నాయన్న అపవాదును మూగట్టుకోవాల్సి వస్తోంది.

మేముకూడా సేవలందిస్తామని ఆయా అసోసియేషన్లు ప్రకటనలు చేయడం తప్పితే, నేరుగా రంగంలోకి దిగిన ప్రైవేటు వైద్యులు అతి అరుదనే చెప్పాలి. పరిస్థితి ఈ విధంగా ఉంటే తమది కేవలం వ్యాపారం మాత్రమేనని సదరు ఆసుపత్రులు చెప్పకనే చెబుతున్నాయి. తమకు నచ్చిన వాళ్ళకు మాత్రమే వైద్యం చేస్తామన్న రీతిలో వీరి వైఖరి సాగుతోంది. వీటి ఉద్దేశం ఇలా ఉంటే ప్రభుత్వాలు వీటికిచ్చే రాయితీల విషయంలో పునరాలోచించుకోవాల్సిందే.

ఇక్కడ ప్రైవేటు వైద్యరంగం నుంచి ఒక సమాధానం ఎదురవ్వొచ్చు. తమ వద్ద ఉండే సిబ్బంది తగిన నైపుణ్యం ఉండదని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బందిలో ఏ స్థాయి నైపుణ్యం ఉంది. సమస్య వచ్చింది, ప్రభుత్వం ఆదేశించింది, పనిచేస్తున్నారు.. అంతే. అదే రీతిలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా పనిచేయాలి కదా. కానీ ఇదెక్కడా జరగడం లేదు. తమ వద్దకు వచ్చే రోగులను ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు సాగనంపుతున్నారు. ఇది ఏ విధంగా సమర్ధనీయం. అంతా బాగున్నప్పుడు వ్యాపారం చేసుకుని, ముప్పు వస్తే ప్రభుత్వంపై వదిలేయడం ఎంత వరకు సమంజసం. ఇటువంటి రీతిలో వ్యవహరిస్తున్న ప్రైవేటు వైద్యరంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన అన్యాయం వెలకట్టలేనిదనే చెప్పాలి.

నాడు–నేడుపై పేదలకు గంపెడాశ..

సీయం వైఎస్‌ జగన్‌ బాద్యలు చేపట్టిన వెంటనే విద్య, వైద్యంపై దృష్టి కేంద్రీకరించారు. విప్లవాత్మక మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరుస్తామని కూడా ప్రకటించారు. అది కార్యాచరణలో ఉండగానే ప్రస్తుతం కరోనా ముప్పు ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాడు–నేడుపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఇప్పుడేకాదు, భవిష్యత్తులో కూడా ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే స్థాయిలో ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దాలన్న డిమాండ్‌ ప్రస్తుత పరిస్థితిని బట్టి బలంగానే విన్పిస్తోంది. లేకపోతే వాతావరణ పరిస్థితులు, మనుష్యుల్లో రోగ నిరోధకశక్తి తగ్గడం, ఇతరత్రా కారణాలతో ఇప్పటి కరోనాకంటే బలమైన వైరస్‌లు దాడి చేసే పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగమే ప్రజలను కాపాడుకోవాల్పిన పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో సమర్ధవంతమైన ప్రభుత్వ వైద్య రంగాన్ని సమగ్రంగా సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి