మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా.. రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత ఐదేళ్లకు భిన్నంగా మంచి వర్షాలతో పంటలకు చేతికొచ్చి సంతోషంగా ఉన్న సమయంలో వచ్చిన కరోనా మహమ్మారి రైతన్న వెన్ను విరించింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌తో పంటల ఎగుమతులు లేక మరోసారి దెబ్బ పడింది. ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొని పంటలు కొనుగోలు చేస్తున్న సమయంలో అకాల వర్షాలు మరోసారి రైతులను ముంచాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి.
ముఖ్యంగా కృష్ణా, ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం ,కడప జిల్లాల్లో పలు పంటలు నేలవాలాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 24 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిలినట్లు జిల్లా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో ఏకంగా 22 వేల ఎకరాల్లో వరి పంట నాశనం అయినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కురిసిన వర్షాలకు 1400 ఎకరాల్లో అరటి నేలకొరిగినట్లు అధికారులు అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2,700 ఎకరాల్లో వరి పంట నేలమట్టమయ్యింది. ప్రకాశం జిల్లాలో మిర్చి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. నెల్లూరులో 3000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలకు ఆదేశించింది. పంట నష్టాలను అంచనాలను వేసి రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించింది.
మరోవైపు రైతులకు ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దనే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఉద్యాన పంటలను కూడా పొలాల వద్దే కొనే రైతు బజార్లకు రవాణా చేస్తోంది. ముఖ్యంగా అరటి, టమాటా రైతులకు ఇది ఎంతో ఊరట కలిగిస్తోంది. పంటలకు సంబంధించిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా ఆదేశాలు జారీ చేసింది.
6651