iDreamPost

సినిమా ఎలక్షన్ల వెనుక రాజకీయ ఎత్తులు

సినిమా ఎలక్షన్ల వెనుక రాజకీయ ఎత్తులు

అదేదో అసెంబ్లీ ఎన్నికలు జరిగే స్థాయిలో హడావిడి చేస్తున్న మా ఎలక్షన్స్ తేదీకి ఇంకా టైం ఉన్నప్పటికీ తెరముందు వెనుక రాజకీయాలు ఊపందుకున్నాయి. పోటీలో ఐదారుగురు ఉంటారనుకుంటే అనూహ్యంగా గత కొద్దిరోజుల్లోనే సమీకరణలు మారిపోయాయి. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ లిస్టు ప్రకటించాక దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. వేరు కుంపట్లు పెట్టి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన జీవిత రాజశేఖర్, హేమ తదితరులు ఇప్పుడు ఇందులోకే చేరడం మంచు విష్ణుకి ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ లాంటి పెద్ద తలకాయలు ప్రకాష్ రాజ్ బృందంలో చాలానే ఉన్నారు. సో మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది

మరోవైపు ఇప్పుడున్న ప్రెసిడెంట్ నరేష్ తెరవెనుక తనవంతుగా మంచు విష్ణుకి సపోర్ట్ ఇస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోనే ఓ పెద్ద హోటల్ లో గ్రాండ్ డిన్నర్ పార్టీని ప్లాన్ చేశారట. దానికి ఇండస్ట్రీ ప్రముఖులకు ఇప్పటికే వాట్సాప్ ప్లస్ ఫోన్ కాల్ ఆహ్వానాలు వెళ్లాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. హేమ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే నరేష్ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విందు మీటింగ్ లో ఇవన్నీ ప్రస్తావించి తన స్టాండ్ ఏంటో చెప్పబోతున్నట్టు తెలిసింది. ఇదంతా అనఫీషియల్ వ్యవహారం కాబట్టి గుట్టుగా జరిగిపోవాల్సిందే.

మెగా సపోర్ట్ బలంగా ఉన్న ప్రకాష్ రాజ్ విజయం మీద ధీమాగా ఉన్నారు. నిన్న రెండోసారి నిర్వహించిన ప్రెస్ మీట్ లో దాన్నే వ్యక్తం చేశారు. మంచు విష్ణు పదే పదే ప్రస్తావిస్తున్నమా స్వంత భవనం గురించి మాత్రం ప్రకాష్ రాజ్ తన ఉద్దేశం చెప్పేశారు. తన దగ్గర స్వంత డబ్బులు అంత లేవని, ఒకవేళ బిల్డింగ్ కట్టించడం ఒకటే గెలుపుకి ఎజెండా అయితే సభ్యులు ఆయన్నే గెలిపించుకునే స్వేచ్ఛ ఉంటుందనే రీతిలో క్లారిటీ ఇచ్చేశారు. సో ఇప్పుడు విష్ణు ప్యానెల్ ని ప్రకటించాక జరగబోయే పరిణామాల కోసం వేచి చూడాలి. మొత్తానికి మా ఎన్నికల సంగతులు మల్టీ స్టారర్ సినిమా రేంజ్ లో ఇప్పుడు సామాన్య ప్రేక్షకులకు సైతం ఆసక్తి కలిగిస్తున్నాయి

Also Read: మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి