iDreamPost
android-app
ios-app

మానవతావాది నాయకుడైతే…

  • Published May 08, 2020 | 6:20 AM Updated Updated May 08, 2020 | 6:20 AM
మానవతావాది నాయకుడైతే…

రాజకీయ నాయకులు గెలుపే ధ్యేయంగా అధికారమే లక్ష్యంగా కృషి చేస్తాడు.. కానీ గెలిచిన తర్వాత ప్రజల పట్ల అతనికి/ఆమెకి ఉన్న స్పృహ ఎలాంటిది అన్నదే వారి వ్యక్తిత్వాన్ని,నిబద్ధతని తెలియజేస్తుంది.దయ, కరుణ, జాలి, ప్రేమతో అవసరంలో వున్నవారికి,నేనున్నా అనే భరోసా ఇస్తూ సాధ్యమైనంతగా సహాయపడాలన్న తపననే మానవత్వం అంటాము.నాయకుడికి మానవత్వంతో పాటు ఓదార్చగల, ఒప్పించగల, సముదాయించగల , నేనున్నాననే భరోసా ఇవ్వగల లక్షణాలు ప్రత్యేక ఆభరణాలుగా నిలుస్తాయి..

నిన్నటి తెల్లవారుజామున విశాఖలోని గోపాలపట్నం LG పాలిమర్స్ నుండి స్టైరీన్ వాయువు లీకవ్వడం వల్ల 12 మంది మరణించడం , 200 మంది వరకు అస్వస్థతకు గురవ్వడం తెలిసిన విషయమే..ఒక పక్క ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తున్న కరోనాతో పోరాడుతున్న తరుణంలో, ఈ ఘటన AP ప్రభుత్వానికి గోరు చుట్టు మీద రోకలి పోటుగా చెప్పుకోవచ్చు..

అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపోయిన వారికి సత్వరమే సహాయం అందించి ,వారి బాధకు కొంతవరకైనా ఉపశమనం కల్పించడమే ప్రథమా విధిగా ఎక్సగ్రేషియా ప్రకటించడం అనాదిగా వస్తున్న ఆచారం అన్నది అందరికీ తెలిసిన విషయమే..

కానీ ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధితులకు కావాల్సింది డబ్బుకన్నా నేనున్నా అంటూ మనో ధైర్యాన్ని ఇచ్చే కొండంత అండ. అది ఇవ్వడంలో AP ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సఫలం అయ్యారని చెప్పుకోవచ్చు..

సరిగ్గా మూడేళ్ళ క్రితం గత ప్రభుత్వ హయాంలో ఏర్పేడులో ఇసుక లారీ ప్రమాదం తీసుకుంటే, ప్రమాదంలో 20మంది చనిపోయినప్పుడు అప్పటి మంత్రి మరియు ముఖ్యమంత్రి కుమారుడైన అయిన నారా లోకేష్ బాధితులను పరామర్శించడం కోసమని వెళ్లి ఎక్సగ్రేషియా ప్రకటించినప్పుడు బాధితుల్లోని ఒక మహిళ ఆగ్రహంతో నీ డబ్బు ఎవడికి కావాలి? అంతకు రెండింతలు నేనిస్తా, నా భర్తను తెచ్చివ్వు అంటూ బాధతో కూడిన ఆవేశంతో మాట్లాడినప్పుడు, ఆమె మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా ఏంటమ్మా నన్నేం చేయమంటావు అంటూ బాధితురాలినే గదమాయించిన లోకేష్ కి, అదంతా వాళ్ళ విధిరాత,ఎవరేం చేయగలరు? కారణం అయినవారిని సస్పెండ్ చేస్తాను అని చెప్పి చేతులు దులుపుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికీ , కరోనాకి సైతం భయపడకుండా, విషవాయువు ప్రభావం ఇంకా తగ్గలేదని తెలిసి కూడా బాధితులను పరామర్శించడానికి స్వయంగా వెళ్లి మరీ,దగ్గరుండి నేనున్నాను అన్న భరోసా కల్పించిన జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా ప్రజలకు స్పష్టంగా తెలియచేయడంతో పాటు, తన ప్రాణం కన్నా ముఖ్యమంత్రి గా తన బాధ్యత, అది నెరవేర్చడంకోసం తనకున్న అంకితభావమే ముఖ్యమని ప్రజలకు తెలియచెప్పారని భావించవచ్చు..

ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాద యాత్ర సమయంలో ఎర్రటి ఎండను, వానను సైతం లెక్క చేయకుండా, అలుపు సొలుపు లేకుండా నిర్విరామంగా నడుస్తూ, ప్రజల బాధలను, అవసరాలను వినే క్రమంలో చంటి పిల్లలు, ముసలి వాళ్ళు, కుష్టు వాళ్ళు అనే తేడా లేకుండా అందర్నీ దగ్గరకు తీసుకొని ప్రేమతో అక్కున చేర్చుకున్నప్పుడు, నానార్థాలు తీసి ఓట్ల కోసం ముద్దుల యాత్ర అగచాట్లు అంటూ మాట్లాడిన నోర్లను, ఈరోజుతో మూపించేశారు అని చెప్పుకోవచ్చు..

స్వయంగా వెళ్లి ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు , బాధితుల్ని ముఖ్యమంత్రిలా కాక కుటుంబ సభ్యుడిలా , సంరక్షకుడిలా వారితో మెలిగి ఆరోగ్య స్థితిగతుల్ని తెలుసుకొని చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, ప్రతిపక్ష నాయకులు సైతం నోటిమీద వేలు వేసుకునే విధంగా ఎక్సగ్రేషియా ప్రకటించి మానవత్వానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉంటుందా అని భావించేట్లు చేశారు.

ఎక్సగ్రేషియా ప్రకటిస్తూ పోయిన ప్రాణాలు తీసుకురాలేను కానీ, మనసున్న వాడిగా ఇది చేయగలను అంటూ చెప్పడం,బాధితులు ఉన్న హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ పక్కన కూర్చుని ఒక సామాన్యుడిని తలపిస్తూ, తరతమ భేదాలు లేకుండా తల నిమురుతూ,భుజం తట్టి , చేతులు పట్టుకుని భయపడకండి అంటూ కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా భరోసా ఇవ్వడం చూస్తే ముఖ్యమంత్రి హోదాని , అధికార దర్పాన్ని , సాటి మనిషిగా తనలోని మానవత్వం డామినేట్ చేసేసిందని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది..