భారత్ – చైనా సరిహద్దుల్లో మన జవానుల వీరమరణంపై సైనికులే కాదు.. కేంద్ర ప్రభుత్వమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. దెబ్బకు దెబ్బ తీసేందుకు సైన్యం సిద్ధంగా ఉంటే.. ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రజలు, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. బ్యాన్ చైనా అంటూ ప్రజలు చైనా వస్తువులపై ఇప్పటికే అనాసక్తి చూపుతున్నారు. కొందరు వ్యాపారులు కూడా చైనా దేశానికి చెందిన వస్తువులు అమ్మబోమని ప్రకటిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర సర్కారు చైనాకు సంబంధించి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దేశంతో గతంలో ఒప్పందం చేసుకున్న మూడు ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టింది. ‘మేగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 పేరుతో పెట్టుబడులకు సంబంధించిన సమావేశంలో చైనాతో మూడు ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. వీటికి సంబంధించి చైనా రాయబారి సన్ వియిడాంగ్ సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుల విలువ 5,000 కోట్ల రూపాయలు. ఈ మూడు ప్రాజెక్టులలో హెంగ్లీ ఇంజనీరింగ్‌తో కుదుర్చుకున్న ప్రాజెక్టు విలువ రూ.250 కోట్లు, గ్రేట్ వాల్ మోటార్స్‌తో కుదుర్చుకున్న రూ.3,770 కోట్ల ప్రాజెక్టు, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ ప్రాజెక్టు విలువ 1,000 కోట్లు ఉంటుంది. భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జూన్ 16న సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది సైనికులు వీర మరణం పొందిన విషయం విదితమే. ఈ ఘర్షణలకు కొద్ది రోజులకు ముందే ఈ సమావేశం జరిగింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టినట్లు సర్కారు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తో కూడా దీనిపై సంప్రదింపులు జరిపినట్టు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు.
ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్, భారత రైల్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లాంటివి ఇప్పటికే కాంట్రాక్టులు.. ఇతరత్రా వాటిలో చైనాకు సంబంధిత ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థపై బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్‌తో భారత రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) 2016లో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ను రైల్వే రద్దు చేసుకుంది. కాన్పూర్ దీనదయాళ్ సెక్షన్‌కు సంబంధించి 417 కిలోమీటర్ల మేర సిగ్నల్స్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్ట్ విలువ రూ. 471 కోట్లు. మరోవైపు… 4జీ అప్‌గ్రేడ్ నిమిత్తం ఉపకరణాలను వినియోగించవద్దని బీఎస్ఎన్ఎల్‌ను కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆదేశించినట్లు తెలిసింది. సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఆగడాలకు నిరసనగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ తోపాటు వాటి పరిధిలోని విభాగాలన్నీ సాధ్యమైనంత వరకు మేకిన్ ఇండియా ఉత్పత్తులనే వినియోగించాలని సూచించింది.
చైనా దురాగతంపై భారత్ దేశమే కాదు.. కొన్ని ఇతర దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి. ఆ దేశ సైనిక చర్యను ఖండిస్తున్నాయి. ఏకాభిప్రాయాన్ని తోసిపుచ్చుతూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం సరికాదని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ఇరుదేశాలతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు.
9059