iDreamPost

‘అవతార్-2’ను మించిన టికెట్ ధరలు! ఈ మూవీకి భారత్​లో ఎందుకంత క్రేజ్?

  • Author singhj Published - 08:11 AM, Wed - 19 July 23
  • Author singhj Published - 08:11 AM, Wed - 19 July 23
‘అవతార్-2’ను మించిన టికెట్ ధరలు! ఈ మూవీకి భారత్​లో ఎందుకంత క్రేజ్?

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినీ పరిశ్రమలు ఉన్నాయి. కానీ వాటిల్లో హాలీవుడ్​కు ఉన్న క్రేజ్ వేరు. ఇంగ్లీష్ మూవీస్​ అంటే చెవులు కోసుకునే ఆడియెన్స్ కోట్లలో ఉన్నారు. అందుకే హాలీవుడ్ స్టార్లకు అంత పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ తెరకెక్కే భారీ యాక్షన్, సూపర్ హీరోస్ మూవీస్​ను ఇష్టపడేవారు ఎక్కువ. అలాగే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వాళ్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రమే ‘ఓపెన్ హైమర్’. ఈ ఫిల్మ్ జులై 21వ తేదీన వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం భారత్​లోనూ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఓపెన్ హైమర్​’లో హాలీవుడ్ స్టార్ యాక్టర్ సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు.

‘ఓపెన్ హైమర్​’ను 2005లో కై బర్డ్, మార్టిన్ జె.షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమోథియస్ జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. ఇందులో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్​నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఇప్పటికే భారత్​లో ప్రీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఐమాక్స్​లో కళ్లు చెదిరే రేట్లకు టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం మొదటి రోజు షోలకు ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.2,450 పలుకుతోంది. గతంలో ‘అవతార్ 2’కు బెంగళూరులో గరిష్టంగా రూ.1,700 మాత్రమే టికెట్ రేట్ పలికింది. అంతటి క్రేజ్ ఉన్న ‘అవతార్’ సీక్వెల్​కు మించిన రీతిలో ‘ఓపెన్ హైమర్’ టికెట్ రేట్లు ఉండటం అందర్నీ షాక్​కు గురిచేస్తోంది.

అసలు ‘ఓపెన్ హైమర్’ మూవీ ఎందుకింత స్పెషల్ అనడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది దర్శకడు క్రిస్టోఫర్ నోలన్. ఆయన గత చిత్రాలు ‘డార్క్​నైట్’, ‘ఇన్​సెప్షన్’, ‘ఇంటర్​స్టెల్లార్’ సృష్టించిన సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. కంటెంట్, మేకింగ్, వీఎఫ్​ఎక్స్, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమాలు ది బెస్ట్​గా నిలిచాయి. ‘ఓపెన్​ హైమర్​’కు ఇంత హైప్ రావడానికి మరో కారణం సిలియన్ మర్ఫీ. ‘పీకీ బ్లైండర్స్’ వెబ్ సిరీస్​లో ఆయన నటనకు అంతా ఫిదా అయ్యారు. అలాంటి ఈ క్రేజీ కాంబోలో రూపొందిన మూవీ కావడంతో ‘ఓపెన్ హైమర్​’కు ఇంత బజ్ ఏర్పడింది. ఈ చిత్రం కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి