ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా కొత్త సంచలనానికి తెరలేపింది. వైఎస్సార్ హయంలో పునరుద్దరించి మండలికి జగన్ ప్రభుత్వం ముగింపు పలకే దిశలో మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దాంతో ఇక శాసనమండలి కి మంగళం పలికేందుకు తగ్గట్టుగా అసెంబ్లీ ఆమోదం మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత దానిని గవర్నర్ ద్వారా పార్లమెంట్ కి పంపించే ప్రక్రియ ప్రారంభమయినట్టుగానే చెప్పవచ్చు.
Read Also: మండలి రద్దు దిశగా..
నాలుగు రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు అనుగుణంగానే జగన్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి విషయంలో అందరూ ఆలోచించాలని గురువారం నాటి సభలో సీఎం ప్రస్తావించారు. దానికి తగ్గట్టుగానే పలువురు టీడీపీ ఎమ్మెల్సీలకు ప్రభుత్వం గాలం వేస్తుందనే ఊహాగానాలు చెలరేగాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఊగిసలాటలో పడ్డారు. తమ పదవులకు ఎసరు వస్తుందని ఆందోళనకు గురయిన నేతలు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుల ఆమోదానికి మొగ్గు చూపినప్పటికీ చివరకు సర్కారు మాత్రం తాను అనుకున్నట్టుగానే ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
Read Also: రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు బ్రేక్ – అనుకున్నది సాధించిన టీడీపీ
శాసనమండలిని రద్దు చేయడం అంత సులువు కాదు,,సుదీర్ఘ సమయం పడుతుందని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ వీలయినంత వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు యోచిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ శాసనమండలి రద్దు కి సంబంధించిన ఆమోదం పొందేందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అసెంబ్లీ ఆమోదం లాంఛనంగా మారిన తరుణంలో పార్లమెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. గతంలో ఎంజీఆర్ ప్రభుత్వం శాసనమండలిని మూడున్నర నెలల వ్యవధిలోనే రద్దు చేసిన తరుణంలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుందన్నది ఆసక్తిగా మారింది.
Read Also: చిరంజీవి షరీఫ్ క్లాస్మేట్సా? షరీఫ్ బాస్ ఎవరు ?
ఇక శాసనమండలి రద్దుకి కీలక అడుగులు పడిన నేపథ్యంలో టీడీపీకి చెందిన కీలక నేతల పదవులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అధికారికంగా 34 మంది సభ్యుల కలిగిన టీడీపీ కి పెద్ద నష్టం తప్పదు. అదే సమయంలో ఇద్దరు మంత్రులు సహా 9మంది వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పదవీగండం ఎదుర్కొంటున్నారు. ఏడుగురు పీడీఎఫ్ , ముగ్గురు బీజేపీ ఎమ్మెల్సీలకు కూడా చిక్కులు తప్పవు. మొత్తంగా 2006లో పురుడు పోసుకున్న మండలికి 13 ఏళ్లకే ముగింపు పలుకుతున్న వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఇక కేంద్రం లో మోడీ-షా ద్వయం ఎప్పటికీ ఈ తీర్మానాలకు అనుగుణంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.