ఓవైపు గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగుని రీతిలో స్తంభించిన వ్యవస్థ. రోజువారీ పనులతో కడుపు నింపుకునే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. దారితెన్నూ లేనిస్థితిలో కలవరపడుతున్నారు. రాబోయే రోజులు ఎలా ఉంటాయోననే భయాందోళనల మధ్య గడుపుతున్నారు. మరోవైపు ఇలాంటి సమయంలో ఏమి జరుగుతుందోననే ఆందోళనతో కొందరు అతిగా వ్యవహరిస్తున్నారు. అవసరం లేకపోయినా పెద్ద స్థాయిలో నిత్యావసర సరుకులను నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ పరిస్థితి దాదాపు అన్ని చోట్లా ఉంది. దాన్ని సొమ్ము చేసుకునే కొందరు హఠాత్తుగా ధరలు పెంచేస్తున్నారు.
లాక్ డౌన్ తర్వాత ఈ పరిణామాలు అందరికీ స్పష్టమే. అదే సమయంలో వ్యవస్థను కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపుతోంది. మరింత కట్టుదిట్టం చేసేందుకు తగిన చర్యల వైపు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. సమస్య ఉన్నప్పటికీ సరిహద్దుల్లో ఉన్న వారి గురించి ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. చివరకు సీఎం జగన్ చేతులు జోడించి విన్నవించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆయన మరోసారి విన్నవించారు.
అత్యవసర సర్వీసుల్లో భాగంగా ఓవైపు కార్యకలాపాలకు అడ్డంకులు లేకుండా చూడడం, అదే సమయంలో ప్రజలు పెద్ద స్థాయిలో రోడ్డు మీదకు వచ్చి నిబంధనలు ఉల్లంఘించకుండా చూడడం ఇప్పుడు పోలీసులకు ప్రధాన కర్తవ్యం. ఆ విధి నిర్వహణలో కొందరు పోలీసుల తీరుని ప్రజలు హర్షిస్తున్నారు. అభినందనలు తెలుపుతున్నారు. అదే సమయంలో ఇంకొందరు పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఏర్పడుతున్న సమస్యలు పరిస్థితిని చక్కదిద్దే బదులుగా సమస్యలు సృష్టించేలా ఉందని వాపోతున్నారు. మానవతా దృక్పథంతో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్న వారిపై పూలు జల్లుతుండగా అదుపు తప్పుతున్న పోలీసుల వైఖరిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం నాడు ఇలాంటి ఘటనలు పలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో నిత్యావసర సరుకులు మోస్తున్న హమాలీల మీద పోలీసుల చర్య విస్మయానికి గురిచేసింది. హమాలీలు తమ ఆందోళన వ్యక్తం చేసేందుకు రోడ్డెక్కడంతో పోలీసుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
హనుమాన్ జంక్షన్ లో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన ఘటన కూడా వివాదానికి కారణం అయ్యింది. జర్నలిస్టులకు సమాచారం అందించే క్రమంలో పోలీసుల సహకారం అవసరం ఉంటుంది. కానీ కొందరు పోలీసులు తమ పరిధి మించి జర్నలిస్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఇక కొన్ని చోట్ల నివాస ప్రాంతాల్లోకి వెళ్లి సామాన్యులపై లాఠీలు ప్రదర్శిస్తున్న తీరు ఆందోళనకు కారణం అవుతోంది. రోడ్డు మీదకు వచ్చిన క్రమంలో నిలువరించే ప్రయత్నాన్ని అందరూ అబినందిస్తున్నారు. కానీ అదే సమయంలో కాలనీలకు వెళ్లి సామాన్య ప్రజలపై కర్కశంగా వ్యవహరించే ప్రయత్నాన్ని నిరసిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో విధుల నిర్వహణ కత్తిమీద సాములాంటి వ్యవహారమే. కాబట్టి దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. కానీ పశ్చిమ బెంగాల్ లో పోలీసు లాఠీ దెబ్బలకు ఓ రైతు ప్రాణాలు విడిచే పరిస్థితి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులు ఇలాంటి పరిస్థితిపై దృష్టి పెట్టాలి. యధేశ్ఛగా రెచ్చిపోవడం కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే వారిని అదుపు చేయడానికి అవకాశం ఉన్న అన్ని పద్ధతులను వినియోగించాలనే విషయం స్పష్టం చేయాల్సి ఉంటుంది. అనివార్యం అయితే తప్ప రెచ్చిపోవాల్సిన పరిస్థితి రాకూడదని వారించాల్సి ఉంటుంది.కొందరు పోలీసులు ఇప్పటికే గుంజీలు తీయించడం వంటి వివిధ చర్యలతో ఆకతాయిలను అడ్డుకుంటున్నారు. అలాంటి విభిన్న ప్రయత్నాలు చేసి అటు ప్రజల మనసులు గెలవడం, ఇటు కరోనా నియంత్రణలో కీలకంగా వ్యవహరించడం జరగాలి. లేదంటే సామాన్యులు కూడా తిరగబడితే అనవసర గందరగోళం ఏర్పడుతుంది. అది వాంఛనీయం కాదు. కాబట్టి పోలీసు బాసులు అలాంటి ప్రయత్నానికి తగ్గట్టుగా అందరినీ సమాయత్తం చేయడం అవసరం.
6197